Thursday, July 3, 2008

జీవితానికి అర్ధం ఏమిటి?

జీవితానికి అర్ధం ఏమిటి అనే ప్రశ్న "దేవుణ్ణి ఎవరు సృష్టించారు?" "సృష్టికి ముందర ఏముంది?" లాంటి యక్ష ప్రశ్న. దానికి సంతృప్తికరమైన సమధానం ఇవ్వడానికి వీలులేదు; ఎందుకంటే తక్కిన అతిభౌతిక ప్రశ్నల్లాగానే ఇది కూడా మన ఆలోచనలో భాగమైన హేతుబుద్ధి సృష్టితమైనది. ఉదాహరణకు, భగవంతుని సేవ చెయ్యడమూ, ఆయన ఇచ్చకి అనుకూలంగా నడుచుకోవడమే జీవితానికి ధ్యేయమని అనుకున్నామనుకోండి. దైవం ఒక పురుషుడేనా అనే ప్రశ్న అటుంచి, ’దేవుడికి మనం ఎందుకు సేవ చెయ్యాలి’, ’ఈశ్వరేచ్చ గురించి మనకు ఏమైనా ఎలా తెలుసు” అనే ప్రశ్నలు లేవక తప్పవు. ఎన్ని సమాధానలు చెప్పుకున్నా ఈ ప్రశ్నలకు అంతు ఉండదు.

ఇలాంటి ప్రశ్నకు సంతృప్తికరంగా సమాధానం ఇవ్వాలంటే ఎలాంటి సందర్భాల్లో ఈ ప్రశ్న పుట్టుతుందో గమనించాలి. మనం కోరుకున్నవి మనకు లభిస్తూ, మన జీవితం సాఫీగా జరిగిపోతున్నాళ్ళూ ఇలాంటి ప్రశ్న మనకు ఉదయించదు. ఆరేడేళ్ల అబ్బాయో అమ్మాయో నాన్న దగ్గరికి గానీ, అమ్మ దగ్గరికిగానీ వచ్చి "అమ్మా, నాన్నా, జీవితానికి అర్ధం ఏమిటని" అడగరు. పొట్ట కూటికి అస్తమానం శ్రమించే వాడికి కూడా అలాంటి ప్రశ్న కలగదు. అలాంటి ప్రశ్న రావాలంటే జీవిత గమనానికి ఏదో ఒక విఘాతం కలిగి, జీవితం ఒక సంకటంలో పడి ఉండాలి. యూజీ అన్నట్టు పూర్తిగా జీవిస్తున్నవాడెవడూ ఇలాంటి ప్రశ్న అడగడు. మనకి జీవితం గురించి అతి జ్ఞానం కలిగి మన అమాయకత్వం పోయినప్పుడే ఇలాంటి ప్రశ్న వేస్తాం.
సాధారణంగా మనం వివిధమైన కార్యాల్లో నిమగ్నులమై ఉన్నప్పుడు మన కార్యాల గమ్యాలు కాకుండా వేరే అర్ధాలని వెతకం. మన యత్నాలకు పెద్ద ఎత్తున ఏవో విఘ్నాలు కలిగినప్పుడే, వాటి వల్ల కలిగే వైఫల్యాలనించి కోలుకోవడానికి ప్రయత్నిస్తాం. ఉదాహరణకు ఉద్యోగాన్వేషణ, మనం ప్రేమించే అబ్బాయినో, అమ్మాయినో పొందడం. మనం ఇలాంటి ప్రయత్నంలో మునిగి ఉన్నప్పుడు సతతమూ మన యత్నం ఎంతవరకూ జయప్రదమైందో, ఇంకా ఎంతమేరకు మనం కృషి చెయ్యాలో అని మన కార్యాలకి విలువకడుతూ ఉంటాము. ఆ గమ్యం మనకు ఎంతముఖ్యమో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. మనం కార్యంలో ఏ దశలో ఉన్నామో, ఇంకా ఎంత దూరం వెళ్ళాలో, మనకు ఎలాంటి సాధనాలు అందుబాటులో ఉన్నాయో లాంటి విమర్శలు పునః పునః చేస్తూనే ఉంటాము. ఇలాగా సతతమూ తిరిగి తిరిగి మన కార్యాల్నీ, గమ్యాల్నే కాకుండా మన జీవితాన్నే పర్యవేక్షించడం మనకు ఒక అలవాటయిపోతుంది. మనం జీవితంలో ప్రగాడమైన వైఫల్యాల్ని ఎదుర్కొన్నప్పుడే జీవితానికే అర్ధం ఏమైన ఉందా, దానికి గమ్యం అంటూ ఎమైనా ఉందా, లేకపోతే జీవితమంతా నిరర్ధకమేనా అని ప్రశ్నించుకుంటాం. మనకు కలిగిన వైఫల్యాల కారణంగా మనకు మొత్తం జీవితాన్ని గురించి, దాని అర్ధాన్ని గురించి ప్రశ్నలు వేసుకోవడమ్ మొదలుపెడతాం. ఇలా ప్రశ్నించడం మూలంగా మనం వివిధమైన అస్వస్థతల్లో పడతాం: ఉదాహరణకి, జీవితం మీద విసుగు పుట్టడం, మద్యపానంలో పడిపోవడం, ఏదో ఒకటి సాధించాలనుకుంటూ సతతమూ కార్యనిమగ్నులమై ఉండడం, చిరకాలం ఉదాసీనంగా ఉండడం, చివరికి జీవితేచ్ఛకూడా పోయి ఆత్మహత్యకు పూనుకోవడమూ కద్దు.

జీవితార్ధాన్ని గురించిన సమస్యని పరిషకరించాలంటే అది ఏ సందర్భ్హంలో జనించిందో గమనించాలి. అంటే మన కోర్కెలూ గమ్యాలూ సాధించడంలో మనకెదురైన వైఫల్యాల్నిపరీక్షించాలి. అంటే సమస్యకి పరిష్కారం సమస్యని విడదీయడంలోనే ఉంది. మనం జీవితంలో పూర్తిగా నిమగ్నులమై దాన్నించి విడి కాకుంటే మనకి జీవితార్ధ రాహిత్య మనే సమస్యే కలగదు.

మన గమ్యాన్వేషణలో కాలం, భవిష్యత్తు లాంటి భావాలు ఇమిడి ఉన్నాయి. మనం గమ్యాన్ని చేరుకోగలిగితే అది మనలో వెలితిని పూరించి, జీవితం సఫలమైనదనే భావాన్ని కలిగిస్తుందని మన అపోహ. ఈ విధంగా ధనమూ, ఆస్తిపాస్తులూ, పలుకుబడీ, అధికారమూ, ఒక మంచి కుటుంబమూ, విజయవంతమైన జీవితమూ లాంటి గమ్యాలే కాక, ఈశ్వర కృప, ఈశ్వర సాన్నిధ్యమూ, స్వర్గ సుఖమూ, మోక్షమూ లాంటి మత సంబంధమైన లక్ష్యాలు కూడా మన జీవితాన్ని సఫలం చేస్తాయని మనం నమ్ముతాం. మనం కోరుకున్నవి మనకు లభించినప్పుడు, మన గమ్యాన్ని మనం చేరుకున్నప్పుడు మనకి క్షణికంగానైనా సంతృప్తి కలుగుతుంది. అయితే కధ అంతటితో ముగించదు. మన కోర్కె తీరిందనే ఎరిక కలిగిన సమయంలోనే, మనం చంకలు కొట్టుకొని సంతోషిస్తున్న సమయంలోనే మనం మరో గమ్యం ఏర్పరచుకుంటాం. దానికి కారణం ఆ జ్ఞానం మనను మనం సాధించిన లక్ష్యాన్నించి దూరంచేసి ఒక ద్వంద్వాన్ని సృష్టిస్తుంది. అలా ఏర్పడ్డ విభజన మూలంగా మనం మన పూర్వానుభవం దృష్ట్యా దాన్ని గురించి ఆలోచన మొదలెడతాము. ఉదాహరణకి, ఒక అమ్మాయితో పరిచయమయి, ఆ అమ్మాయి నేనంటే ఇష్ట పడుతూన్నట్టు కనిపించిందనుకోండి. ఆ అమ్మాయిని గురించిన ఆలోచన మనకి సంతోషం కలగజెయ్యడమే కాక, ఆ అమ్మాయితో భవిష్యత్తులో ఎలా ప్రేమ కలాపాలు చెయ్యాలో పథకాలు వెయ్యడానికి ప్రోత్సహిస్తుంది. లేకపోతే ఆ అమ్మాయి నన్ను నిజంగా ప్రేమిస్తోందా అనే అనుమానం వచ్చి, ఆ ప్రేమని నిరూపించుకోవాలనే యత్నంలో పడతాం. లేకపోతే మనం సాధించిన దాన్ని ఎలా పరిరక్షించుకోవాలా అని ఆలోచిస్తాం. లేకపోతే ఆ లక్ష్యన్ని ఏవిధంగా అభివృద్ధి చేసుకుందాం అని అలోచిస్తాం. లేకపోతే దాన్ని మన దగ్గరినించి ఎవరైనా తీసుకుపోతారేమోననే అనుమానంతో దాన్ని రక్షించుకోవడానికి కట్టుబాట్లు చేసుకోవడం మొదలెడతాం. ఈ విధంగా మనం ఒక లక్ష్యంనుంచి మరొకలక్ష్యానికి సులువుగా జరిగిపోతాం.

ఈ విధంగా మన యత్నం నిరాటంకంగా సాగిపోతూన్నంతకాలం మనం జీవితం గురించి, దాని అర్ధాన్నిగురించీ మౌలిక ప్రశ్నలు వెయ్యం. మనకి మత సంబంధమైన నమ్మకాలుంటే, ఆ నమ్మకాలు దృఢంగా ఉన్నంత కాలం మన యత్నానికి వచ్చే వైఫల్యాలని తట్టుకొనేందుకు అవి ఆసరాగా ఉంటాయి. ఉదాహరణకి, మనం అనుభవించే కష్టనష్టాలన్నీ ఈశ్వరుడు మనని చేసే పరీక్షలో భాగాలనీ, ఆయనే మనని ఒక ఒడ్డుకి తీసుకొస్తాడనీ, చివరికి అంతా మన మంచికేననీ నచ్చ చెప్పుకుంటాం.

ఇలాకాకుండా, మన లక్ష్యాలను వేటినీ మనం సాధించలేక, మనకు వైఫల్యమే పర్యవసానమైనప్పుడు, మనం మన జీవితమే వ్యర్ధమనుకొని జీవించడంలో అర్ధం ఏమిటి అని ప్రశ్నించడం మొదలెడతాం. అంటే జీవిత ప్రవాహానికి అడ్డుకలిగిందన్నమాట. మన అమాయకత్వంనికి దూరమైపోయి, దాన్లో మళ్ళి లగ్నం కాలేకపోతామన్నమాట. వైఫల్యమం మరింత గాడమైనప్పుడు, వేరే లక్ష్యాలపైకి మనసు మళ్ళించుకోలేము; జీవితానికి అతుకులూ వేసుకోలేము. దాంతో జీవించడంలో ఆసక్తి పోతుంది. మన ప్రార్ధనలకి దైవంనించి సమాధానం వచ్చినట్టు అనిపించినప్పుడు మనకు దేవుడిమీద నమ్మకం కూడా పోవచ్చు. పోయిన విశ్వాసం మళ్ళీ తిరిగి రాదు. జీవితంపేన విసుగు, దీనత, వ్యాకులత, మద్యపానం, ఆత్మహత్య లాంటి వాటిల్లోకి దిగజారకుండా ఇలాంటి సమస్యకి వేరే పరిష్కారమేమైనా ఉందా?

ఈ ప్రశ్న వెంటనే మరో ప్రశ్నకూడా వస్తుంది: జీవితంనించి వేరుపడకుండా తిరిగి దానిలో నిమగ్నమయ్యే అవకాశం ఏమైనా ఉందా?

మనకి ఇతరంగా ఏదో ఒకటి మన జీవితాన్ని సార్ధకం చెయ్యాలనీ, మనకి బాహ్యమైన వస్తువేదో ఒకటి మనకి సుఖాన్ని ఏర్పరుస్తుందనీ, అది లేకపోతే మనం బతకలేమనీ ఊహించి దాన్ని పట్టుకు వేళ్ళాడినంతకాలం ఎప్పుడో అప్పుడు మనకు వైఫల్యం తప్పదు; జీవితానికి అర్ధం ఏమిటనే ప్రశ్న ఉదయించకా తప్పదు. దీనికి కారణం, మనం మన కోర్కెలన్నీ సఫలం కావలని కోరుకోవడమే కాక, మనకి ఎన్నటికీ వైఫల్యం రాకూడదు, జీవితం అంతా ఏ ఒక్క క్షణమూ కష్టం కలగకుండా మనం చిరకాలం సుఖంగా ఉండాలని కోరుకోవడమే. జీవితార్ధ రాహిత్య సమస్యకీ కాలభావానికీ, భవిష్యత్తులో మనం లేకుండా పోవడానికీ, ఎంతో సన్నిహిత సంబంధం ఉంది; ఎందుకంటే మనకి బాహ్యమైన వివిధ వస్తువులూ మన జీవితాన్ని సఫలం చేస్తాయని ఊహించడానికి కారణం అవి లేకపోతే మన జీవితం లో ఒక వెలితి ఏర్పడుతుందని నమ్మడమే.

అసలు ఈ జీవితార్ధాన్వేషణకి మూలం జీవితంలో జరిగే ప్రతిసంఘటనకీ ఏదో అర్ధం ఉందని అనుకోవడమే కాక, మన జీవితంలో సంభవించే ప్రతి విషయాన్నీ పూసగుచ్చినట్టు కలిపి జీవితం మొత్తానికీ ఒక అర్ధం కలిపించుకోవడం మనకు పరిపాటి. మనం ఈ విధంగా నిర్మించుకున్న ప్రపంచంలో ’నేను’ అనే దానికి కేంద్ర స్థానం ఉంటుంది. అంతే కాక జరిగే ప్రతి సంఘటనకీ మన జీవితంలో ఎలాంటి పాలు ఉందో, అది మన ప్రగతికిగానీ తిరోగతికిగానీ ఏవిధంగా తోడ్పడుతోందో అని మనం క్షణక్షణం బేరీజు వేసుకుంటూంటాము. మన ఆలోచనా సామగ్రినంతా దీనికోసం వినియోగిస్తూంటాం. జీవితార్ధం అనేది ’నేను’ అనేదాని అస్తిత్వానికే అత్యవసరం. ఈ కొలతలవల్లనే మనకి మనఃశ్శాంతి దుర్లభమవుతుంది. ఎందుకంటే మన మనసు ఎప్పుడూ గతంతోనూ, వర్తమానంతోనూ అసంతృప్తి పడి, భవిష్యత్తుకోసం సర్వదా ఎదురుచూస్తూ బతుకుతూంటాం.

జీవితానికి జీవించడం కాకుండా మరే అర్ధం అవసరం లేదని గుర్తించాం అనుకోండి. అప్పుడు మనం చేసే ప్రతి పనీ అర్ధవంతమే అవుతుంది. జీవితం మొత్తానికి వేరే సార్ధకత అవసరం ఉండదు. గత సంఘటనల ద్వారా జీవితానికి అర్ధం చెప్పుకోము. మనసు ఇతర విషయాలపై పోక ప్రస్తుత వ్యాపకంపై స్థిమితంగా ఉంటుంది. మనశ్శాంతీ, ఆనందం వేరే విషయాల్లో మనం వెతకనక్కర్లేదు. మరో స్ఠితితో పోల్చడం వల్లనే మనకు అసంతృప్తి అశాంతీ కలుగుతాయి. ప్రస్తుతం మనం ఏమనస్థితిలో ఉన్నామో ఆ స్థితిలో స్వతహాగా ఉన్నకష్టనష్టాల్నిమనం నిరభ్యంతరంగా అనుభవించగలుగుతాం. భూత భవిష్యత్ కాలాల్లో అసత్యమైన, అసహజమైన మానసిక జీవితాన్ని జీవించక, నిజంగా ఈ ప్రపంచంలో తక్కిన జీవులలాగా బతుకుతాం.

ఈ కబుర్లన్నీ సాధారణంగా అందరికీ రుచించవని నాకు తెలుసు. అయినా నాకు తోచిన విషయాల్ని ఇక్కడ రాస్తున్నాను.