Sunday, September 12, 2010

సంసార సాగరం దుఃఖమయమా?

సంస్కృతంలో ’యద్భావం తద్భవతి’ అనే ఉక్తి ఉంది. ’దేన్ని నమ్ముతే అది అవుతావు.’ ఉదాహరణకు నువ్వు అల్పుడవని నమ్ముతే అప్పుడు నువ్వు అల్పుడవే అవుతావు.

ఈ వ్యాసంలో నేను చెప్పేదేమిటంటే మన ఆలోచనలూ, నమ్మకాలూ మనమే. అయినప్పటికీ, కనీసం క్షణికంగానైనా ఆ ఆలోచనలూ, నమ్మకాలూ మనం ఎరిగినప్పుడు మనం వాటికి బాహ్యంగా ఉండగలం. అలా అలోచనల్ని ఎరిగినప్పుడు ఆ సమయంలో మనం మరో ఆలోచన అవుతామనుకోండి. అయితే మన ఆలోచనా సముద్రానికి బాహ్యంగా పూర్తిగా ఒక్క క్షణమైనా ఉండడం సాధ్యమే.

నమ్మకాలు తక్కిన మనో స్థితులలాగానే ఆలోచనాభూయిష్ఠమైనవి. మనోస్థితులన్నీకూడా అదేవిధంగా అనివార్యంగా అలోచనారూపంలో ఉండి, అలోచనల ద్వారానే జీవం పోసుకుంటాయి. ఉదాహరణకు, మన ఆశలూ, భయం లాంటి ఆవేశాలూ, సౌందర్యోపాసనా లాంటివి.

నన్ను నేను పరిశీలించుకుంటే నిరంతరంగా నా మనసులో ప్రవహించే ఆలోచనా పరంపరా, మనో స్థితులూ, మనో చిత్రాలూ (images) తప్ప మరి నేనేమీ కాదనిపిస్తుంది. మనం ఈ ఆలోచనలు ఆలోచించే ఒక వ్యక్తిఅనీ, ఆ మనోస్థితులను అనుభవించే వ్యక్తిఅనీ భావించడం కద్దు. మనల్ని మనం ముఖాముఖీ ఎదుర్కున్నప్పుడు మనకు మిగిలేవి ఆ ఆలోచనలు మాత్రమే; ఆలోచించేవాడెవడూ కనబడడు.

ఏ క్షణంలోనైనా మనం మనల్ని చూచుకున్నప్పుడు, మనంకూడా మరో ఆలోచనగానో, దృక్పథంగానో ఉంటాము. ఈ ఆలోచననీ దృక్పథాన్నీ కూడా మరో క్షణంలో మనల్ని మనం ఎరిగినప్పుడు చూడగలం. మనం ఒక దృక్పథంనించి ఏ విషయాన్నైనా గుర్తించినప్పుడు ఆ గుర్తింపు ఆ విషయానికి ఒక నిరవధినీ (continuity), ఒక మనోస్థితిగా దానికి స్థిరత్వాన్నీ ఏర్పరుస్తుంది. అంతేకాదు, ఆ విషయాన్ని తరచుగా మన స్వరూపాన్ని (identity) కల్పించే మనోస్థితిగా మనకి మనం ఆపాదించుకుంటాం. ఈవిధంగా మనం పునః పునః చేసే స్వసంవేదన (self-consciousness) ఈ మనో స్థితిని స్థిర పరుస్తుంది. అవే బాధాకరమైన అవేశపు మనోస్థితులే కన అయితే మనం ఆ గోతిలో మరింతలోతుగా దిగిపోతాం. మనం ఆ స్థితుల్లో ఉన్నంతసేపూ అవి మన అస్తిత్త్వానికి అత్యవశ్యమైనవిగానూ, వాటికి ఎన్నడూ అంతం ఉండనట్టు గానూ అవుపిస్తాయి. అవి లేకుండా మనల్ని మనం ఊహించుకోలేం. అలాగే పునః పునః గుర్తించడం ద్వారానూ, సమ్మతి (confirmation) ద్వారానూ సుఖకరమైన మనో స్థితులకు ప్రాణంపోసి వాటిని మరింత బలవంతమైనవిగా చేస్తాం.

ఉదాహరణకి, ఒక వ్యాకుల స్థితినిగానీ, దుఃఖాన్ని గానీ తీసుకోండి. వ్యాకులస్థితీ, దుఃఖం ఇవి అలోచన లేకుండా ఎప్పుడూ ఉండవు. ఏ ఆవేశమైనా ఆలోచనలేకపోతే అది కేవల రూపంలేని శక్తిగా (energy) మాత్రమే ఉంటుంది; దాన్ని ఫలానా అవేశ స్థితి అని మనం గుర్తించలేం కూడాను. అది కేవలం ఒక ఉద్రేకం (excitement) కావొచ్చు. మన మనోస్థితిని ఎరిగి దాన్ని దుఃఖమని గుర్తించినప్పుడు, దానికి మనం ఒక నిరవధిత్త్వాన్ని, శాశ్వతత్త్వాన్నీ అపాదించి, మనం దుఃఖంలో నిశ్చయంగా ఉన్నామని రుజువు చేసుకుంటాం. ఆ స్థితిలేకుండా మనం ఉండలేం అన్నట్టు భావిస్తాం. ఈ విధంగా మనం తిరిగీ ఆ స్థితిని గుర్తించడం వల్ల ఆ స్థితికి నిరవధికత ఏర్పడి, దాన్ని మనం ఎప్పటికప్పుడు సజీవంగా నిలబెడతాం. అలా చెయ్యకపోతే, మరో జ్ఞాపకం మనసులోకివచ్చి ఆ దుఃఖాన్ని తిరగబెడితేతప్ప, ఆ దుఃఖం త్వరలోనే సమసిపోతుంది,.

ఉదాహరణకు, మానాన్న చనిపోయినప్పుడు మా నాయనమ్మ ఎంతో దుఃఖంలో ముణిగిపోయింది. ఆమె ఏడ్పునూ, గోడకి వేసి తల బాదుకోవడాన్నీ ఏదీ ఆపలేకపోయింది, చాకలివాడు వచ్చి పిలిచినప్పుడూ, బజారులో దుకాణానికి వెళ్ళి నన్ను శవజాగరణకు అవసరమైన వస్తువుల్ని తెమ్మన్నప్పుడూ తప్ప. అయితే ఆసమయాల్లో హఠాత్తుగా ఆమె దుఃఖం ఆగిపోయింది. అవసరమైనవన్నీ చెప్పి, చెయ్యాల్సినవన్నీ చేసింతరవాత, అవిడ రోదన మళ్ళా మొదలయింది. ఆమె ఏడుస్తూన్న సమయంలో ఆమే ఆమెదుఃఖం అనుకుని ఉండొచ్చు. కనీసం, ప్రస్తుతావసరాలని చూచుకోవాల్సిరావడం వల్ల ఆమె తన దుఃఖాన్ని క్షణికంగా మర్చిపోయింది. తన కొడుకు చావు జ్ఞాపకం, తను ఇంతకుముందే ఏడుస్తున్నాననే జ్ఞాపకం ఆమె దుఃఖానికి మళ్ళీ ప్రాణం పోశాయి. చాకలి వచ్చినప్పుడూ, నన్ను వస్తువులు కొనడానికి బజారు పంపించినప్పుడూ ఆమెకు ఎంతో అవశ్యం అనుకున్న ఆమె దుఃఖం ఏమయింది?

మృత్యుభయం, వ్యాధిభయం లాంటి విషయాలు తీసుకోండి. ఈ భయాల్ని కల్పించిన పరిస్థితుల్ని తిరిగి తిరిగి అలోచిస్తూండడం వల్ల వాటికి పునర్జీవనం కలుగుతుంది. ఆ విధంగా మనం వాటికి అవిరతత్త్వాన్నీ, శాశ్వతత్త్వాన్నీ కల్పిస్తాం. మనం భయాన్ని ఎరుగుతున్న ప్రతి సారీ్ అది ఒక బాధాకరమైన, అవాంఛితమైన విషయంగా కనిపిస్తుంది; అందుకని మనం దాన్ని ప్రతిఘటిస్తాం. దానివల్ల మనం ఆ భయంలోకి మరింత లోతుగా దిగజారుతాం. ప్రతిఘటించిన ప్రతిసారీ ఆ భయం మరింత పెద్దదీ, క్లిష్టమూ అయి మనల్ని పూర్తిగా తనలో ముంచేసి నిస్తబ్ధుల్ని చేస్తుంది. అయినా మనం దాన్ని వదలలేము, ఎందుకంటే దాన్ని వదిలేస్తే మనం మన అస్తిత్త్వాన్నే పోగొట్టుకున్నట్టుగా అవుపిస్తుంది. మన భయాన్ని పోగొట్టుకుంటే మనల్ని మనం కోల్పోయినట్టే అనిపిస్తుంది.

కోపం విషయంకూడా అంతే. కోపానికి కారణమైన పరిస్థితిని పునరామర్శించుకుంటూ, మన కోపాన్ని సమర్ధించుకుంటూ, రూఢిచేసుకుంటూ దాన్ని ఎంతగా ఉద్ధృతం చేసుకుంటామో గమనించండి. పరిస్థితుల వత్తిడి వల్ల, ఉదాహరణకు పై అధికారి అక్కడే ఉన్నాడని గమనించడం కారణంగా, మన కోపాన్ని వ్యక్తం చెయ్యలేకపొయ్యామనుకోండి. అప్పుడు ఆ కోపం ఏమయింది? ఎక్కడన్నా దాక్కుందా? ఎక్కడ? కోపానికి ఒక తీర్మానం జరగక పోయినప్పుడు అది మరొక రూపంలోనో, మరొకరిమీదనో వ్యక్తమవవొచ్చు. అలా జరుగుతే దానికి కారణం దాని వెనక ఉన్న భౌతిక కారణాలు (ఉదాహరణకు, అడ్రినల్ గ్రంథి స్రావం) ఇంకా తీర్మానం కాలేదన్నమాట.

కోపం మనకు సంభవించే విషయం అని మీరనవచ్చు. భౌతికమైన బాధకూడా మన ఎరికలో బాధ అనే ఓ మనోస్థితిగా సత్వరం పరిణమిస్తుంది; భౌతికమైన బాధగురించిన భయం పోయినప్పటికీ, మనం అలోచనతో దాన్ని తుడిచెయ్యలేము. వ్యాకులత, ఈర్ష్య, అసూయ, కోపం లాంటివన్నీ బాధాకరమైన స్థితులే; కనీసం, వాటిని నివారించుకునే ప్రయత్నంలో వాటిని బాధాకరమైన వాటినిగా పరిగణిస్తాం. భౌతిక బాధను మనం ఎరిగి నప్పుడు దాన్ని భయంగానూ, మనను మనం చూచి జాలిపడడంగానూ, వ్యాకులత గానూ మార్చుకుంటాం. వీటిని మనం మానసికంగా బాధాకరమైన స్థితులని అనుకుంటాం. అంతేకాక ఈ స్థితులద్వారా ఆ భౌతికమైన బాధ కూడ మరింత ఉద్ధృతమై అవిరతం అవుతుంది. గుర్తింపు, నిర్ణయించడం, పెంపొందించడంతో కూడుకున్న ఈ చక్రం బాధనూ వ్యాకులతనూ పునః పునః ఎరుగుతూండడంతో తిరిగి తిరిగి పునరావృత మవుతుంది.

నేను అవాంఛనీయమైన మనోస్థితులగురించే మాట్లాడుతున్నాననుకోకండి. సమయం సుఖంగా గడిచిపోతోంటే మన భుజాలమీద మనం తట్టుకుని శభాష్ అనుకుంటాం -- ఆ విధంగా మన సంతోష స్థితిని స్థిరపరచుకుని దానికి అవిరతతని కల్పించుకుంటాం. బాధాకరమైన స్థితులలాగానే ఈ స్థితులకు కూడా అంతరాయం కలగొచ్చు. ఉదాహరణకు, నేను ఒక సినిమా చూస్తూ ఆ ఆనందంలో నిమగ్నుడనై ఉన్నాననుకోండి. హఠాత్తుగా, మర్నాడు నేను పరీక్షకు చదువుకోవాలనే విషయం నాకు గుర్తుకువచ్చిందనుకోండి. అప్పుడు నా ఆనందం క్షణంలో అదృశ్యమై పోతుంది. అలాగే చాల సార్లు మనం వినే సంగీతం వినాలనీ ఆనందించాలనీ మనతో మనం చెప్పుకోవాలి. అప్పుడు మనలో మనం అలా ఎంత ఎక్కువగా అనుకుంటే అంత తక్కువగా సంగీతాన్ని విని ఆనందించగలుగుతాం. మరో పని ఏదైనా చెయ్యాలనీ, లేదా మరో చోట ఉండాలనీ ధ్యాస కలిగినప్పుడు, మన ఆనందాన్ని ఎరగడమే మన ఆనందంలోంచి మనల్ని బయటికి లాగుతుంది.

మనం మన మనోస్త్థితుల్ని స్వసంవేదన (self-consciousness) ద్వారానూ, గుర్తింపు ద్వారానూ, నిర్ణయాలద్వారానూ స్థిరపరుచుకోవడం కద్దయినా, వాటినించి మనం పూర్తిగా బయటకూడా పడగలం. మన నిరంతర భయ స్థితిలో ఒకానొక క్షణంలో మనం ఆ భయంతో విసుగుపుట్టి దాన్ని ప్రతిఘటించమనీ, దాంతో పోరాడమనీ, దాన్నించి పారిపో ప్రయత్నం చెయ్యమనీ నిశ్చయించుకున్నామనుకోండి. "ఏది ఏమయితే అవనీ; నేను చచ్చినా సరే; నాకు కాన్సర్ వస్తే రానీ; నేను సతతమూ బాధతోనే ఉండొచ్చు; లేదా చావనూ చావొచ్చు. ఎలా అయితే అలాగే కాని," అని అనుకున్నాననుకోండి. అప్పుడు మనం ఆ భయానికి లొంగిపోతాం; దానికి మనల్ని మనం అప్పగించుకుంటాం. అప్పుడు మనం మన భయంలో స్థిరపడే బదులు దాన్ని క్షణికంగానైనా అధిగమిస్తాం. అదేవిధంగా, మనం కోపంలో ఉన్నప్పుడు, అవతలి మనిషిని క్షమించి, మనల్ని మనం సమర్ధించుకునే యత్నాన్ని విరమించి, ఆ మనిషి ప్రవర్తనను మార్చడానికి ప్రయత్నించం అనుకోండి. అప్పుడు చూడండి ఆ కోపానికి ఏ మవుతుందో.

ఈ పై చర్చను అన్ని మనోస్థితులకూ అన్వయించొచ్చు.

నాకు తెలిసినంతలో మనం బయటపడలేని ఒక్క మనోస్థితికూడా లేదు. దాని వ్యవస్థనూ, నిర్మాణాన్ని (అంటే దాని వెనక ఉండే ప్రేరణలనూ, నమ్మకాలనీ (assumptions), అభిమానాల్నీ (attachments), ప్రతిఘటనల్నీ) గమనించి, దాన్లో ఉండకూడదనే నిర్ణయానికి రావాలి. మరోసారి ఆ స్థితిలోకి దిగజారినప్పుడల్లా మనం దాన్ని గుర్తుపట్టాలి. దీనన్నిటికి అవశ్యమైన షరతు ఏమిటంటే మన ఉద్రేకతా స్థితికి ఆ సందర్భానికి అవసరమైన ఏ విషయంగురించైనా విరక్తత, త్యాగం. అంటే మన ఆవేశ విషయాన్ని విడిచి ఉండగలగడం. (సాంప్రదాయికంగా వచ్చిన ఉక్తి నొకదాన్ని ఈ సందర్భంలో గుర్తుంచుకోండి: "సరాగమంటే ఇది లేకపోతే నాకు జరగదు అనుకోవడం.")

ఒక మనోస్థితిని మరో ఆలోచనతోనైనా మరో మనోస్థితితోనైనా అధిగమించగలం. మనోస్థితి అంటే అవిరతమైన ఆలోచనా పరంపరే. మనం మన మనోస్థితికి భిన్నం కాదు. మరో ఆలోచన మన మనసులోకి చొచ్చుకొని వచ్చి మన జీవాన్ని ఆవహించినట్టు, ఆ క్షణానికి మనం ఆ అలోచనగానీ మనోస్థితిగాని అయిపోయి పూర్వస్థితి నించి బయట పడతాం.

అలా మనం ఆ ఆలోచనగానీ, మనోస్థితిగానీ ఒక్క క్షణం మాత్రమే అయి, మరో క్షణంలో స్వసంవేదన ద్వారా (మనను గురించిన ఎరికద్వారా) బయట పడగలుగుతే, మన నిజమైన ఆత్మ, స్వరూపం ఏమిటి?

అప్పుడప్పుడు ఈ విధంగా మనం మన మనోస్థితులనుంచీ, ఆలోచనలనించీ బయట పడడమేకాదు; నేను కావాలనుకుంటే కొన్ని క్షణాల్లో నేను అన్నివిధాలైన అలోచనా పంకాల్నించి బయటపడి ఏ ఆలోచనా లేకుండా, రెండే కొలతల (two dimensions) స్థితిలో ఉండగలను. అలాంటి స్థితిలో నాకూ ప్రపంచానికీ అంతరం ఉండదు. దీనికి అవసరమైంది అన్ని చింతల (concerns) నించీ విముక్తులం కావడమే; అంటే బతుకు చావుల గురించిన చింతలనించి కూడా. ఈ విధమైన వైరాగ్యం సంపుర్తి అయినప్పుడు, మరి వేరే మనోస్థితుల్నీ, ఆలోచనల్నీ(వాటినించి విడిగి ఉంటాం కనక -- అదే వైరాగ్యమంటే) అధిగమించాల్సిన అవసరం ఉండదు. ఆక్షణానికి ప్రతిదీ అది దానిగానే ఉండొచ్చు; మనం దేన్నీ మార్చనవసరంలేదు! అప్పుడు మనమున్న స్థితిని మంచిదనిగానీ, చెడుదనిగానీ, వాంఛనీయమైనదని గానీ, అవాంఛనీయమైనదని గానీ, సుఖమని గానీ, కష్టమనిగానీ నిర్ణయించం. వాటితో మనకు నిమిత్తంలేదు. ఒక్కొక్కప్పుడు మనం మన అలోచనలగానూ, మరొకప్పుడు శూన్యంగానూ ఉంటాం.

అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది: ఈ అధిగమన స్థితిలో కూడా ఏం జరుగుతోందో మనకు ఎరిక ఉంటుంది. అంటే ఏదో మనో వ్యాపారం జరుగుతూ ఉండాలి. ఏ ఆలోచనాలేకపోతే, ఆ స్థితి ఒకటి ఉన్నదని మనకు తెలియనుకూడా తెలియదు, తెలియడమనేది ఒక ఆలోచనద్వారానే జరుగుతుంది కనక. అంటే నా ఉద్దేశంలో, గాఢనిద్రలో ఉన్నప్పుడు నేనుండనన్నమాట.

అద్వైతాన్ని బోధించిన ఆది శంకరులు మనం నిద్రనించి లేచింతరవాత గాఢంగా నిద్రించామని గుర్తుతెచ్చుకోగలం కనక గాఢనిద్రలోకూడా ఆత్మ (సాక్షి) ఉంటుందన్నారు. దీనితో నేను ఏకీభవించను. నేను గాఢ నిద్రలో ఉన్నానని గుర్తుకు తెచ్చుకున్నాం అంటే, మనం నిద్రలో పడిపోయే క్షణమూ, లేచింతరవాత మొద్దుబారిన శరీరాన్ని మాత్రమే గుర్తుకు తెచ్చుకున్నామే గానీ, ఆ రెంటి క్షణాల మధ్యా, అంటే గాడనిద్రలోని మనో స్థితిని, గుర్తుకు తెచ్చుకోలేదు. అలా పూర్వాపర క్షణాలకి మనం లంకపెట్టి, వాటికి అవిరతతను ఏర్పరచి, వాటి మధ్య సమయానికి గాఢనిద్రని ఆపాదించుకుంటాను.

అయితే, మనం అలోచించకపోతే మనం లేనట్టేనా? పై చెప్పిన నా రెండుకొలతల స్థితే నా నిజ స్వరూపం అయి ఉండాలి (దీన్ని విషయాల్ని కేవలం ఎరగడం అందామా?); లేకపోతే నేను ఉన్నాననే నాకు తెలియని ఏదో స్థితిని నా నిజస్వరూపం అందామా? ఈ స్థితిని ఆత్మ అని గానీ, అస్తిత్త్వపు ఏకత్త్వం అనిగానీ అని, తెప్పమీద తేలిపోదామా?

1 Comments:

Blogger లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

మంచి విషయాల్ని చర్చిస్తున్నారండి.
కొన సాగించండి.

September 15, 2010 at 5:11 AM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home