Wednesday, September 1, 2010

నువ్వు నువ్వుగా ఉండడంలోని క్లిష్టత:

’నువ్వు ఏమీ చెయ్యనఖ్ఖర్లేదు. నువ్వు నువ్వుగా ఉంటే అంతకంటే సరళమైన పని మరొకటి లేదు" అని యూజీ అనేవారు. అయితే దురదృష్టవశాత్తూ మనం మనంగా ఉండడం అవపడేటంత సరళమైన విషయంకాదు.

’మనం మనంగా ఉండడం’ అంటే మనంకాని ఇతరం మరొకటి (మరొకడు) కావాలనుకోకపోవడం అన్నమాట. ఉదాహరణకి, మరొకనికంటే మనం తక్కువ అనే న్యూనభావం గానీ, మనలో ఏదో వెలితి ఉందనే భావం గానీ, మనం మనంగా ఉండడం అంటే భయం గానీ మనకి కలిగిందనుకోండి. అప్పుడు మనం ఏవిధంగా ప్రస్తుతం ఉన్నామో దాన్ని మార్చకపోవడమే (మార్చడానికి ప్రయత్నించక పోవడమే), అంటే మరొకరికంటే అధికులం కావడానికి గానీ, మరింత సమర్ధులం కావడానికి గానీ, మనం మనంగా ఉండే భయాన్ని పోగొట్టుకోవాలని గాని ప్రయత్నించకపోవడమే మనం మనంగా ఉండడమన్నమాట. ఏక్షణంలోనైనా మనం మనంగా కాక మరొకటి (మరొకడు) కావాలనుకోకపోవడం అంటే మనం మరో చోట గానీ, మరో స్థితిలోగానీ, పరిస్థితిలో గానీ ఉండాలనుకోకపోవడం.

మనకు ప్రస్తుతం ఏది ప్రాప్తించిందో దాన్ని స్వీకరిస్తాం. అంటే దాంతోనే తృప్తి చెందుతాం.

మానవుడు తను ఏ స్థితిలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా ఆ స్థితిని ఎరగకుండా ఉండలేడు. మనం మనంగా ఉండడంలోని సమస్య ఏమిటంటే, మనం ఫలానా విధంగా ఉన్నామనే ఎరిక మనను గురించిగానీ, మన స్థితిని గురించి గానీ ఒక నిర్ణయాన్ని (judgment) ఏర్పరచుకుంటుంది. ఆ నిర్ణయ వ్యాపారంలోనే దాన్ని అధిగమించాలనే ప్రయత్నం, మరేదో (మరొకడో) కావలనే ప్రయత్నం, నిబిడీకృతమై ఉంటుంది. అంటే మన పరిస్థితిని మేలు చేసుకోవాలనే ప్రయత్నం ఇమిడి ఉంటుంది.

మనం మరొకటి (మరొకడు) కావాలనే ప్రయత్నాలు ’మనం’ అనే భావంలో కూడకలుపుకుంటే తప్ప, మనం మనంగా ఉండాలనే భావం అసంబద్ధమవుతుంది. కనీసం అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే, మనం మనం ఉండడమంటే మన పరిస్థిని మనం ఎరిగి ఉండాలన్నమాట. అట్లాంటి ఎరిక ఉంటే, దాంతో పాటే విధిగా దాన్ని అధిగమించి మరొకటి (మరొకడు) కావాలనే ప్రయత్నంకూడా ఉంటుంది. అంటే మనం మనంగా ఉండకపోవడమన్నమాట. ఆ విధంగా ’మనం మనంగా ఉండడం’ అంటే ’మనం మనంగా ఉండకపోవడం’ అవుతుంది. మరోమాటలో చెప్పాలంటే, మనం మనం కాకపోవడమే మనం మనం కావడం అవుతుంది. ఇది కేవలం అసంబద్ధం.

ఆ విధమైన ఎరిక మనకి కలిగినప్పుడు, మన స్థితిని అధిగమించాలనే ప్రయత్నాన్ని కూడ ఎరిగినప్పుడు, మన స్థితిని అధిగమించ ప్రయత్నించడం నిష్ప్రయోజనమనీ, మన స్థితిలో ఏ లోపమూ లేదనీ, మనకి తెలిసినంత వరకూ గతంలో ఏ పరిష్కారమూ మన ప్రత్యేక సమస్య విషయంలో సఫలవంతమైనదని రుజువుకాలేదనీ మనకు మనం చెప్పుకొని సమాధాన పరుచుకోడానికి ప్రయత్నించవచ్చు. ఈ విధమైన సంభాషణ తాత్కాలికంగా మనం మనల్ని తిరిగి చేరుకొనేట్లు చెయ్యొచ్చు. అప్పుడు మనల్ని మనం అంగీకరించుకోవడం నేర్చుకున్నామనిగాని, మన స్థితితో మనం తృప్తి చెందామని గాని అనొచ్చు.

కాని మన మనస్సు ఒక తూలనా సాధనం. తన స్థితిని తాను ఎరగడమే కాకుండా ఇతర స్థితుల్తో దాన్ని పోలుస్తుంది -- ఎరికె, దానితో సహా వచ్చే నిర్ణయమూ తూలనాత్మకమైనవి. మనం మనతో పరిపరివిధాలా మరో విధంగా చెప్పుకున్నా, ఈ తూలనాత్మక నిర్ణయంతో పాటు మనకు ఇతరమైనది ఏదో ఒకటి అయ్యే వ్యాపారం, ఏదో ఇతర స్థితికి చేరే వ్యాపారం (అది కేవలం భావనలో, ఊహలోనైనా సరే) జరిగి తీరుతుంది.

ఈ క్లిష్టతకు పరిష్కారం: నా ఉద్దేశంలో ఈ క్లిష్టతను పరిష్కరించాలంటే మనం మరో స్థితిలోకి పరిణమించడాన్ని ఒప్పుకోవడమే. అంటే దాన్ని ఏ విధంగానూ ప్రతిఘటించకుండా ఆ పరిణామస్థితిలో ఉండి పోవడమే. ఏదో ఒక స్థాయిలో మనతో మనం సమాధాన పడాలి. అది మనం ప్రయత్నవిషయంలో కావచ్చు, పరిణమించడం విషయంలో కావచ్చు. ఈ విధంగా మనం కనీసం పైపైన చెయ్యగలిగినా, కాలక్రమేణా ఆ అంగీకారం, అంటే సమాధాన పడడం లోతు పొరల్లోకి చొచ్చుకుపోయి, మన స్థితినీ, భయాన్నీ, బాధనీ, నేరభావాన్నీ, తదితరాల్నీ అంగీకరింపగలిగేంతవరకూ సంభవిస్తూంటుంది. సంపూర్ణాంగీకారం అంటే బాధకీ, భయానికీ, నేరభావానికీ సంపూర్ణంగా లొంగి పోవడం అన్నమాట. అప్పుడు మనం మనం కాము; ఆత్మ నిర్మాణం (self structure) కనీసం ఆ విషయంలోనైనా, తాత్కాలికంగానైనా కరిగిపోతుంది; మనం శుద్ధ చైతన్య స్థితికి, లేదా శరీర చైతన్య స్థితికి తిరిగి చేరుకుంటాం. మరోమాటలో చెప్పాలంటే, ఆత్మ పొరలలోనించి చొచ్చుకు వెళ్ళితే, మనం మన గా ఉండడమంటే ఏదో మరో స్థితికి చేరడానికి ప్రయత్నించకుండా, కేవలం ఉండడమే నన్నమాట.

5 Comments:

Blogger మాగంటి వంశీ మోహన్ said...

బోల్డంత ఆలోచించేంత పని పెట్టారు సార్! :)

September 1, 2010 at 11:56 AM  
Anonymous Anonymous said...

"That messy thing called ‘mind’ has created many destructive things. By far the most destructive of them all is God."

Do you agree? Why this mind is perceiving its own creation as destructive? Is that a destructive mind?

September 1, 2010 at 11:34 PM  
Anonymous Anonymous said...

నారాయణమూర్తి గారు, నేను యు.జి. గారిని ఎప్పుడు కలవ లేదు. కాని వారి పుస్తకాలు ఒక్కట్టి కూడా వదలకుండా చాలా చదివాను. యు.జి. గారి పుస్తకాలు చదివితె అతనిని కలసిన వారు ఆధ్యాత్మిక అనుభవాలను ఎక్కడా పెద్దగా ప్రస్తావించ లేదు. కొన్ని చంద్రశెకర్ గారు రాసిన మీరు అనువదించిన పుస్తకం లో చూడవచ్చు. దానిలో కొంతమందికలలోకి రావటం లాంటివి ప్రస్తావించారు. మీకు ఎమైనా యు.జి.ని కలసిన తరువాత అనుభావాలు కలిగాయా? అలాంటి వాటి లో మీరు మరచి పోలేనిది ఎమైనా ఉంటె, అది మీకు అభ్యంతరం లేక పోతే ఒక టపా రాయగలురు. ముఖ్యంగా కలలో గురువులు కనిపిస్తే ఏవిధం గా అర్థం చేసుకోవాలి?

September 2, 2010 at 8:19 AM  
Blogger Narayana Moorty said...

'God' is just one example. Self-protectiveness is the most destructive of all its creations.

It's not just perceiving it as destructive. It has to suffer the consequences of its destructiveness.

I can only say because of its divisive nature. But you could be asking the question of 'why' endlessly.

September 2, 2010 at 8:47 AM  
Blogger Narayana Moorty said...

కలలమీద నాకు పెద్దగా విశ్వాసం లేదు. పగటి సమయంలోని మన అనుభవాల్నే రకరకాలుగా కలగాపులగం చేసుకొని, మన కోర్కెలకూ, భయాలకూ అనుగుణంగా మన మనసు కలల్ని కల్పించుకుంటుందని నా ఉద్దేశం. యూజీ గార్ని గురించి కలలు రాకపోవడమేం. ఒకటి రెంటిని ఆయనతో చెప్పానుకూడనూ. వాటి వివరాలను మీకు చెప్తే మీకు అనవసరమైన అపోహల్ని కల్పిస్తానేమోనని నా భయం. నాకే వాటిపై భరోసా లేనప్పుడు వాటిని గురించి మీకు చెప్పడం ఎందుకు? గురువులు గానీ, మరెవరైనాగానీ కలలో కనిపిస్తే ఆ కలని గురించి తక్కిన కలల్లాగే పట్టించుకోకూడదని నా అభిప్రాయం.

September 2, 2010 at 9:00 AM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home