ధ్యానం పరిమితులు
[తెలుగలో కంటే ఇంగ్లీషులో రాయడం సులభమని ఇదివరకే చెప్పుకున్నాను. ఈ కింది వ్యాసం మొదట నా ఇంగ్లీషు బ్లాగులో రాశాను. దాన్నే తెలుగులో్కి అనువాదంచేసి ఈ బ్లాగులో పెడ్తున్నాను. తెలుగు కొంచెం కృతకంగా ఉన్నా మీకు నేను రాసేది అర్ధమవుతుందని ఆశిస్తున్నాను.]
ముందుమాట: ధ్యానం అంటే అలోచనా స్రవంతికి అవరోధం కల్పించడమేనని నా విద్యార్ధులకి చెబుతూండేవాణ్ణి. యోగం చిత్తవృత్తి నిరోధం అనే నిర్వచనానికీ ఈ అభిప్రాయానికీ సామ్యత ఉంది. అయితే, దాని ధ్యేయం మనో వ్యపారాలకి అంతరాయం కలిగించడమే అయినా, తక్కిన మనోవ్యాపారాల్లాగానే ధ్యానం కూడా ఒక మనో వ్యాపారమే. అంటే, ధ్యానం పరమావధి మానసికంగా ఆత్మహత్య చేసుకోవడమేనన్నమాట!
మనం ప్రస్తుతం ఉన్న స్థితికి భిన్నంగానో, దానికన్నా మెరుగుగానో ఉండే స్థితినో, శాంతినో, లేదా జ్ఞానోదయ (enlightenment) స్థితినో పొందాలనే ఉద్దేశమే లేకపోతే మనం ధ్యానానికి పూనుకోము. మనం ఉన్న స్థితినించి మరో స్థితిలోకి తీసుకుపోవాలని ప్రయత్నంచేసి ఆ ప్రయత్నానికి దోహదం చేసేది మన ఆలోచనా ప్రక్రియే కనక, అటువంటి వ్యాపారం మనోజనితమైనదే. ధ్యానం తలపెట్టడానికి ముందు మనకి మన ప్రస్తుత స్థితి ఎలాంటిదో తెలియడం, దానిపై మనకి అసంతృప్తి కలగడం, దానికన్న మెరుగైన మరో స్థితికి దాన్ని మార్చుకోవాలని కోరుకోవడం అవసరం. ఈ క్రింద రాసిన వ్యాసంలో ధ్యానానికి గల పరస్పర విరుధ లక్షణాలూ, అది మూలంలో ఎందుకు ఏవిధంగా విఫలమౌతుందో కూడా ప్రస్తావిస్తాను. ధ్యానానికి గల గుణలోపాల్ని గురించి కూడా మాట్లాడతాను. తరవాత కొన్ని సాధ్యమైన గత్యంతరాల్ని పేర్కొని వాటిగురించి చర్చిస్తాను.
ధ్యానం అంటే ఏమిటి? పాశ్చాత్యదేశాల్లో మనోపశాంతికీ, మనో విశ్రాంతికీ, మనో వేదననుంచి దూరం కావడానికీ ధ్యానాన్ని సర్వసాధారణంగా ఉపయోగిస్తారు. బయో ఫీడ్ బాక్ (biofeedback) రూపంలో రక్తపు పోటుని అదుపులోకి తెచ్చుకోవడం, మెదడులో అల్ఫా రిదమ్ (alpha rhythm) ని పెంపొందించుకోవడం లాంటి వాటికి దాన్ని ఉపయోగిస్తారు. మనో విశ్రాంతికని దీర్ఘ ఉచ్చ్వాస నిశ్శ్వాసలూ, శరీరంలో ప్రత్యేక భాగాల పట్టు విడిపించడం (differential relaxation), వివిధ దృశ్యాల్ని మనసులో ఊహించుకోవడం (visualization) లాంటి వాటిని దీనితో జతపరుస్తారు. ఇలాంటి ప్రయోజనాలకు ధ్యానాన్ని ఉపయోగించేవారికి ధ్యానాన్ని ఏదో జ్ఞానోదయానికో, బంధ విమోచనకో ఉపయోగిస్తున్నామనే భ్రాంతి ఉండదు. ప్రాగ్దేశ సంప్రదాయాల్లో అయితే ధ్యానానికి అంతిమ ధ్యేయం కేవలం మనో విశ్రాంతి మాత్రమే కాక, నిర్వాణమో, మోక్షమో, జ్ఞానోదయం కూడానూ.
ధ్యానం రూపాలూ, ప్రక్రియలూ, పద్ధతులూ: ధ్యానానికి అనేక రూపాలున్నాయి: 1) అతి సాధారణమైన పద్ధతి మరేవిషయాల్నీ పట్టించుకోకుండా మనం ఏపని చేస్తున్నామో దానిపై దృష్టిని ఏకాగ్రతతో ఉంచుకోవడం. ఒకామె కుండ నెత్తిన పెట్టుకొని ఒక వలయం చుట్టూ కన్నెత్తి చూడకుండా, తాను నడుస్తున్నానే ఎరిక కూడా లేకుండా మూడుసార్లు తిరిగి రావడం ఈ సందర్భంలో గుర్తుకొస్తుంది. ఇలాంటి ఏకాగ్రత సంప్రదాయంలో ఒక మోక్షమార్గంగా గుర్తింపబడింది. దీన్ని మనం కర్మమార్గమని పిలవవచ్చు. దానివల్ల మనకు జరిగేదేదీ జరగనిదేదీ అనే ప్రసక్తే లేనంతగా మనం చేసే పనిలో పూర్తిగా నిమగ్నులమై ఉంటాం. అయితే ఏ కార్యంలోనైనా మన లక్ష్యానికి మన సాధనాలు యోగ్యమో కాదో చూచి సతతమూ వాటిని సవరించుకుంటూ ఉండడం కార్య కౌశల్యానికి అత్యవసరం. కార్య ఫలితం అంటే లక్ష్యం ఉండదనీ కూడా కాదు, ఉంటుంది. కాకపోతే ఆ కార్యంవల్ల మనకి ఏం ఒరుగుతుందీ, ఒరగదూ అనే చింతే ఉండదు.
2) దీని తరవాత అతి సాధారణమైన ధ్యానం ఏదైనా మంత్రాన్నిగానీ, దైవనామాన్నిగానీ జపం చేసుకోవడం. అది ఓంకారం కావొచ్చు, దైవనామాలు కావొచు, ఏదైనా ప్రార్ధన కావొచ్చు. దీనికి సహాయకంగా రుద్రాక్షల్ని లెక్కపెట్టుకోవడం చేస్తారు. అయితే, దీనివల్ల ఇబ్బంది ఏమిటంటే మన ధ్యానాన్ని జపానికీ పూసల్ని లెక్కపెట్టడానికీ మధ్య పంచుకోవాలి. అప్పుడు నా ఉద్దేశంలో ధ్యానం అతి భారమవుతుంది.
3) లేదా దైవాన్ని ధ్యానం చయ్యడం, ఆయనతో మన కష్టాల్ని మొరపెట్టుకోవడం, విన్నపాలుచెయ్యడం, ఆయన్ని స్తుతిచెయ్యడం. ఈ చివరి రెంటినీ మనం భజనల్లో తరచూ ఛూస్తాం.
4) తరచుగా మనం అవలంబించే పద్ధతుల్లో ఒకటి ఆత్మవిచారం: అంటే ఆత్మ నిజస్వరూపం ఏమిటో పరిశీలించడం. శ్రీ రమణ మహర్షి బోధించినట్టుగా ’నేను ఎవరు?’ ’నేను ఎవరు?’ అని పదేపదే మనల్ని మనం ప్రశ్నించుకోవడం.
5) ఊరికే కూర్చొని మనసులో జరిగే విషయాల్ని నిర్లిప్తంగా అవేక్షించడం మరొక పద్ధతి. సోటో జెన్ (Soto Zen)వంటి సంప్రదాయాలు ఇలాంటి పద్ధతిని అవలంబిస్తాయి. మనం పరశీలించే విషయాల జోలి కలిపించుకోకపోవడం ఈ పద్ధతికి గల విశిష్టత. ధ్యానానికి గమ్యం అంటూ ఏమీ ఉండకూడదు. లక్ష్యమనేది ఏదైనా ఉంటే ఆధ్యానం కృతకమవుతుంది; కలిగే ఫలితాల్ని లెక్కపెట్టుకుంటూ, పోలుస్తూ, ధ్యాన విషయాల్లో జోలి కనిపించుకుంటాం కనక అప్పుడు మనలో మనకు సంఘర్షణ తప్పదు.
6) మరో పద్ధతిలో గోడమీద ఒక చుక్కపైగానీ, భ్రూమధ్యదేశాన్నిగానీ చూడడం, ఊపిరిపై దృష్టిఉంచి అది ముక్కుపుటాల్లోకి ఏవిధంగా ప్రవేశించి నిష్క్రమిస్తుందో గమనించడం జరుగుతుంది. కొన్ని ధ్యానాల్లో ఊపిరిని గమనిస్తూ దాన్ని లెక్కపెట్టడం చేస్తాము. యోగాభ్యాసంలో ఉచ్చ్వాసాలకంటే నిశ్శ్వాసాల్ని దీర్ఘంగా పొడిగించడంవల్ల విశ్రాంతి లభిస్తుందనే విషయం చిరకాలంగా తెలిసిన విషయమే.
7) మరికొన్ని సాధనల్లో ఆలోచనని ఉపయోగించి మనకీ, భయం, ఉదాసీనత లాంటి సమస్యలైన విషయాలకీ మధ్య అంతరాన్ని కల్పించుకుంటాం. ఆ విషయపు పూర్తి సందర్భాన్ని గుర్తించడం, మన కార్యాల అంతిమ పర్యవసానాలగురించి ఆలోచించడం, మన ప్రవర్తనని మరో దృక్కోణంనించి ఇతరులు చూచినట్టు చూడడం, మన భయాల్ని వాటి చరమ స్థాయిలోకి తీసుకువెళ్ళి ఆ పర్యవసానాల్ని అంగీకరించడం లాంటివి ఈ పద్ధతిలో సామన్యం. ఈ పద్ధతి ఉత్కృష్టత ఏమిటంటే తాత్కాలికంగానైన మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్నించి మనకి విమోచనం కలిగుతుంది. ఒక్కొక్కప్పుడు విషయాలపై కొంతకాకపోతే కొంత వైరాగ్యం కూడా కలగొచ్చు. (శంకరాచార్యుని భజగోవిందం, బౌద్ధమతంలోని శరీరాంగ వర్ణనలూ, మనకి మృతి ఎలా కలుగుతుందో, అప్పుడు మన శరీరానికీ దాని అవయవాలకీ ఎలాంటి పరిణామం కలిగి స్మశానంలో ఏ విధంగా తగలపడి బూడిదౌతుందో -- ఇలాంటి వివరాలు ఈ సందర్భంలో మనకు గుర్తుకొస్తాయి.) విపశ్శన లాంటి కొన్ని ధ్యాన ప్రక్రియలు మన కార్యాల్ని మూడో్కంటిదృష్ట్యా నిష్పాక్షికంగా పరిశీలించి, వాటిని కేవలం మనంచేసే పనులలాగా కాకుండా, ప్రస్తుతంలో ఈ శరీరంలో ఇచట జరిగే కర్తృ రహిత కార్యాలుగా భావించాలని బోధించి, మనకు మన కార్యాల విషయమై అహంకార రహితమైన దృష్టిని కల్పించి వైరాగ్యాన్ని ప్రోత్సహించడమే ఈ పద్ధతి పరమోద్దేశం.
8) ఇలాగే ఇంకా విపశ్శన మొదలైన పద్ధతుల్లో మనకీ మన శరీరావయవాలకీ, మన ఆలోచనలకీ, మన ఆవేశాలకీ మధ్య ఎరుక అనే అంతరం కల్పించడం కద్దు. ఈ ఎరుక కేవలం ఎరుకమాత్రమే; మన ఆలోచనలో మామూలుగా జరిగే వ్యాఖ్యలకి దీన్లో చోటులేదు. ఎలా చేస్తున్నామో చూస్తూ నేల ఊడ్చడం, పళ్ళు తోముకోవడం, నేలమీద ఏవిధంగా మన అడుగు పడి లేస్తుందో చూడడం, మనకు కోపం వచ్చినప్పుడు ఆ కోపం ఏ విధంగా ఆవిర్భవిస్తోందో, దాని ఉనికి ఎలా ఉంటుందో, ఏ విధంగా తన సమయం గడిచిన తరవాత అది సమసి పోతుందో ఎరికతో చూడడం ఈ పద్ధతికి కొన్ని ఉదాహరణలు. మనం గమనించే విషయాలపై నిష్పాక్షిక దృష్టిని కల్పించి, వాటిపై నిరహంకారాన్ని బోధించడమే ఈ పద్ధతికి గల విశిష్టత.
9) ఈరోజుల్లో వాడకంలో ఉన్న మరో పద్ధతి శరీర ప్రత్యకావయవాలపై ఏకాగ్ర దృష్టిని ఉంచి వాటిని సులువు (relax) చెయ్యడం. శారీరికమైన బాధలకు ఈ విధంగా ఉపశమనం కలిగిస్తారు ఈ పద్ధతి సహాయంతో. బాధ ఉన్న ప్రదేశంపై పూర్తి ఏకాగ్రతను నిలుపుతూ, లోతుగా ఊపిరిని పీల్చి వదలుతూంటే అది బాధని పోగొట్టడానికి సహాయపడుతుంది.
10) ఫెల్డన్క్రైస్ (Feldenkrais) అనే పద్ధతిలో కూడా కదలికలో ఎరికను ప్రవేశపెడ్తారు. దీని సహాయంతో మస్తిష్క-కండర సంబంధమైన సమస్యలు (కొన్ని మానసిక సమస్యలు కూడా) వైద్యులు సఫలంగా పరిష్కరించ గలిగారు. ఒకవిధంగా చూస్తే ఈ పద్ధతికీ ఉచ్చ్వాస నిశ్శ్వాసలూ ఎరికల సహాయంతొ అసనాలు వెయ్యడానికీ సాదృశ్యం ఉన్నది.
ఈ విధంగా ఇంకా మరెన్నింటినో లెక్క వెయ్యొచ్చు.
ధ్యానం ఫలితాలు: వారి వారి నమ్మకాల్ని బట్టీ, ఆయా ధ్యాన పద్ధతుల్ని బట్టీ ధ్యానం ఫలితాలు వివిధాలుగా ఉంటాయి. క్రైస్తు దర్శనం గానీ, కృష్ణ దర్శనం గనీ కావొచ్చు, విశ్వంతో ఐక్యభావాన్ని సాధించొచ్చు, శరీరానికి తాను బయట ఉన్నట్టు అనుభవం కావొచ్చు, అసలు శరీరమేలేనట్టు అనుభవం రావొచ్చు, తనకు తలకాయే లేదనే భావం రావొచ్చు, విశ్వాన్నే అలింగనం చేసుకునేంతగా తన చైతన్యం విస్తారం కావొచ్చు, దివ్యానందానుభూతి కలగొచ్చు, పూర్ణ శాంతి, విశ్వంతో సామరస్యభావం కలగొచ్చు, లేదా విశ్వశక్తిలో తాను లీనమైనట్టు అనిపించొచ్చు. ఇలా ఈ జాబితాను అంతులేకుండా రాసుకోవచ్చు. కొందరు తమకు సిద్ధులూ, అతీంద్రియ శక్తులూ, పూర్వజన్మ జ్ఞానమూ, భవిష్యత్ జ్ఞానమూ, అద్భుత చికిత్సా శక్తేకాక, పదార్ధపు అంతర్నిర్మాణ జ్ఞానం కూడా సంపాదించామని చెప్పుకుంటారు. లేదా కేవలం విశ్రాంతిగా జీవితకార్యాలను సులభంగా, తేలికగా సాగించుకుంటూ పోవడమే కొందరి ధ్యేయం.
విశ్రాంతి, విమోచనం: ధ్యాన ఏవిధంగా జరుగుంతో, దానిలోని ప్రక్రియలేమిటో పరిశీలిస్తేనేగానీ, అది ఏవిధంగా పనిచేస్తుందో, ఒక వేళ పనికొస్తే అది మనకు ఏవిధంగా ఉపయోగ పడుతుందో తెలియదు. ధ్యానంలో మనం దేనిమీదనైనా ఏకాగ్రతగా దృష్టినుంచతాం, లేదా పూర్తిగా విశ్రాంతిగా (relax) ఉంటాం. ఏది చేసినా, మన ముందర దృష్టిలో ఉంచుకున్న విషయంతోగానీ, మనకు నేపధ్యంలో కనబడే విషయంతో గానీ జోక్యం కలిపించుకోకూడదు. అందుకనే మనసులో విషయాల్ని అణిచిపెట్టుకునేవారూ, తమలోని అవాంచనీయమైన విషయాల్ని ఎదుర్కోలేనివారూ ధ్యానాన్ని తలపెట్టడం వాంచనీయం కాదు. ఏ విషయాలైనా దృష్టిలోకి వచ్చినప్పుడు ఒచ్చినవాటిని వచ్చినట్టే పోనియ్యగలుగుతే ఆ విషయాల్నించి మనకు విముక్తి కలగడం సాధ్యం, ముఖ్యంగా పొరలపై పొరలు గల సమస్యను ఎదుర్కొన్నప్పుడు దాన్లో అన్నిటికంటే అడుగును ఉన్న పొరని ఎదుర్కొన్నప్పుడు. ఇలాంటి ప్రక్రియను మనం ఆత్మజ్ఞానం అనొచ్చు.
ఉదాహరణకు భయం. సాధారణంగా భయాన్ని మనం విరోధభావంతో చూస్తాం. భాయానికి వెనక ఆ భయకలిగించే విషయం బెదిరింపు మనకు తోస్తూనే ఉంటుంది. ఆ బెదిరింపు ఫలితాలంటే మనకు భయం ఉంటుంది. మనం ఆ భయం ప్రక్రియనూ, మనం భయపడే బెదిరింపు ఫలితాల్నీ నిర్లిప్తతతో చూడగలిగితే, మనకి జరిగే అన్నిటికంటే అనిష్టమైన పర్యవసానాల్నిగుర్తించి వాటిని పూర్తిగా అంగీకరించ గలిగితే, ఆ భయకారణ విషయంవల్ల మనకి ఆపదా, బెదిరింపూ ఉండవు.
ఇలాగే ఒక వైఫల్య్భావంగానీ, మరో వ్యక్తితో సంఘర్షణ గానీ, ఉదాసీనభావం (depression) గానీ. మనం ఎంతో భయపడే సంఘటనతోగానీ, మనం ఎంతో కావలనుకునే విషయం లభ్యం కాకపోవడంతోగానీ మనం సమాధాన పడగలిగితే, మనం రాగ ద్వేషలతో చూచే విషయాలవల్ల ఏర్పడే భయంనించిగానీ, వైఫల్యభావంనించిగానీ మనకు విముక్తి కలుగుతుంది. అలాగే మన సుముఖ విముఖ భావాల్నించీ, నమ్మకాలనించీ, దురభిమానాల్నించీ మనకు విమోచనం కలగొచ్చు.
ఆత్మజ్ఞానం అని నేను పైనచెప్పిన ధ్యానప్రక్రియలో మనం మనలో పాతుకపోయిన అభిమానల్ని, ముఖ్యంగా ప్రాణానికీ, ఆరోగ్యానికీ సంబంధించిన వాటినీ, బాధా, మృత్యువూ లాంటి వాటిపైన విరోధభావాల్నీ ఎదుర్కొంటాం. వాటినికూడా మనం త్యజించగలిగినప్పుడు ఏదీ మనకు ముఖ్యంకాని స్థితికి వస్తాము. అంటే మనకు జీవించినా మరణించినా తేడాలేని స్థితి. అలాంటి స్థితిలో మనం కేవలం చైతన్యంగా మాత్రమే మిగిలి ఉంటాము. అలాంటి స్థితిలో ఉన్న క్షణంలో అలోచనలు కేవలం శబ్దాల్లాగానూ, అనుభవాలు మనసులో మెదిగే బొమ్మల్లాగానూ అవుపిస్తాయి. మనం వాటిని స్వేచ్చగా రానివ్వనూ వచ్చు, పోనివ్వనూ వచ్చు. వాటికి పూర్వం ఉన్న తీవ్రతా, మనమీద పట్టూ ఉండవు. వాటికి పూర్వం ఉన్న ఆవేశ తీవ్రత చల్లారిపోతుంది. (ఇలా మనం మన ఘోష ఏ స్నేహితుడితోనైనా చెప్పుకున్నా, చర్చిలో పూజారి (priest) దగ్గర మన బాధల్నీ, తప్పిదాల్నీ ఒప్పుకున్నప్పుడు (confess) కూడా ఇలా జరగొచ్చు.)
ఈ విధంగా పైనచెప్పినట్టు మనం మనసులోని విషయాలను గమనించగలుగుతే, వాటితో జోలికల్పించుకోకుండా వాటిని చూడగలుగుతాం కనక మనకు వాటి విషయమై అనుకోకుండానే విరాగం ఏర్పడుతుంది. అంటే మనం మన మనసులోని విషయాల్ని విసర్జించగలుగుతున్నామన్నమాట.
పరిమితులు (Limitations): ఇలా కలిగే స్వేచ్చ కేవలం తత్కాలికమే కావొచ్చు. ఆ ఆలోచనల్లోనో అనుభవాల్లోనో దేన్లోనైన మనం మల్లీ ముణిగి పోయి సంఘటనలు ప్రస్తుతం జరుగుతున్నట్టుగా వాటి విషయమై మనం ప్రవర్తించవచ్చు. అంటే విషయాలపై పూర్వ అభిమానాలు తిరిగీ తలెత్తుకుంటున్నాయన్నమాట. అలాంటప్పుడు పైన పేర్కొన్న ధ్యానాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూండాలి. అందుకని ఇలాంటి విమోచనం తాత్కాలికం మాత్రమే అవుతుంది.
అంటే ధ్యానంద్వారా వచ్చే తెరిపిడీ, విమోచనమూ కేవలం సాపేక్షికమూ (relative), తాత్కాలికమూ అన్నమాట. దానివల్ల మనలో శాశ్వతమైన మార్పులు వస్తాయనుకోకూడదు. అభిమానాలకి కారణమైన సంస్కారాలు (conditionings) చాల గాడమైనవవొచ్చు; అవి మన ఎరికకు అందకపోయేంత గాఢంగా ఉండొచ్చు. అందుచేత అలాంటి సంస్కారాల్ని ధ్యానం పూర్తిగా పెళ్ళగించలేకపోవచ్చు. అలాంటి ధ్యానం పరిమితమైనదే అయినా అది నిష్ప్రయోజనమైనదని అనుకోకూడదు.
విశ్రాంతితీసుకోవడం (relaxation) కూడా ఇలాంటిదే. విషయాలని సన్యసించగలిగిన మేరకు మనం విశ్రాంతి పొందగలుగుతాం. మనం మన మనసులో ఎదుర్కొంటున్న వివిధ అభిమానాల, పట్టుల సమక్షంలో మనం భౌతికంగా విశ్రాంతి పొందగలగడంవల్లనే మనకు వాటినించి విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. మన శరీరమూ మనస్సూ వేరే వేరే వస్తువులు కావని దీనివల్ల స్పష్టమవుతుంది.
క్షణికంగానైనా విషయాలని కావాలని విసర్జించి ఇలాంటి చైతన్యాన్ని మన మనసులోకి మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవచ్చు. క్రమక్రమేణా ఈ ప్రక్రియ క్లుప్తమై పూర్వం ఎంతో క్లిష్టమైన ఆత్మ జ్ఞానం ఒక్క గుళికగా మారొచ్చు. అయితే మళ్ళీ ఆ ఆలోచనా చెలగాటంలో పడడం కద్దు.
ఇలాంటి విమోచనం తత్కాలికమూ, సాపేక్షికమూ కావడానికి కారణం మన మనో వ్యాపారాలన్నిటికీ మూలంలో ఉన్న జీవితంపైన లంపటమే. ఈ లంపటం, పీకులాట అహం మనుగడకి ఎంతో అవసరం. మానసికమైన మనుగడ భౌతిక మనుగడకి విస్తరణమే. మన మనసుకి ఆ రెంటికీ మధ్య తేడా ఉందనిపించదు. జీవితంపైన మనకున్న ఈ పట్టు ప్రాణభీతిగానూ, వార్ధక్యం, వ్యాధి, నష్టాల గురించిన భయంగానూ వ్యక్తమవుతుంది. వీటికి విపర్యయంగా సుఖాపేక్ష ద్వారా మన మనుగడను పొడిగించుకోవడంద్వారా కూడా ఈ పట్టు ప్రకటితమవుతుంది. ఈ పట్టునించి మనం విముక్తులమయ్యామని భ్రమిస్తూండొచ్చుగానీ, జీవితంలోన విషయాలనూ, మనుషులనూ, సంఘటనలనూ మనం ఎదుర్కోవాల్సిన సమయం, అవకాశం ఏర్పడ్డప్పుడు ఆ పట్టు తలెత్తి భయాల్లోనూ సుఖాపేక్షణలోనూ తిరిగి మనం నిలువునా మునిగిపోతాం.
అందుకనే ఇలాంటి సాపేక్షమైన విముక్తికీ సంపూర్ణ విమోచనానికీ ఎంతో తేడావుందంటాను. పరిపూర్ణమైన విముక్తిలో జీవేచ్చే ఉండదు. ప్రాణం అంటే రాగమూ, మరణమూ, వార్ధక్యమూ, బాధా, వ్యాధీ, నష్టమూ అంటే ద్వేషమూ ఉండవు. ఇలాంటి గుణం మనుషుల్లో చాలా అరుదు. మరణ సాన్నిధ్యంలో ఉన్నప్పుడు యూజీలో ఇలాంటిది చూడగలిగాను. నా అనుభవంలోనూ, యూజీ మరణావస్థలో ఉన్నప్పుడు తాను అంతిమక్షణం వరకూ యూజితో ఉన్న సందర్భంలో మహేశ్ భట్ రాసిన దినచర్య ప్రకారంగా కూడానూ, జీవన్మరణాలంటే యూజీ ఎప్పుడూ లెక్క చెయ్యలేదనీ, వ్యాధి బాధా నివారణలకోసం ఆయన వైద్య సహాయాన్ని ఎన్నడూ(పళ్ళని పీకించుకోవడానికి తప్ప) అర్ధించలేదనీ నేను చెప్పగలను. (ఆయన ’విపత్తు’ ముందటి విషయం గురించి నేను మట్లాడడంలేదు). ఇది నా ఉద్దేశంలో ఎంతో గమనించతగిన విషయం. ఇది అందరికీ వాంచనీయమో కాదో నాకు తెలియదు గానీ సంపూర్ణ విముక్తి అంటే ఇదేనని నాకు తెలుసు.
దురదృష్టవశాత్తూ ఇలాంటిది మన కావాలని ప్రయత్నిస్తే జరిగేది కాదు. ఇందుకు కారణం మన మానసిక అస్తిత్వం దృష్ట్యా చుస్తే ఇది కేవలం మానసికంగానేకాక భౌతికంగా కూడా ఆత్మహత్య చేసుకున్నట్టవుతుంది. అందుకనే యూజీ అప్పుడప్పుడు అంటూ ఉండేవారు: "ఇలాంటి దేదన్నా జరగలంటే సాక్షాన్మరణం సంభవించాలి." అంటే అది కావలనుకుంటే జరిగేది కాదని.
అత్యానందము, శక్తి వంటి అనుభవాలు: ఒకసారి క్షణికంగానైనా మనసులోని విషయాలనించి (అంటే అహాన్నించి) విమోచనం కలిగినప్పుడు, అనంద సహితంగా గానీ, అది లేకుండాగానీ, శక్తి ఉప్పొంగి, శరీరం అంతటా తరంగాలుగా ప్రవహించడం కద్దు. దీన్ని ఒక్కొక్కప్పుడు విమోచనం అని అంటారు. కాని అవి కేవలం వచ్చిపొయ్యే భావాలు మాత్రమేనని, వాటిని నిజమైన విముక్తిగా భావించకూడదనీ సంప్రదాయం హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇలాంటి అనుభవాల పర్యవసానం ఆ మిగిలిన రోజంతా మనో భారం తేలికై మనసు ఉల్లాసంగా విశ్రాంతిగా ఉండడం, కనీసం గతంలోనించి మరి ఏదైనా సమస్యగానీ, విచారంగానీ, ఆందోళనగానీ రానంతవరకూ.
సాంప్రదాయికంగా ఇలాంటి తాత్కాలిక స్థితిని విముక్తి అనరు. విముక్తి అంటే ఒకే ఒకసారి సంభవించే విప్లవం. ఇలాంటిది సంకల్పించి చేసుకునే ధ్యానంవల్ల సంభవించదని నా అభిప్రాయం. దీనికి కారాణాలు ఈ కింద వివరిస్తాను. అంటే అది జరగడం అసంభవమని కాదు; అది మనం సంకల్పంతో చేసుకునే ప్రయత్నంద్వారా గానీ, కావాలని చేసుకునే ధ్యానం సహాయంతో గానీ జరిగేది కాదని.
విమర్శ: పునరుక్తిగా చెప్పాలంటే, మనో వ్యాపారాల్ని నిరోధించాలనే ఉద్దేశంతో చేసినా, ధ్యానం కూడా ఒక మనో వ్యాపారమే. తత్క్షణమే కాకపోయిన, క్రమేణా జరుపుకునే ఆత్మహత్య అది. ఈ వ్యాపరానికి నేపధ్యంలో అది చివరికి మనల్ని మన ధ్యేయం దగ్గరికి తీసుకు వెళ్తుందనే ఆశ ఉంటుంది. ఆ ధ్యేయమేమిటంటే మనం మన మనో వ్యాపారాలనించీ, గమ్యాన్వేషణనించీ విముక్తులమవడమే. కానీ ఆ ప్రయత్నం సఫలం కానేరదు.
ధ్యానం చెయ్యడం విశ్వసించడం, ప్రార్ధించడం లాంటిది. ధ్యానం చెయ్యగా చెయ్యగా చివరికి మనం అహాన్నించి విముక్తులౌతాం అని మీరనొచ్చు, నమ్మకం ఉంటే కొండల్నే ఎత్తగలం అన్నట్టు. "అది సఫలం కాకపోతే అది మీ లోపమే; అంటే మీరు అవసరమైనంత ధ్యానం చెయ్యలేదన్నమాట," అని అంటారు. ఇది కేలం ఒక పునరుక్తి వాక్యం మాత్రమే -- చూడండి: "అహానికి దూరమైనప్పుడే మీరు అవసరమైనంత ధ్యానం చేశారన్నమాట. ధ్యానం సఫలమైందంటే మీరు అవసరమైనంత ధ్యానం చేశారన్నమాట."
ఈవిధంగా మీరు ధ్యానం అనేది ప్రత్యేకంగా ఏదీ చెయ్యకుండా తిరుగుతూంటారనుకోండి. కాని మీలోని ఎరిక మాత్రం పోదు. ముందుకూ పోలేక, వెనక్కీ తిరగవెళ్లలేక ఉన్నచోటే నిలబడి స్తబ్ధులై ఉంటారు. అయితే మీలో ఏంజరుగుతున్నా దాన్నిగురించిన ఎరిక మాత్రం మీలో ఉంటుంది. ఎడతెరగని వలయాల్లో ఈ విధంగా చిక్కుకొని, ధ్యానం చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ, మళ్ళా ధ్యానం చేస్తూ, మనో వ్యాపరాల్ని గమనిస్తూ, తిరిగితిరిగి విఫలులై, ధ్యానాన్నే త్యజించడానికీ, అన్నింటినీ త్యజించడానికీ ఫూనుకుంటారు.
ఒక్కొక్క సమయంలో ఏం జరిగినా మీరు లెక్క చెయ్యరు; అన్నింటినీ కేవలం గమనిస్తూంటారు. అయితే మరుక్షణంలో అలోచనా కార్యక్రమంలో ముణిగిపోతారు, ప్రపంచంలో జరిగే విషయాలకి అహంభావంతో సమాదానం చెప్తూ. ఈ ప్రయాణానికి అంతంలేదు; ఆశకూడా మిగలదు.
అప్పుడు ఒక మూల ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది.
మనస్సుకున్న స్వభావం దృష్ట్యా చూస్తే దీన్లో విచిత్రం ఏమీ లేదు -- ఇలాంటిది జరిగి తీరాల్సిందే. ఒక్క క్షణం లంకె తగులుతుంది; మరో క్షణంలో ఆ లంకె విడిపోతుంది.
సాధ్యమైన కొన్ని పరిష్కారాలు: ఇంతవరకూ మనం ఎలాంటి పర్యవసానాలకి రాగలిగాం? 1) ధ్యానం చెయ్యడం కాలం వృధా చెయ్యడమే. 2) ధ్యానం మహా చేసేది రాగద్వేష రహిత తటస్థ స్థితైన ఎరికిలోకి తీసుకు వెళ్ళ్డమే. కాని దాన్లో మనం ఉండడానికి అది సహాయపడలేదు; ఎందుకంటే అది చపలమైన అస్థిరస్థితి. ప్రపంచంలోని ఏ విషయాన్నైనా ఎదుర్కొన్నప్పుడు యాంత్రికంగా పూర్వానుభవ ప్రభావాలకు గురవుతాం. ఆ ప్రభావజాలం రంగంలోకి రావడంతోనే ఆత్మా ప్రపంచం అనే విభజనకూడా తలెత్తుతుంది. నేను, నాది అనే భావాలదృష్ట్యా ప్రపంచంతో కలిగిమెలగడం తప్పదు. ఉదాహరణకు, మనకు ఎంత జ్ఞానం కలిగినా, తిరిగి కులం, మతం, జాతి వంటి దురభిమానాలతో మెలగడమేకాక, న్యూనత, ఆధిక్యత, అధకారాపేక్ష, సుఖాపేక్ష, సెక్సు (sex) వంటి వాటికి తిరిగి లోనవుతాం. ధ్యానం సహాయంతో మనం ఆ కేవల చైతన్య స్థితికి తిరిగి చేరుకోవచ్చుననుకోండి; అయితే దాన్ని తిరిగితిరిగి చేస్తూండాలి. ఇది అంతులేని చాక్రిక ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియని క్రమేణా క్లుప్త పరచొచ్చు. అంతకంటే మనం చేయగలిగిందేమీ లేదు.
సాధ్యవిషయాలు: ఆకస్మికంగా ఎలాగైనా మనో వ్యాపారం ఆగిపోయిందనుకోండి, అప్పుడు ధ్యానమూ ఉండదు; దాని అవసరమూ ఉండదు. అప్పుడు మనం కేవలం ఒక ఉనికిగా ఉంటాం. ఉన్నదాన్లోన్నించి మరోస్థితిలోకి పోయే మార్పు ఉండదు. భవిష్యత్తు మనల్ని మరోస్థితిలోకి పొమ్మని ప్రేరేపిస్తూండదు. ఏదో ఒకటి సాధించాలి, ముఖ్యంగా ధ్యానంచేసి ఆత్మ సాక్షాత్కారాన్ని, మోక్షాన్ని సంపాదించాలి అనే గమ్యాన్ని సాధించాలనే వ్యామోహాన్ని పరిత్యజించనంతవరకూ ఈ చపలత్వం, ఈ నిలకడలేని స్థితి ఉండక తప్పదు. ధ్యానం చేసుకోవాలనే వాంచా, గమ్యమూ పోనంతవరకూ ఈ మనోవ్యపారం జరగక తప్పదు. అవి పోతే ధ్యానమూ ఉండదు, దాని అవసరమూ ఉండదు.
మనో వ్యాపారం పూర్తిగా సమసిపోయిందనుకోండి; అప్పుడు విశ్రామం కలుగుతుంది. ఆ స్థితిలో మనం ధ్యానం చేస్తూనూఉంటాం, చేయకుండానూ ఉంటాం. నేను నా Eastern Philosophy క్లాసులో అంటూండే వాణ్ణి: మీకు ధ్యానం చెయాల్సిన అవసరం పూర్తిగా తీరిపొయ్యినప్పుడే మీరు నిజంగా ధ్యానం చేస్తున్నట్టు. ("మీకు స్వేచ్చపై వ్యామోహం పూర్తిగా పోయినప్పుడే మీకు పూర్తిగా స్వేచ్చాపరులవుతారు," అని యూజీ అనేవారు.)
దీన్ని విముక్తి అనొచ్చో లేదో నాకు తెలియదు. విముక్తి అంటే ఏదో ఒక స్థిరమైన స్థితి అని చెప్పుకుంటే ఇది విముక్తి కాదు. అసలు స్థిరమైన స్థితులనేవే లేవు. ఒకక్షణం అహంభావంతో ప్రపంచంతో జోలి కలిగించుకుంటూ, మరోక్షణం ప్రపంచంతో ఏ ప్రమేయం లేకుండా వుండే నిరంతర చంచల స్థితి మాత్రమే ఉంటుంది. అప్పుడు మనం ఉన్నట్టే ఉంటాం. అయినప్పటికీ, మనలో ’నిజ విమోచనం’ అనదగే ఒక మూలమైన పరిణామం వస్తుంది.
ప్రశ్న: ఆలోచనలతో ఈ లంకె ఏవిధంగా ఏర్పడుతుంది? లంకెలేని స్థితి ఉన్నదనేది స్పష్టం. తదితర సమయాల్లో మనం ఆలోచనలతో లంకెపడి, మనోవిషయాల్లో ముణిగిపోయి, ప్రపంచంలో అహంభావంతో మెలుగుతాం. యూజీ అన్నట్టు అది కేవలం పరిస్థితీ, సమయమూ ప్రేరేపించడం వల్లనే జరిగేది కాదు; ఎందుకంటే మనం ఏ పరిస్థితిమధ్యలో ఉన్నా మనం ఆ లంకెనుంచి విడిపోగలం.
ఒక సమధానం: నా మనసు ఒక అభ్యాసవ్యూహాన్ని పునరావృత్తి చేయడానికి బయలుదేరుతుంది. ఉదాహరణకి ఓ కంప్యూటర్ ఆటని ఆడుకోవాలనే ఆలోచనా, ప్రేరణా కలుగుతుంది. తరవాత ఇది మనసుచేసే ఒక గొణుగుడు మాత్రమేననీ, ఇదీ మనో అస్థిరతా వ్యూహంలో ఒక అంశం మాత్రమేననీ, అదంత మనసు చేసే జల్పనేననీ మరో ప్రతి ఆలోచన కలుగుతుంది. క్రిందటి ఆలోచనలో పడకుండా, అన్నింటినీ విసర్జించమని ఈ ఆలోచన చెబుతుంది. మరు క్షణం ఆ రెండు ఆలోచనలూ కనీసం తాత్కాలికంగానైనా సమసి పోతాయి. అప్పుడు మరేమీ ఉండదు. దాన్ని కేవల చైతన్యమనొచ్చు; అయితే అది దేన్నీ ఎరగని చైతన్యం. అప్పుడు శరీరంలో శక్తి విజృంభణ సూచనగా ఒణుకుడు పుడుతుంది.
అప్పుడు ఇది పైప్రశ్నకి సమాధానాన్నిస్తుంది కనుక దాన్ని జ్ఞాపకార్ధం రాసి ఉంచుకోవాలనే సంకల్పం కలుగుతుంది. ఈ సంకల్పంకూడా ఒక మనోవ్యాపారమే. అలోచనా, అలోచననించి జనించిన ప్రతి విషయమూ కూడా తాత్కాలికమే కనక ఇవేవీ ఆటి రావు.
తరవాత, కొన్ని క్షణాల అనంతరం, మళ్ళీ కంప్యూటరు మీద ఆడుకోవాలనే ధ్యాస కలుగుతుంది. నేను స్వతః ఆశల్ని ఎదురించేవాణ్ణికాను కనక ఆ సంకల్పానికి లొంగిపోతాను. నాలో పుట్టిన ఆ ప్రేరణని దాని పనిని దాన్ని కానివ్వనిస్తాను. ఆ ప్రేరణ బలం పూర్వవాసనల బలమే. దాన్నే మనం కర్మ అని కూడా అనొచ్చు. మళ్ళా అశాంతి మొదలవుతుంది. మళ్ళీ ఆ అలోచనా ప్రవాహాన్ని విసర్జించడం ... అలా మళ్ళీ, మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. కధ ఆ విధంగా జరిగిపోతుంది.
ధ్యానంలో మనం చెయ్యగలిగిందింతే. మానసికంగా చేసుకునే హస్త మైధునం!
నిజం, మన మనసుల్లో ఎన్నో విషయాలుంటాయి, మన బుర్రల్లో కుక్కుకొని. అయితే వాటితో ఏదో సమస్య ఉందనికాదు.
’అహం’ అనే దాని కార్యక్రమాన్ని అర్ధంచేసుకోవడం గానీ, దాన్ని ఒక దారికి తీసుకు వెళ్ళడం గానీ తేలికగాదు. దానికి మూలంలో ఉన్న కార్యక్రమం మనం మనతో పోల్చుకునే ఇతరులెవరైనా వారికంటే అధికులమని భావించుకోవడం, ఆధీన్యమూ, ఆధిపత్యమూ, అధికారం సంపాదించడం. అలాగే సుఖన్వేషణా, దుఃఖనిరోధమూ కూడా. దురాశా, వస్తువుల్నీ, మనుషుల్నీ సొంతం చేసుకోవాలనే వాంఛా మూడోది. నిజానికి ఇవన్నీ అహం తనని తాను కొనసాగించుకునే మార్గాలు.
* * *
యూజీ దృష్ట్యా చేయ తగిన పూర్వపక్షం: "మీరు కేవల చైతన్య స్థితిలో ఉన్నరనే విషయం మీకు ఆలోచనద్వారా గానీ తెలియదు" అని యుఉజీ అంటారు. మీరు అలాంటి స్థితిలో ఉన్నానని చెప్పుకోవాలంటే అప్పుడు ఆలోచన ఉండేఉండాలి అంటారు.
సమాధానం: నేను ఈ విషయమై చాలాకాలం క్రితం యూజీతో వాదంలో పడ్డాను. అప్పుడు నేను ఆయన్ను ఇదే ప్రశ్న అడిగాను: "’సహజ స్థితో’ మరో స్థితో మీరు అనేది ఉన్నదని మీకు ఎలా తెలుసు" అని. (ఈ చర్చను "What am I Saying?" అనే విడియోలో ఇంటర్నెట్ లో చూడొచ్చు -- www.ugkrishnamurti.org.) ఆయన నాకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని నా నమ్మకం. ఆయన ఇవ్వగలిగిన సమాధానాలు ఈ రెండు: "నాకు తెలియదు;" "జీవం తనను తనే తెలుసుకుంటుంది."
ఈ సమాధానంలో ఆయన్ని ఆయనే వ్యతిరేకించుకుంటున్నారని నా ఉద్దేశం. నేను కేవల చైతన్య స్థితిలో ఉన్నప్పుడు నాకు ఆ విషయం తెలిసునని నేను అంటంలేదు. అప్పుడు కేవల చైతన్యం ఉన్నదని మాత్రమే అంటాను. దాని విషయమైన జ్ఞానం తరవాత క్షణంలో దాన్ని గురించి ఆలోచించినప్పుడు కలుగుతుంది (జ్ఞాపక శక్తి ద్వారా). మనం తరవాత ఆలోచిస్తున్నప్పుడు చైతన్యం ఉండడానికి వీల్లేదని అనలేం. మనం ప్రస్తుతం ఆ స్థితిలో లేకపోయినా, ఆ పూర్వక్షణంలోని చైతన్యపు స్మృతి జాడలు ఉంటూనే ఉంటాయి. ఇలాంటి సమాధానంతో నాకు ఇబ్బంది లేదు. చైతన్యం తనను తనే ఎరుగుతోందనీ, అది తరవాత జ్ఞానంగా మారుతుందనీ (అలా అని నేను అనవచ్చు) నేను అనడంలేదు.
ఏది ఏమైనా యూజీ చెప్పిందాన్లో ఇది మాత్రం నిజం: ఈ ఎరికె తాత్కాలికమైన ఒక మనో స్థితిమాత్రమే అయి, ఒక్క క్షణం మాత్రమే ఉంటే, అది కేవలం అలోచనా జనితమే అయివుండొచ్చు. అప్పుడు మనం బయలుదేరిన చోటికే తిరిగి చేరుతాం. దీనికి మొదటి కారణం ఆ ఎరిక అనేది ఉన్నదని మనం అలోచనద్వారా దాన్ని జ్ఞాపకంచేసుకుని గుర్తించినప్పుడే గాని అది ఉన్నదని మనకు తెలియదు. ఇంకో కారణం తక్కిన స్థితులమల్లేనే దీనికి కూడా ఒక పుట్టుక, ప్రారంభం, మనుగడ సమయం, సమసి పోవడం ఉంటయ్యి.
పూర్వపక్ష విస్తరణ: యూజీ ప్రతిపక్షాన్ని వైరాగ్యానికీ, కావాలని ఎరికతో పూనుకున్న ఏ పనికైనా అన్వయించొచ్చు. అవన్నీ ఎరికతో చేశేవే కనక వాటిని ఆలోచనమీద ఆధారపడే చేస్తాం. అంటే ఎరిక ఆలోచనకతో సమానం అన్నమాట. ఉదాహరణకు, నిష్కారణంగా, నిష్కామంగా మనం ఏ విషయంపైనా కావాలనుకుని వైరాగ్యం ఏర్పరచుకోలేము. అదేవిధంగా మనం నిస్స్వార్ధంగా దేన్నీ దానం చెయ్యలేం, ఎందుకంటే అది సంకల్పంతో కావాలని చేసేపని, అందుకని స్వార్ధపరమైనది.
* * *
ధ్యాన వైఫల్యానికి మరో కారణం: ధ్యానం ముఖ్యంగా విఫలమవడానికి మరో గాఢమైన కారణం ఉంది: అహం ప్రక్రియ అని నేను అనే మన మనసుకూ, దాని ఆలోచనా వ్యాపారానికీ అన్వేషణ అత్యవసరం. మనం ఉండే చోటు కాకుండా మరేదైనా చోటుకి వెళ్ళడానికి అది సతతమూ అన్వేషిస్తూనే ఉంటుంది. మనం ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవడానికి ఈ ప్రవృత్తిమూలంగానే ప్రయత్నిస్తూంటాం. మనం సతతమూ చేసే ఆత్మ పరిపూర్తి (self-fulfilment) కోసం (యూజీ అన్నట్టు శాశ్వతానందం కోసం) చేసుకునే అన్వేషణలో ఏచోటునించి మరో చోటికి వెళ్ళడం అవసరం లేదో అలాంటి భవరహితమైన, మార్పులేని చోటిని అన్వేషిస్తూ ఉంటాము. అయితే ఈ ప్రయత్నానికి అంతులేదు.
ఒకవేళ అలాంటి శాశ్వతమైన ఆనంద స్థితి ఉన్నదనుకోండి; దాన్ని మనం హస్తగం చేసుకున్నామనుకోండి. అయితే ఆ స్థితిలో ఉన్నంతమాత్రంతో మనకు తృప్తి ఉండదు. ఆ స్థితిలో మనం ఉన్నామని తెలుసుకొని ఆనంద పడాలి. అలాంటి ప్రయత్నంలోనే మన భవసాగరపు విత్తనాలు ఇమిడి ఉంటాయి. ఆ స్థితి ఏదో తెలుసుకొని దాన్ని చూచి ఆనందించాలనే ఔత్సుక్యమే దానినుంచి మనని దూరంగా ఉంచుతుంది. అంతేకాదు, ఆ స్థితిని పరిరక్షించుకోవాలనీ, ఏ విధంగానైనా దాన్ని కొనసాగించి అభివృద్ధి చెయ్యాలనీ ఆ ఔత్సుక్యం మనని ప్రోత్సహిస్తుంది. మనని మననించి వేరుపరచి మనతో మనల్ని తిరిగి ఐక్యం చెయ్యాలనే రంగుల రాట్నంలో పడేస్తుంది కనకనే ఈ జ్ఞానౌత్సుక్యత మానవజాతి స్థితిపట్ల ఒక శాపం.
అలా మనం ఏ స్థితిలో ఉన్నామో ఏమి అనుభవిస్తున్నామో తెలుసుకోవాలనీ ప్రేరణ ధ్యానంలో అంతర్గతం కనక ధ్యానం మూలంలో అతి నిష్ఫలమైనది; అంతే కాదు, అది వైఫల్యానికే మన్ని తీసుకు పోతుంది. దాని ద్వారా మనం దోచుకున్న లాభాలు క్షణికం మాత్రమే.
ఈ విధంగా మనం ఏ ఆశా లేకుండా నిస్పృహలో పడాల్సిందే. దాని విషయం మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు.
గత్యంతరాలు? అయితే గత్యంతరాలు ఏమీ లేవా? ’విపత్తు’ కోసం వేచి వుండాల్సిందేనా? అది ఎప్పటికీ రాదేమో? ఈ చైతన్యం వ్యవహారమంతటితోనూ నిర్భ్రాంతి చెంది ’చెరువులో దూకా’ల్సిందేనా? లేదా మనం మన నిస్సహాయతని ఒప్పుకొని ఏవో వలయాల్లో నిరంతరం తిరుగుతూండాల్సిందేనా? (అందుకనే కాబోలు మనని ’చక్రా’లనొచ్చు). మన మానసిక ప్రేరణలని ఒకదాని తర్వాత ఒకటి క్రమేణా విసర్జించుకుంటూ మానసిక ప్రక్రియల్ని క్లుప్త పరుచుకోవడమే అంతిమ ఫలితం కావొచ్చు. లేదా మరణంవచ్చేవరకూ దైనందిన వ్యవహారాల్లో మనం ముణిగిపోతూ ఉండొచ్చు (మరణంతో మన కధ ముగిసిపోతుంది). బహుశా అన్నిటికంటే ఈ చివరిదే వచ్చేందుకు హెచ్చు అవకాశం ఉందేమో!
అంధకారం, సర్వ నాశనం -- వైఫల్యం తథ్యం, అన్యథా గతం నాస్తి! తక్కిన విషయల్లోలాగానే యూజీ చెప్పేది నిజం: గత్యంతరం లేదు!
తుది పలుకు: ధ్యానాన్ని సమర్ధించే వారినుంచి ఒక పూర్వపక్షం: ధ్యానాన్ని సమర్ధించేవారి్నుంచి ఒక బలమైన ప్రశ్న: ధ్యానం వల్ల కేవల చైతన్యం మాత్రమే ఫలితంగా వస్తుందనడం సరికాదు. దానివల్ల జ్ఞానంకూడా రావొచ్చు. సాధారణ జ్ఞానానికి అతీతమైన మరో జ్ఞానం ఉంది. దానివల్లనే మనకి అతీంద్రియ ప్రత్యక్ష జ్ఞానమూ, అద్భుత చికిత్సా, ఈశ్వర దర్శనమూ, పూర్వ జన్మ జ్ఞానమూ, అణువులగురించీ, వాటి అంతర్నిర్మాణాన్నిగురించిన జ్ఞానమూ కలుగుతాయి.
ఈ ప్రశ్న నన్ను ఏమాత్రమూ జ్ఞానం లేని రంగం లోకి తీసుకెళ్తుంది. అలాంటి వివిధ జ్ఞానాలూ, ప్రమాణాలూ నేను లేవని అననవసరం లేదు. ధ్యానం, ప్రార్ధనా వాటికి దోవని కల్పించి దోహదం చెయ్యొచ్చు. అయితే అవి అందరూ అనుభవించే విషయాలు కావు కనక, వాటిని గ్రహించి స్వ్యాధీనం చేసుకొనే పద్ధతులు మనకు తెలియవు; వాటిని గురించిన స్పష్టమైన జ్ఞానం మనకు లేదు. అలాంటి జ్ఞానమూ పద్ధతులూ ఉన్నవని నమ్మేవారు ఉన్నారని నాకు తెలుసు. కొందరు యూజీకి కూడా అలాంటి శక్తులూ, సిద్ధులూ ఉన్నాయని నమ్ముతారు. ఒకవేళ ఆయనకు అలాంటి సిద్ధులు ఉన్నా, అవి ఆయన సంకల్పంతో సాధించుకున్నవి కావని నా ఉద్దేశం.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home