Sunday, May 18, 2008

నేనెవరు?

ఆలోచనా స్వభావం: ఉన్న చోటూ, ఉన్న క్షణమూ కాక మరో చోట మరో క్షణంలో ఉండడమే మనో లక్షణం. ఆలోచనా వ్యాపారం ఎలా కొనసాగుతుందో కొంచెం పరిశీలిద్దాం. అసలు ఆలోచన అంటే ఏమిటి? మనం ఒక విషయం గురించి ఆలోచిస్తున్నామూ అంటే దాని విషయమైన ఒక ప్రతీకగానీ, ప్రతిరూపం గానీ, ఒక శబ్దం గానీ మన మనసులో దాన్ని సూచిస్తుంది. ఆలోచన ఆ ప్రతిరూపం ద్వారా అ విషయంలో ఒక నిర్ణయం చెయ్యడమే. ఉదాహరణకి: ఆ నిర్ణయం "ఇది సిరా బుడ్డి," "ఈ సిరా బుడ్డి బల్లమీద ఉంది," "ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది," "దీన్లో సిరా అయిపోయింది," "ఇంతకంటే మంచి సిరా కొనాలి," లాంటి ఆలోచనలన్నీ నిర్ణయాలే. ఒక వస్తువుని గానీ, ఒక మనిషిని గానీ, ఫలానా అని గుర్తు పట్టడంలో కూడా ఒక నిర్ణయం ఇమిడి ఉంది. "ఇతను సూర్యనారాయణ" అని నిర్ధారించడంలో "అతను మంచివాడు," "అతను నాకు కావాల్సినవాడు," "అతను నన్ను నిన్న తిట్టాడు," "అతని పని పట్టాలి," ఆ గుర్తింపులో మనకు స్పష్టంగా తెలిసిగాని, తెలియకగాని, ఇమిడి ఉన్నాయి. అంటే గుర్తింపులో ఒక విషయాన్ని గురించిన నిర్ణయమే కాక, దాన్నిగురించి మనం గతంలో ఏర్పరచుకున్న విలువలు కూడా ఇమిడి ఉన్నాయి.

ఈ ఆలోచనే ’నేను ’ అనే పదార్ధాన్ని కల్పిస్తుంది. ’నేను " అనేది ప్రధమ పురుష సర్వనామము. మనం నిష్పాక్షికంగా పరీక్షించి విశ్వంలో గల వస్తువుల్ను జాబితా వేస్తే ఆ జాబితాలో ’నేను’ అనేది కనిపించదు. చరాచర జీవులున్నాయి, నిర్జీవమైన వస్తువులున్నాయి, ఇతర మనుషులున్నారు, ఆకాశం ఉంది, గ్రహాలూ, నక్షత్రాలూ, పాలపుంతలూ ఉన్నాయి. కాని నేను అనేది ఎక్కడా కనబడదు. వ్యక్తినిగురించి అధ్యయనం చేసే మనస్తత్త్వశాస్త్రం కూడా ’నేను’ గురించి ఏమీ పలకదు. ఆ భావం పర్యవసానాల్ని, మనకు ఉండే లోప భావం వల్ల కలిగే సమస్యల్నీ అధ్యయనం చేస్తుంది. ఎందుకంటే ’నే్ను’ అనేది ఒక విషయం కాదు కనక. ఆ భావం ఎలా కలుగుతుందో మనకు బోధించదు. అయితే మరి నేను అనేది ఉన్నదనే భావం మనకు ఎలా కలుగుతుంది?

ఏ అనుభూతి అయినా మనకు కలిగినప్పుడు మనకు ఇది కలుగుతోందనే ఎరిక ఉండదు. ఆ అనుభవంలో ’నేనూ - ఇతరమూ’ అనే విభజన ఉండదు. మన స్మృతి ద్వారా ఆ అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుని, ఇది ఫలానా అని నిర్ణయించుకునే క్షణంలోనే, ఆ అనుభవం నాది, నాకు కలిగింది అనుకున్నప్పుడే ఆ ’నేను’ అనే భావం ఉదయిస్తుంది. ఏ అనుభవంలోనేనా మనం పూర్తిగా నిమగ్నులమై ఉన్న క్షణంలో నా ఉనికికి స్థానం లేదు.

మరో విశేషమేమిటంటే ఇలా ఏర్పడ్డ ’నేను’ వట్టి నేనే కాదు; నా పూర్వ స్మృతులద్వారా చేసే నిర్ణయంకూడాను. "ఈ అనుభవం చాలా బాగుంది;" "ఆ అనుభవం ఎంతో బాధాకరమైంది" అనే నిర్ణయం కూడా నేనే. అలా అనుకుంటున్నప్పుడు, మరో క్షణంలో ఆ నిర్ణయం కూడా నాదే అనే భావం కలుగుతుందే గాని, ఆ నిర్ణయం, ఆ ఆలోచనేననే భావం మనకు కలగదు. ఆక్కడే ’నేను’ అనే భ్రమ ఏర్పడుతుంది. కాకపోతే, ఈ నిర్ణయాలూ, ఆలోచనలకి భిన్నంగా ’నేను’ అనేది ఎక్కడుందో ఆలోచించండి.

ఈ నిర్ణయాలు ఏ దృక్పథంనించి చేస్తాం? వాటికి ఏదో ప్రాతిపదిక ఒకటి ఉండాలి కదా? ఆ దృక్పథం, ప్రాతిపదిక మన గతంలో మనం సంపాదించుకున్నవే. ఉదాహరణకి, మనకి చిన్నప్పుడు అమ్మ పెట్టిన వంకాయకూర మొదట్లో నచ్చకపోయినా, రెండవసారి, మూడవసారి తినగా తినగా, అది మనకు బాగా రుచించడమే కాక (మొదటి కొద్దిసార్లూ కొంత గత్యంతరం లేక తిన్నప్పటికీ), మరే కూరలు తిన్నా వాటిని అమ్మ వండిన వంకాయకూరతో పోల్చి, "అబ్బే, ఇదేం బాగోలేదు" అని నోరు చప్పరించేస్తాం. ఆ విధంగా ఆ అమ్మ వండిన వంకాయకూర తిన్న అనుభవం తక్కినకూరల్ని పోల్చిచెప్పే నిర్ణయాలకి ప్రాతిపదిక కావడమే కాకుండా, మన ఉనికికే అధారమవుతుంది. ఒక విధంగా చెప్తే, ఆ వంకాయకూర, దాన్ని తిన్న అనుభవమే ఆ క్షణానికి ’నేను’ అనేది. అంటే ఏయే అనుభవాలతో సముఖంగానో విముఖంగానో వ్యమనం తాదాత్మ్యంపొందుతామో ఆ అనుభవాలే ’నేను’ అనేది. అంతకంటే ’నేను’ అనేది వేరే లేదు. కాకపోతే మన ఆలోచనలకీ, నిర్ణయాలకీ వెనక ఒక కర్త ఉండి ఉండాలి (వాటంతట అవే జరగవు కనక), ఆ కర్తే ’నేను’ అని మనందరికీ ఒక దృఢమైన నమ్మకం.

అంతే కాదు: ఈ నేను అనే విషయంలో మనకి ఎన్నో నమ్మకాలున్నాయి. మొట్టమొదటిది ఈ ’నేను’ అనేది ఒకటే ఒకటిగా, నిరంతరంగా కాలంలో కొన సాగిపోతుంది. నేను నిన్న ఉన్నాను, రేపు ఉంటాను. నేను ఎప్పుడూ ఉండే ఉంటాను. వివిధ అనుభవాలూ నా అస్తిత్వానికి ప్రాతిపదికే అయినా, వీటన్నిటికీ వెనక ఉన్న నేను ఒక్కణ్ణే అని అనుకుంటాను. ఇది కూడా నేను అనే భ్రాంతిలో భాగమే. మనం వేరే వేరే సమయాల్లో రక రకాల ఙ్ఞాపకాల్నీ చేసుకుంటాము. అవన్నీ ఈ ’చోటే’ జరుగుతున్నయ్యి కనక, వాటన్నిటికీ వెనక ఉండే నేను ఒక్కణ్ణే అనుకుంటాము. ఈ ఙ్హాపకాలు మన స్మృతిలో ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోయి ఉండకపోతే మనం నిరంతరమైన వ్యక్తి అనే భావం మనకు కలగదు.

నాకు ఒక మొదలు ఉందని నేను ఊహించుకోలేను, నేను ఎప్పుడో (భౌతికంగా) పుట్టానని నా తల్లిదండ్రులూ, బంధువులూ చెప్పినా కూడాను. అలాగే నా చుట్టూ ఉండే కొందరు చనిపోయినా, పుట్టినవాడు గిట్టడం తప్పదని నేనే నమ్మినా, నా చావును నేను ఊహించుకోలేను. ఒకవేళ నేను చచ్చిపోయినట్టు ఊహించుకున్నా నా చావును పైనుంచి పర్యవేక్షిస్తూ నేనే దానికి అధ్యక్షత వహిస్తాను.

ఇలా ఏర్పడ్డ ’నేను’ అనే భావం మన మానసిక జీవనానికి కేంద్రం. నా ఉద్దేశ్యంలో, నాకు గతమూ, వర్తమానమే కాక, భవిష్యత్తు కూడా ఉంది. నాకు శక్యత ఉన్నది. ఆ శక్యతని నేను సఫలం చేసుకోవాలి. నా కోర్కెలకి అడ్డువచ్చినవారందరూ నాకు విరోధులు, శతృవులు. ఇతరులు నా గురించి ఫలానా విధంగా అనుకుంటున్నారు అని ఊహించుకుని దానికి తదనుగుణంగా నేను ప్రవర్తిస్తాను. నేను అనేదాన్నిసర్వ విధాలా రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాను, దానికి అవసరమైన సాధన సామాగ్రినీ, ఆయుధాల్నీ, శక్తినీ కూడబెట్టుకుని.

నాకోర్కెలే నాకు ముఖ్యం. నా సుఖాలే నాక్కావాల్సినవి. నేను ఇతరులకి సహాయం చేసినప్పుడు కూడా నాకు ముఖ్యంగా కావాల్సింది నా సుఖమే.

1 Comments:

Anonymous nagamurali said...

సర్, మీ పోస్టులు చదివాను. సూటిగా, సరళంగా, విషయం హత్తుకుపోయేలా రాశారు. అయితే ఇంతవరకు రాసినది నాకు బాగా తెలిసిన విషయమే, నేను ఎంతగానో ఆలోచించిన విషయమే కాబట్టి తరువాతి వ్యాసాల్లో మీరు సూచించబోయే పరిష్కారాలకోసం ఎదురు చూస్తున్నాను.

May 19, 2008 at 4:12 AM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home