Sunday, February 24, 2008

యూజీతో నా మొదటి పరిచయం:

నేను యూజీని గురించి మొదటిసారిగా వినడం ఆరోజుల్లో నా స్నేహితుడు టెర్రీ ఆగ్న్యూ ద్వారా (తరవాత అతను న్యూలండ్ అని పేరు మార్చుకున్నాడు). నేనూ నా స్నేహితులూ ఒకసారి 1969, 70 ప్రాంతాల్లో కార్సన్ సిటీ, నెవాడాకి వెళ్తూ అతని ఆహ్వానం మీద ఒక రాత్రి దోవలో సెబాస్టపోల్ లో అతని ఇంట్లో గడిపాము. మర్నాడు తెల్లవారుఝామున అతను వేసే యోగాసనాల్ని చూసి ఎంతో మెచ్చుకున్నాను. పొద్దున బ్రెక్ఫాస్ట్ సమయంలో అతను యూజీ గురించి చెప్పాడు అయన ఫోటోని నాకు చూపిస్తూ. టెర్రీ నాకు అంతకుముందే బర్కిలీలో కృష్ణమూర్తిని గురించి చర్చ బృందాల్ని ఏర్పరిచే సందర్భంలో పరిచయమయి, తరవాత నాకు స్నేహితుడయ్యడు. యూజీ కి 1967లో స్విత్జర్లండులో జ్ఞానోదయమయ్యిందనీ, ఆయన్ని అతను అక్కడే మీటింగుల్లో కలిసాననీ, తనతో వచ్చి బెంగుళూరులో ఉండి తన జీవిత చరిత్ర రాయమని ఆయన ఆహ్వానించారనీ, కానీ అక్కడ తను మూడునెల్లున్నా, ఆయన జీవితాన్ని రాయలేకపోయాననీ చెప్పడు. బెంగుళూరులో తనను ఆయన ఎంత ఆదరంగా చూశారో చెప్పాడు: పొద్దున్నే అతని స్నానానికని స్వ్యయంగా తనే వెణ్ణీళ్ళు కాచిపెట్టేవారట!

రెండోసారి యూజీనిగురించి వినడం 1975లో నేను నా కుటుంబంతోనూ స్నేహితులిద్దరితోనూ తిరువణ్ణామలైలో చలంగారింటికి వెళ్ళినప్పుడు. ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఒక టేపు రికార్డింగు వినిపించింది: యూజీ మాట్లడుతున్నారు, ఏదో అలోచనల మధ్య ఉండే అంతరాన్ని (space)గురించి. అదేదో వేదాంతపు ధోరణిగా అనిపించిందినాకు, కానీ స్పష్టంగా ఒక అభిప్రాయం ఏర్పడలేదు. నేను ఒక్కనిమిషం విన్నానుగానీ, ఒంట్లో కొంచం జ్వరంగా ఉండడం వల్ల, పెద్దగా శ్రద్ధ చూపక, అందర్నీ పలకరించింతరవాత డాబామీదున్న గదిలోకి వెళ్ళి పడుకున్నాను. అదే సందర్భంలో మొదటిసారిగా యూజీ ఫొటోని చలంగారింట్లో గోడమీద చూశాను. సౌరీసే కాబోలు అప్పుడు చెప్పింది యూజీ తమకి దూరపు బంధువని.

1971 ప్రాంతాల్లో, టెర్రీ మోలకాయి అనే హవాయీ ద్వీపంలో తన ఇంటికి వచ్చి తనతో ఒక నెలరోజులు ఉంటే మాకు యోగాసనాలు నేర్పుతానని ఆహ్వానిస్తే, నేనూ, అప్పటి నా భార్య లిండా అతని ఇంటికి వెళ్ళాము. అయితే దురదృష్టవశాత్తూ మేము అక్కడికి చేరుకున్న అరగంటలోనే ఒక అగ్ని ప్రమాదం జరిగి అతని కాబిన్ పూర్తిగా భస్మమైపోయింది. గంత్యంతరంలేక మేమంతా ఆ రాత్రి అతని స్నేహితుల ఇంట్లో పడుకొని, మర్నాడు టెర్రీ మరొక స్నేహితుడి ఇంట్లో మేమిద్దరం మకాం పెట్టి ఒక వారం రోజులు మాత్రమే ఉండి యోగసనాలు నేర్చుకున్నాము. ఒకరోజున టెర్రీ మా ఇద్దర్ని అతని స్నేహితురాలైన ఒక యువతి దగ్గరికి కార్లో తీసుకు వెళ్ళాడు. అక్కడ రెండోసారి యూజీ టేపు విన్నాను. అప్పటికీ నాకు పెద్దగా ఎమీ అభిప్రాయం కలగలేదు యూజీ అంటే.

నాలుగోసారి వినడం చలంగారి స్నేహితులు డాక్టర్ కామేశ్వరిగారు అమెరికా పర్యటనకి వచ్చి మా ఇంట్లో అతిధిగా ఉన్నప్పుడు. ఆమెకుకూడ యూజీ అప్పటికే పరిచయమయ్యారు. ఆ సందర్భంలో ఆమె అన్నారు యూజీ పలికే పలుకులు ఉపనిషద్వాక్యాల్లా ఉంటాయని. అప్పటికి నాలో కొంచెం కొంచెం అభిప్రాయం ఏర్పడడం మొదలైంది యూజీ అంటే.

1981లో నాకు చలంగారింట్లో ఉండే నర్తకి అనే ఆమె ఉత్తరం రాసింది: యూజీ అమెరికా వస్తున్నారనీ, వీలైతే ఆయ్యన్ని కలవమనీ. ఆయన అడ్రెసో, ఫోను నంబరో ఇచ్చింది కాబోలు, గుర్తులేదు. నేను నిర్లక్ష్యంగా ఆఉత్తరాన్ని పక్కనపడేశాను. తరవాత కొద్దిరోజుల్లోనే టెర్రీ నించి ఫోను వచ్చింది: యూజీ, ఆయన సహవాసి వాలెంటైనూ, మిల్ వాలీ వచ్చి ఉన్నారనీ, యూజీ "ఈ నారాయణమూర్తిగారు ఎక్కడ ఉన్నారు?" అని అడుగుతున్నారనీ. నర్తకి తరవాత కలిసినప్పుడు నాకు చెప్పింది, "మీరు ప్రతిచోటికీ వెళ్ళి అందర్నీ కలుస్తూ ఉంటారుకదా; అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ నారాయణమూర్తి గార్ని కలవండి," అని ఆయనకు నా అడ్రెసూ, ఫోను నంబరూ ఇచ్చిందట. అయితే ఆ సమాచారం ఆయన పోగొట్టుకున్నారు; నా పేరు మాత్రం గుర్తుందిట. టెర్రీ అన్నాడు, "నిన్ను గురించి ఆయన అడుగుతున్నరు, వచ్చి చూస్తావా?" అని. నేను అన్నాను, "గురువుల్ని చూచేందుకు నాకు వయసు మించింది; ఇటువైపు ఎప్పుడన్నా ఆయనే మాఇంటికి వస్తే సంతోషిస్తాను." అలా అని నేను వెళ్ళలేదు. అప్పటికే నాకు జిడ్డు కృష్ణమూర్తి గారితో మొహం మొత్తి పోయింది, అందుకని కాబోలు.

1981 అక్టోబరులో ఒక రోజు పొద్దున కార్మేల్ అనే పక్క ఊరునించి మరో ఫోను వచ్చింది - రమేష్ గనేర్వాల్ అనే ఆయన పిలిచాడు: "యూజీ, వాలెంటైనూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. యూజీ మిమ్మల్ని చూడాలనుకుంటున్నరు, మేము రావచ్చా?" అని. "తప్పకుండా రండి; వచ్చి మా ఇంట్లో భొజనం చెయ్యండి," అని సమాధానం చెప్పాను. అప్పటికే మా అత్తవారంతా తినడానికని చేసిన ఉప్మా ఇంకా చాలా మిగిలి ఉంది. వాళ్ళూ, మా ఆవిడ వెండీ ఫలహారం చేసి బాహ్యాటనకెళ్ళారు. నేను ఇంట్లో ఒక్కణ్ణే ఉన్నాను.

సీసైడ్ లో ఉన్న మాఇల్లు పసిఫిక్ మహాసముద్ర తీరాన్నే ఉంది. మా ఇంటినించి ఒక అరగంట నడిచి వెళ్తే సముద్రం దగ్గరికి చేరుకుంటాము. మా ఇంటి ముందరి లివింగ్ రూమ్ లోనించి చూస్తే సముద్రమూ, మాంటెరే బేకి అవతలవైపున ఉన్న మాంటెరే, పసిఫిక్ గ్రోవ్, కార్మేల్ కి వెళ్ళే కొండ, దాని మీద ప్రాకుతూ వెళ్ళే హైవే 1, కనిపిస్తాయి. సాయంత్రాన అందమైన సూర్యాస్తమయాలుకూడా మా కిటికీలోంచి చూడొచ్చు.

యూజీ, వాలంటైన్, రమేష్ -- ముగ్గురూ మధ్యాన్నం 12 గంటల ప్రాంటంలో, రమేష్ నడుపుతూన్న పాత BMW కార్లో వచ్చారు. మా ఇంటి ముందు గదిలో కిటికీలోనించి చూస్తున్నాను యూజీ కార్లోనించి బయటపడి, కాలిబాటమీదికి మా ఇంటివైపు నడిచి రావడం. ఏదో ఉరిసిక్షా స్థానానికి నడిచి వెళ్ళే ఖైదీ లాగాను, జీవచ్చవంలాగాను, నిర్జీవంగానూ నడుస్తున్నారు.

మా వంటింట్లో వాళ్ళ ముగ్గుర్నీ టేబులు దగ్గర కూర్చోపెట్టి వాళ్ళకి ఉప్మా వడ్డించాను. నా ఉప్మాని ఇది సిసలైన ఉప్మా అని మెచ్చుకున్నారు యూజీ. నేనూ యూజీ మా ఇద్దరి పుట్టు పూర్వోత్తరాల వివరాలు చెప్పుకొన్నాం. ఆయన గుడివాడలో పుట్టడమూ, బందరులో చదవడమూ, ఆయనకి గోరాగారు బాటనీ లెక్చరరు కావడమూ, మద్రాసులో T.M.P.మహాదేవన్ ఆయన ఫిలాసఫీ ప్రొఫెసరు కావడమూ -- ఇలాంటి చాలా విషయాలు చెప్పారు. మా ఇంట్లో వాళ్ళు సుమారు రెండు గంటలు గడిపారు. మా మా గతాల్లో చాలా తేడాలున్నా సామాన్యాంశాలు కూడా చాలా ఉన్నాయి. సత్యసాయిబాబాని గురించి యూజీ ఒక జోక్ వేశారు: పూర్వపు రోజుల్లో ఆయన స్విస్ వాచీలను మెటీరియలైజ్ చేశేవారట; ఆ మధ్య దిగుమతి నిషేధాలు ఏర్పడ్డ తరవాత హిందుస్తాన్ వాచీలనే మెటీరియలైజ్ చెయ్యడం ప్రారంభించారట!

వారు ముగ్గురూ మా ఇంట్లో సుమారు 2 గంటలు ఉన్నారు. వెళ్తూన్నప్పుడు ఆప్యాయంగా నేను భుజం మీద చెయ్యి వెయ్యబోతే ఆయన కొంచం దూరంగా జరిగి నిల్చున్నారు. దైహికంగా ఆయనకి మనుషలకి అంత దగ్గిరగా ఉండడం ఇష్టంలేదేమో ననుకున్నాను. ఆయన్ని ’కృష్ణమూర్తి గారూ’ అని సంబోధిస్తూంటే, "నన్ను ఖైదీ నంబర్ 69 అని పిలిచినా చాల్ను. అందరూ నన్ను ’యూజి’ అని పిలుస్తారు," అన్నారు. అదే సందర్భంలో నాకు ఒక విచిత్రమైన అనుభవం కలిగింది. ఆయన వెళ్తూన్నప్పుడు నేను ఆయనతో కరచాలనం చేశాను. ఆప్పుడు నన్ను నేనే కలుసుకుంటున్నట్టనిపించింది. ఇలాంటి అనుభవాలు కలగడానికి ఇదే మొదలు. ఆయితే తరవాత ఈ ఫీలింగ్స్ ఆయన సమక్షంలో వివిధ రూపాల్లో అప్పుడప్పుడు కలుగుతూనే ఉండేవి.

నన్ను మిల్ వాలీ కి (అప్పుడు ఆయన ఉండే ఊరు) రమ్మనమని ఆహ్వానించారు. ఈవిధంగా జరిగింది యూజీతో నా ప్రథమ సమాగమం.

Thursday, February 21, 2008

4. యూజీ:


మీలో కొంతమందికి యూ.జీ. కృష్ణమూర్తిగారంటే తెలిసి ఉండదు. గురువని అనిపించుకోవడం ఆయనకు ఇష్టం లేకపోయినా, ఆయన నాకు ఉత్తమోత్తములైన గురుసమానులు. ఆయన పోయిన ఏడాది మార్చి 22వ తారీకున ఇటలీలో, వలక్రోసియా అనే ఊర్లో మరణించారు. ఆయనతో నా తొలి పరిచయం 1981లో జరిగి 25 సంవత్సరాల సాంగత్యంతో ముగిసింది.

ముందర ఆయన్నిగురించి కొంత ప్రస్తావన చేస్తాను:

ఆయన ఒక మహాజ్ఞాని. ఆయనతో బాగా పరిచయం ఉంటేనేగాని ఆయన స్వభావం పూర్తిగా తెలియదు. అయినా, ఎంతో కాలం సన్నిహితులుగా ఉన్నవారికికూడా అంతుపట్టని అజ్ఞాత వ్యక్తి ఆయన. ఆయన్ని అందరూ యూజీ అని సంబోధిస్తారు.

పుట్టడం గుడివాడలో, ఇంటర్మీడియట్ వరకూ చదవడం మచిలీపట్నంలో. ఆయన పుట్టిన వారం రోజుల్లోనే తల్లి చనిపోవడంచేత మాతామహులు ఆయన్ని పెంచుకున్నారు. ఆయన తాతగారు ధనికులైన ప్లీడరు, ప్రముఖ దివ్యజ్ఞాన సమాజస్తులు. పెంపకం అధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. మద్రాసు యూనివర్సిటీలో ఫిలాసఫీ ఆనర్సు చదివి చదువు పూర్తి కాకముందే విరమించారు. తాతగారి కారణంగా దివ్యజ్ఞాన సమాజ నాయకులు జార్జ్, రుక్మిణీ అరండేల్,జినరాజదాస, అనీ బెసెంట్, లెడ్బీటర్ మొదలైన వారితోనూ, తరవాత జిడ్డు కృష్ణమూర్తిగారితోనూ పరిచయమయ్యింది. దివ్యజ్ఞానసమాజంలో సెక్రటరీగానూ, అంతర్జాతీయ ఉపన్యాసకులుగానూ కొన్నేళ్ళు పనిచేసి విరమించుకున్నారు..సుమారు ఏడేళ్ళు, ప్రతి వేసంకాలమూ హిమాలయా పర్వత ప్రాంతాన ఋషీకేశ్ లో ఒక గుహలో నివసిస్తూ శివానందస్వామిగారు శిష్యుడిగా యోగాభ్యాసం చేశారు. అప్పుడూ, తరవాతాకూడా అయనకి ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు కలిగినా, అవి పూర్తి పరిణామం తీసుకురాలేని స్థితులేనని వాటిమీద వ్యామోహ పడలేదు. ఒకసారి, ఒకస్వామివారి ప్రోత్సాహంతో శ్రీ రమణమహర్షి దర్శనం చేసుకుని, ఆయన్ని కొన్ని ప్రశ్నలుకూడా వేశారు. రమణమహర్షి ఇచ్చిన సమధానాలుకూడా ఆయనకి తృప్తి కలిగించలేదు.

కృష్ణాజీ (జిడ్డు కృష్ణమూర్తి) యూజీ మీద ఎందుకనో చాలా శ్రద్ధ చూపించారు. ఆయనతో రెండునెలల తరబడి ప్రతిరోజూ సంభాషణలు చేశారు. అయినా వారిద్దరిమధ్యా అభిప్రాయభేదాలు రావడంవల్ల యూజీ తమ దోవ తాము చూచుకున్నారు. పోలియో వ్యాధిగ్రస్తుడైన కొడుకుకు దేహ చికిత్స కోసం తన ఆస్తిపాస్తులన్నీ వెచ్చించి భార్య కుసుమగారితోసహా అమెరికాలో షికాగోలోనూ, డిట్రాయిట్ ఉన్నారు. కొన్నాళ్ళకి తానిచ్చే ఉపన్యాసాలమీద తనకే విశ్వాసంలేక, ఆ పనిని మానుకుని, అమెరికాలో ఉండడానికి ఇష్టంలేని భార్యను, కొడుకుతో సహా ఇండియాకి పంపేసి, తను ఇంగ్లండులో దారం తెగిన గాలిపటంలాగా తిరిగారు. జేబులో డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. బతుకుతెరువు కశ్టమైపోయింది. అప్పుడు కొంతకాలం లండన్లో రామకృష్ణా మిషన్లో అతిధిగా ఉండి వారి వివేకానంద శతాబ్ది సంచికని తయారుచేసే ప్రయత్నంలో సంపాదక సహాయంచేశారు. అక్కడకూడా ఉండడం ఆయన సహించలేకపోయి, తనదగ్గరున్న ఫస్ట్ క్లాసు టిక్కెట్టుని అమ్ముకొని వచ్చిన డబ్బుతో పారిస్ చేరుకొని రెణ్ణెల్లుండి, హోటలు అద్దె ఇవ్వడానికి డబ్బులేక, స్విట్జర్లండులో బాంకులో ఉన్న తన డబ్బు తీసుకోవడానికి జూరిక్ వెళ్ళబోయి పొరబాటున జెనీవాకు చేరుకున్నారు. నిస్సహాయంగా ఉన్న తనని ఇండియాకి పంపించమని ఇండియన్ కాన్సలేటు వారిని కోరారు. ఆపని జరగకపోయినా, ఆ కాన్సలేటులోనే పనిచేస్తూన్న వాలంటైన్ డి కార్వెన్ అనే ఆమెతో పరిచయమై, ఆమె ఆయనను ఆదరిస్తానని తన అండలోకి తీసుకుంది. అప్పటినించీ వారిద్దరూ సహచరులూ, సహయాత్రికులూ అయ్యరు. తరవాత ఆమెకున్న ఆస్తిపాస్తుల్నన్నిటినీ అమ్ముకుని, ఆయనతోసహా సానెన్ అనే చిన్న వూర్లో నివాసం మొదలెట్టారు. అది 1967 వ సంవత్సరం. ఆయనకు 49 ఏళ్ళ వయస్సు. అంతవరకూ ఆయన జీవితమంతా ఆధ్యాతిమిక అన్వేషణతోనే గడిచిపోయింది. అయితే బుద్ధుడూ, క్రైస్తూ లాంటివారున్న ఆస్థితి ఏమిటా అనే ప్రశ్నకు ఆయనకు అప్పటివరకూ సమాధానం దొరకలేదు.

అదేసమయంలో కృష్ణాజీ సానెన్లో ఉపన్యాసాలిస్తూంటే, ఒకరోజు ఆయన వెళ్ళి విన్నారు. కృష్ణమూర్తి గారు ఆలోచనారహిత మనస్థినిగురించి ప్రస్తావించారు. అప్పుడు యూజీకి తోచింది ఆయన వర్ణించేది తాను ఉన్న స్థితినేనని. అక్కడినించి ఇంటికి తిరిగి వస్తూ, ఒక బెంచీ మీద కూర్చున్నారు, చుట్టూ ఉన్న ఏడు కొండల లోయల సమక్షంలో. అప్పుడు తనను ఇన్నేళ్ళగా పట్టి బాధిస్తున్న ప్రశ్న, మరొక ప్రశ్నగా మారింది: తానిప్పుడున్న స్థితి ఆస్థితేనని తనకెలా తెలుసునని. తనకి పూర్వం ఉన్న జ్ఞానం ద్వారా తప్ప ఆ విషయం తెలుసుకునే సాధనం వేరే ఏమీ లేదని గ్రహింపు వచ్చి, ఆ ప్రశ్నకూడా క్రమేణా అంతర్ధానమైంది. ఇంటికి వెళ్ళి పక్కమీద పడుకున్నప్పుడు మరణసమానమైన ఒక స్థితిలో పడిపోయి, తెలివిపోయి ఒక 45 నిమిషాలపాటు, ఊపిరీ గుండే ఆగిపోయి, ఒళ్ళు చల్లబడి పోయిన పరిస్థితి ఏర్పడింది. డగ్లస్ అనే ఒక స్నేహితుడు ఎందుకో ఫోనులో పిలెస్తే వాలంటైను ఫోనందుకొని యూజిని పిలిస్తే అప్పుడు ఆయనకు మళ్ళీ జీవం వచ్చింది. ఆనాటినించి, 'విపత్తు(calamity)' అని ఆయన అనే స్థితిలో పడిపోవడం ఆయనకు పరిపాటైపోయింది.

తరవాతి రోజుల్లో ఆయన ప్రత్యేకంగా వేరే బోధ అంటూ లేకుండా తానున్న స్థితినే వివరిస్తూ మాట్లాడేవారు. ఆయనని కలిసేవారిలో గాఢంగా పేరుకుపోయున్న నమ్మకాల్ని ప్రశ్నించి సమూలంగా ధ్వంసం చేయడమే ఆయన కార్యక్రమం. వాటిస్థానం లో ఉంచుకోడానికి మరే నమ్మకాల్నీ ఉపదేశించకపోవడమే ఆయనబోధనలో విశిష్టత. మీకు ఏ నమ్మకాలూ అవసరంలేదంటారు. ఏ ఆధారం లేకుండా నిలబడగలిగితే, అప్పుడే ఆ 'సహజ స్థితి ' కలగడానికి ఏమైనా సావకాశం ఉంటుందని ఆయన అంటారు.

యూజీ జీవిత చరిత్ర మీరు తెలుగులో ఈ క్రింది పుస్తకంలో చదువుకోవచ్చు:

మహేశ్ భట్ట్ రాసిన U.G.Krishnamurti -- A Life కి కొర్లిమర్ల చంద్రశేఖర్ చెసిన తెలుగు అనువాదం, యూజీ కృష్ణమూర్తి -- ఒక జీవితకథ అనే పుస్తకాన్ని 1994 లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు.

యూజీని గురించిన ఉపోద్ఘాతం ఇంతటితో ముగిస్తాను. వచ్చేసారి యూజీతో నా తొలి పరిచయంగురించి రాస్తాను.