Monday, June 29, 2009

అంతర్దృష్టి

ఈ మధ్య ఒక రోజున నా మెడ నెప్పిని (లేదా మరో విధమైన నొప్పి) ఒదిలించుకోడానికి నా మనసు రకరకాల ఉపాయాల్నిఏ విధంగా అన్వేషిస్తోందో గమనిస్తున్నాను. సాధారణంగా, ఏ విధమైన బాధగానీ, అసుఖంగానీ కలిగినప్పుడు తత్క్షణమే బాహ్య ప్రపంచంలో పరిష్కారాన్ని వెదకడానికి పూనుకుంటాను. ఉదాహరణలు ఏదైనా మందూ, అహారానుపానం, హోమియోపతి మందు, కైరోప్రాక్టరు సహాయాన్నర్ధించడం, శస్త్రచికిత్సలాంటివి. ఇలాంటి ఉపాయాలు గతంలో ఏమీ పనిచెయ్యలేదని స్పష్టమైనాకూడా మనసు ఊరుకోదు. ఏమైనా కొత్త లక్షణాలు (symptoms) కనిపిస్తే వెంటనే గుండె ఝల్లుమని వాటి నివారణోపాయాల్ని వెతికే ప్రయత్నంలో పడతాను. ఆ రోజున నా మనసు చేసే ఇలాటి ప్రయత్నాన్ని గమనించాను. (ఇలా గమనించడం ఇదే మొదటి సారి కాదనుకోండి.) అప్పుడు నా మనసు పరిష్కారాన్ని అన్వేషించే ఆ ప్రయత్నాన్ని మానేసింది. నా మనోదృష్టి 'లోపలికి’మళ్ళింది. త్వరలోనే ఆ బాధకూడా ఉపశమించింది. (ప్రతిసారీ ఇలా జరుగుతుందని నేను అనడం లేదు.) నేను బాధని 'ఉండనీలే’ అనుకున్నాను. అంటే దానికి పూర్తిగా లొంగిపోయానన్నమాట. (’ఉండనీలే’ అనుకున్నప్పుడల్లా బాధ పోతుందనిగానీ, బాధకలిగినప్పుడు వైద్య సహాయాన్నర్ధించకూడదనిగానీ, వైద్య చికిత్సవల్ల ప్రయోజనం లేదనిగానీ నేను అనడంలేదని గమనించండి.) ఈ సందర్భంలోనే నాకు 'అంతర్దృష్టి’ అనే పదం అర్ధం స్పష్టమైంది. ఈ సమయంలో నా బాధ అంతరించినప్పుడు బాహ్యాంతరాల మధ్య తేడా, దానితో లోపలికి చూడడం అనేదీకూడా లేకుండాపొయ్యాయి.

ఈ ప్రయోగం ద్వారా తెలెసిన విషయమేమిటంటే అ సుఖము ఎరికెలోకి వచ్చిన తత్క్షణంలోనే అహం-పరం అనే విభేదం ఏర్పడడం, దానితోబాటు భయోదయం, భయంవల్ల బాహ్యప్రపంచంలో ఏదైనా ఉపాయం దొరుకుతుందేమోనని చూడడం, దానికోసం ప్రయత్నం చెయ్యడం. అంతే కాదు, కాల విచక్షణ కూడా ఏర్పడుతుంది. అంటే భవిష్యత్తును జరగబోయే వాటివిషయంలో భయం, ఆశ వంటివి కలగడం.

ఈ ప్రయోగాన్ని తల్చుకుంటే అష్టాంగ యోగంలోని ఒక అంగమైన ప్రత్యాహారం గుర్తుకొస్తుంది. ’ప్రత్యాహారం’అంటే ఇంద్రియాల్ని బాహ్యప్రపంచ దృష్టినించి ఉపసంహరించుకోవడం. ’ప్రత్యాహారం’ అంటే బాహ్యవిషయాల్నించి దృష్టిని వెనక్కి తీసుకోవడమని నేను నా విద్యార్ధులకి చెప్పేవాణ్ని. దాని తరవాతి అంగం ’ధారణ’ -- అంటే ఏదో ఒక విషయంపై ఏకాగ్రతని నిలపడం. తరవాతి అంగం ’ధ్యానం’. బహుశా నా ప్రయోగం ఈ పై అంగాల నన్నిటినీ ఒకటిగా చేసి బాహ్యాంతర విభాగాల్నీ, అహం-పరం విభేదాల్నీ లేకుండా చేసిందేమో. నా ప్రయోగంలో మరో విశేషం నా మనసులోని అహం-పరం అనే ద్వంద్వంలో బాహ్యాంతర విషయాల మధ్య తేడా లేకపోవడం; ’విషయం’ అనే భావంలోనే అది నాకు బాహ్యమైనదనే అర్ధం ఇమిడి ఉంది.

’అంతర్దృష్టి’ ’లోపలికి చూడడం’ లాంటి పదాలు ఆధ్యాత్మిక పరిభాషకి చెందినవి. మనస్తత్వ శాస్త్రంలో ’introspection' అనే పదాన్ని ఎక్కువగా వాడతారు. ఎక్కడ ఈ పదాల్ని ఉపయోగించినా, సాధారణంగా వీటి పేరట మనం చేసుకునేవి స్మృతులని ఎరగడం, (ఉదాహరణకి ఒక గత సంఘటనని గుర్తుచేసుకుని అది ప్రస్తుతం జరుగుతున్నట్టుగా దానికి ప్రతి చెప్పడం), శరీరంలోని వివిధ అంగాల్నీ, మనసులోని ఆలోచలనూ, భావాలనూ, ఉద్రేకాలనూ, మనం చేసే కర్యాలనూ, వాటి ఉద్దేశాల్నీ మన ఎరికలోకి తీసుకొచ్చుకోవడం లాంటివి. మనం తెలుసుకునేవి, ప్రతి చెప్పేవీ మన మానసిక ప్రపంచంలోని అంశాలు. మన వ్యాపారాలన్నీ ఈ చైతన్యరంగంలోనే జరుగుతయ్యి. విషయాలన్నీ ఈ రంగంలోనే ఉంటాయి. వాటికి ప్రతి చెప్పడం ఒక దృక్పథంనుంచి జరుగుతుంది. ఈ దృక్పథాన్ని మన గతంనించి తెచ్చుకుంటాము. ఆక్షణంలో అ దృక్పథమే ’నేను’ అనేది. అందుకే ఈ (అహం-పరం) విభజన. కాలమూ, కాలభావమూ ఈ ప్రక్రియలో ఇమిడి ఉన్నాయి. అంటే, ఇలాంటి స్వచైతన్యంనుంచే భూత, భవిష్యత్ వర్తమానాలనే విభజనలు ఉదయిస్తాయి.

ఇలాంటి ఎరిక నిష్పాక్షికంగా ఎప్పుడూ ఉండదని మనకి తెలుసు. ఉదాహరణకి మన చర్యల్ని గమనించినప్పుడు మన పట్ల మనం పక్షపాతంతో ఉంటాము. తరచుగా ఆ దృక్పథం కొద్దో గొప్పో వ్యక్తంగానో, అవ్యక్తంగానో, మాటల్లోనో, మాటలు లేకుండానో, మన ఆలోచనల రూపంలో ప్రకటితమవుతుంది. అంతర్డృష్టితో మన్ని మనం చూచుకునేప్పుడు, ఆ చూచేదాన్ని మన కోర్కెలకి అనుగుణంగా మలుచుకుంటాం. దీని ఫలితంగా, మనకు కనిపించేది మరింత సంతోషకరం గానూ, లేదా ఇదివరకుకంటె తక్కువ బాధాకరంగానూ ఉండాలనీ, మనకు మనం మరింత అంగీకారయోగ్యంగా కనబడాలనీ మన యత్నం. ఇలాంటి వ్యాపారం మనం తెలిసి చేసుకున్నట్లయితే దాన్ని’స్వచైతన్యం’అంటాం. మనకి మనం ఆదేశాల్నిచ్చుకున్నప్పుడుకూడా మనం మరింత అభివృద్ధి చెందాలనీ, మెరుగైన మరో ప్రదేశానికి వెళ్ళాలనీ, ఇంతకంటే ఉత్తములం కావాలనీ మన ఉద్దేశం. అయితే ఇలాంటి వ్యాపారం మనకు పూర్తి ఎరికలేకుండా కూడా చెయ్యగలం -- అప్పుడు దాన్ని ’అంతర్దృష్టి’ అని గానీ ’స్వచైతన్యం’ అనిగానీ అనం.

విషయప్రపంచం నించి మన దృష్టిని మనం ఉపసంహరించుకున్నప్పుడు క్షణికంగానైనా మాటల ద్వారా జరిగే ఆలోచనా స్రవంతి స్తంభించి పోతుంది, మరోక్షణం మరోవిషయం మన దృష్టిని ఆకర్షించిందాకా. అప్పుడు, తిరిగి మన ఆలోచనా ప్రవాహం కొనసాగుతుంది.

తరచూ మన స్వచైతన్యం ఒక యుద్ధ రంగం. దాన్లో నిరంతరగా యత్నం జరుగుతూనే ఉంటుంది. ఈ యత్నానికి చోదన శక్తి మనం పట్టుపట్టిన (మనకు అంటిన) గమ్యాలూ, విషయాలే. ఈ వ్యాపరాన్ని సమస్యల్ని పరిష్కరించుకోవడానికే కాక కోర్కెల్ని తీర్చుకోవడానికీ, (భయం, న్యూన భావం, నేర భావం లాంటి) అవాంచనీయమైన విషయాల్ని నివారించడనికీ, మన గమ్యాన్ని చేరుకోవదానికి వివిధ మార్గాల్నీ, పథకాల్నీ వేసుకోవడానికీ, మన ప్రస్తుత స్థాయిని కొనసాగించుకొని, పరిరక్షించుకోడానికీ, తరుచు ఇతరులకి హానిచేశైనా మనని మనం సమర్ధించుకోవడానికీ, శ్లాఘించుకోవడానికీ, మన వైభవాన్ని ప్రకటించుకోవడానికీ మనం ఉపయోగిస్తాం. ఇదాంతా సాధారణంగా ’ఆలోచన’ పేరట జరుగుతుంది.

మన సమస్యలకు ’బాహ్య’ పరిష్కారాల్ని అన్వేషించడం మానేసినప్పుడు పరిష్కారాల్నే వెతకడం మానుకున్నామన్నమాట. అప్పుడు మనం ఆ సమస్యకు లొంగి పోయినట్లే. కనీసం క్షణికంగానైనా అన్వేషణకు స్వస్తి చెప్పామన్నమాట. (అప్పుడు సమస్య మీద మనకు పట్టు వదిలిందనొచ్చు.) అప్పుడు మన దృష్టి అంతరంగంలోకి మళ్ళిందనొచ్చు. అయితే చూడ్డానికి అంతరంగమే లేదు. దేన్నీ మార్చడానికిగానీ, ఇప్పుడున్నదానికి భిన్నంగా మరోవిధంగా ఉండడానికి యత్నం చెయ్యకుండా, శరీరాంగాల్ని ఎరికగా ఉండే కేవల చైతన్యం మాత్రమే ఇది. ఇందులో బాహ్యమూ లేదు, అంతరమూ లేదు; కేవలం ఉనికి మాత్రమే.

అదే విధంగా, మనం సమస్యకి (బాధకి) ప్రతి చెప్పడం మనేసినప్పుడు, సమస్యని చూచే మన వ్యక్తిగత దృక్పథంకూడా పోతుంది. క్షణికంగానైనా ఆ ప్రతి చూచే యంత్రాంగం, అంటే మన ’అహం’, మన దృక్పథం లేకుండాపోతుంది; కనీసం నిస్తబ్ధంగా ఉంటుంది.

ఈ ప్రక్రియను అతి క్లుప్తంగా, ఎంతో సులభమైనది కనిపించేట్టుగా రాస్తున్నానని నాకు తెలుసు. నా ఉద్దేశం ఈ ప్రక్రియలోని అంశాలను వేలెత్తి చూపడమే; అది అతి సులభమని చెప్పడానికి కాదు. దాని ఫలితం చిరకాలం ఉంటుందనికూడా నేనడం లేదు.

మనం మన ఆలోచనలనించి విముక్తులమైనప్పుడు, అంటే, ఒక గమ్యాన్ని గానీ, పట్టుబట్టిన విషయాన్ని గానీ త్యజించినప్పుడు, అది మనం ఎరికతోనే చేస్తాం. సాధారణంగా ఏదైనా ఉపాయాల్ని ఊహించుకుంటున్నప్పుడూ, మనల్ని మనం సమర్ధించుకుంటున్నప్పుడూ, కాపాడుకుంటున్నప్పుడూ, మనం కలవరపడ్డప్పుడు మనల్ని మనం శాంతింపజేసుకున్నప్పుడూ ఏ విధంగా మనతో మనం మాట్లాడుకుంటామో, అదేవిధంగా, వ్యక్తంగానో, అవ్యక్తంగానో (తెలిసో తెలియకో) ఫలానా విషయాన్ని వదిలేసుకుందామని మనలో మనం అనుకుంటాం. ఈ విధంగా మనకి మనం ఇచ్చుకునే ఆదేశాలు మాటలరూపంలో ఉంటాయి; వాటి ఫలితాలు మాత్రం మాటలరూపంలో ఉండకపోవచ్చు.

దానితో సహగామిగా ఒచ్చే ఆలోచనా స్రవంతి లేకుండా చైతన్యం అనేది ఏమైనా ఉంటుందా అనే ప్రశ్న పై చర్చ వల్ల ఉదయిస్తుంది. అలోచన సతతమూ జరుగుతూనే ఉంటుందని అనలేము. ఉదాహరణకి, యూజీ తాను గోడమీద ఒక గడియారాన్ని చూస్తూన్నప్పుడు తన మనోస్థితిని వివరిస్తూ తన ఉనికి మొత్తం ’అదేమిటి’ అనే ఒక ప్రశ్నార్ధకంగా ఉందంటారు. అంటే అది గడియారమని గానీ, దాన్లో టైము ఇంతైందని గానీ ఙ్ఞానం లేని కేవల చైతన్య స్థితి. (ఆయన గోడమీద ఒక గడియారాన్నిగానీ, కనీసం ఒక వస్తువునిగానీ కేవలం ఎరికతో చూస్తున్నారనడం సమంజసం కాదు. ఆయన కేవలం ఎరికలో ఉన్నారనడం ఉచితం.) తరవాత ఎవరైనా ’మీరు దేన్ని చూస్తున్నారు?’అనిగానీ, ’ఇప్పుడు టైమెంత?’ అనిగానీ ప్రశ్నిస్తే, సమాధానం ఆయనన్నట్టుగా చటుక్కున బాణంలాగా వస్తుంది. అప్పుడు ఆయనకి తనేం చూస్తున్నారో తెలిసిందన్నమాట.

అలాంటి ఎరిక ఎంతకాలం ఉంటుందనేది సంబంధమైన ప్రశ్నకాదు. మనం మరుక్షణంలో మరేదో విషయంలో నిమగ్నులం అయినప్పుడుగానీ, ఏదైనా పరిస్థితి ఉడుకులో ఉన్నప్పుడు గానీ, మనకి విషయాన్ని విరాగంగా చూస్తో, దాని్కీ (మన గమ్యానికీ) మనకూ గల సంబంధం ఏమిటని ప్రశ్నించుకోము; అంటే మనకీ (ప్రతి చెప్పే యంత్రాంగానికీ) ఆ విషయానికీ మధ్య ఒక అంతరాన్ని కల్పించుకోము. ఇక్కడ నా ధ్యేయము ఆ ప్రక్రియని విశ్లేషించి దానిలోని అంశాలని వేలెత్తి చూపడమే.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home