Tuesday, January 1, 2008

2. ప్రేమ, నిరాశ, జీవితం మీద నిరాసక్తి:


'చలం'


నేను విజయవాడలో ఇంటర్మీడియట్ పరీక్షలు తప్పి ఎమ్మెస్సెం బండెక్కి పాసవడానికి ప్రయత్నించే రోజుల్లో, మా సంగీతం మాస్టారి భార్యతో ప్రేమ వ్యవహారంలో పడ్డాను. అప్పుడే నాకు నా జీవితంలో మొదటి సారిగా ప్రేమంటో ఏమిటో, ప్రేమలోపడడమంటో ఎమితో చవి చూశాను. జీవితం ధన్యమైందనుకున్నాను. జీవితంలో నాకు మొదటిసారిగా ప్రేమను రుచిచూపిన నా ప్రియురాలికి నేను
ఎంతో కృతజ్ఞుణ్ణి.

అయితే ఆమెను లేవదీసుకుపొయ్యే ప్రయత్నానికి మా అన్నయ్య నాకు చేసిన 'దోహదం' వల్ల విఘ్నం కలిగి ఆమె తన ఇంటికి తిరిగి పోవాల్సి వచ్చింది. తరవాతకూడ మేం అప్పుడప్పుదు చాటుగా కలుసుకున్నా, మా ప్రేమ మాత్రం సఫలమవలేదు. ఆ లోటు నా జీవితాన్ని బాగా దెబ్బ తీసింది; దేనిమీద కూడా ఆసక్తి లేకుండా, జీవితమంటేనే విరక్తికలిగి నాలుగయిదేళ్ళు గడిపాను. Boredom అనేది నా జీవిత సమస్యగా తయారయ్యింది.

1956-57 ప్రాంతాల్లో మద్రాసులో యూనివర్సిటీలో ఒక సంవత్సరం M.Litt రిసెర్చికని చేరాను. ఆకాలంలోనే నా సమస్యనిగురించి చలంగారితో సంప్రదిద్దామని అయనకి తిరువన్నామలైకి ఒక పోస్టు కార్దు రాశాను. చలంగారి రచనలతో నాకు చాలా కాలంగా పరిచయమే. వాటి ప్రభావం నామీద బాగా ఉంది. అందుకనే ఆయనకి రాశాను. మెషీనులో పడేస్తే వచ్చినట్టుగా ఆయన దగ్గర్నించి వెంటనే సమాధానం వచ్చింది. అప్పుడు అయన్ని కలవడానికని నేను రైలుమీద ప్రయాణం చేసి తిరువణ్ణామలైకి వెళ్ళాను.

వారిల్లు తిరువన్నామలై ఊరిచివర రమణాశ్రమానికి ఎదురుగా ఉండేది. దానిపేరు "రమణస్థాన్". ఆయనా ఆయన కుటుంబం నన్ను ఎంతో ఆదరంగా చూశారు. ఆయన కూతురు సౌరీసుగారి మార్గదర్శకత్వంలొ ఆ కుటుంబం నడుస్తోందని తెలుసుకున్నాను. తన తపోఫలం వల్ల ఈశ్వరుడు ఆమెకి ప్రత్యక్షమవడమే కాక, ఆమెద్వారా మాట్లాడుతూ, ఆ కుటుంబంలోని వారి జీవితాల్నీ, వారి బంధుమిత్రుల జీవితాల్నీ తీర్చి దిద్దుతున్నాడని వారందరికీ నమ్మకం ఉండేది.

నేను సౌరీసుగారితో దాదాపు ఒక గంటదాకా ఏకాంతంగా మాట్లాడాను. నేను దేవుడి విషయాలేవీ నమ్మలేనన్నాను. ఆవిడ నమ్మకం ఉండితీరాల్సిందేనని పట్టుబట్టింది. చివరికి open mind ఉంచుకోమని సలహా ఇచ్చింది. నేను సరేనన్నాను.

ప్రతిరోజూ సాయంకాలం భోజనాలయింతరవాత భజన సమావేశం జరిగేది. నేను దాన్లో పాల్గోలేపోయినా అక్కడే కుర్చీలో కూర్చుని వింటూండేవాణ్ణి. నాకు సంగీతమన్నా, భజనలన్నా చాలా ఇష్టం. ఆమె మీరా భజనలూ, 'చంద్రశేఖర పాహిమాం' అనే భజనా,తక్కిన సమయాల్లో వెంకిపాటలూ పాడుతూండేది. సౌరీసుగారి పాటలుకూడా నాకు బాగా నచ్చాయి. (అమెరికానించి ఒకమాటు వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు, నేను అడిగితే నాకోసం ఆమె వెంకిపాటలు పాడారు. నేను వాటిని రికార్డు చేసుకున్నాను కూడాను. అవి నాదగ్గర ఇప్పటికీ ఉన్నాయి.) చూడడానికి ఆమె ముఖంలో ఏవో తెలియని gracefulగా ఉండే కవళికలు కనబడుతూండేవి, ఆమె ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడుకూడా.

చలంగారుకుడా పాడుతూండేవారు. ఆయనకూడా సంగీతం నేర్చుకున్నారని తెలిసింది. ఆయన గాత్రం ఎంతో ఆవేదనతో అతి దీనంగా ఉండేది.

ఒకరోజు మధ్యాన్నం నేను ఆకలిగా ఉందంటే తనే స్వయంగా వంటింట్లోకి వెళ్ళి, కామాక్షి ఆకుతో పకోడీలు చేసి నాకు పెట్టారు. ఎంత ఆప్యాయతో!

అక్కడికి వెళ్ళినప్పుడు రమణాశ్రమ దర్శనంకూడాచేసుకునేవాణ్ణి. రమణమహర్షిని నా చిన్నతనంలో మా నాయనమ్మ చూసింది. అప్పుడు ఆమె ఇంటికి తీసుకొచ్చిన "నేనెవరు" అన్న చిన్న పుస్తకాన్ని చదివాను. ఆది నాకు స్వతహాగా తోచిన ప్రశ్నేగనక, ఆయనంటే నాకు ఎంతో గౌరవం.

నా ప్రేమ వ్యవహారం గురించీ, జీవితంపై నా నిరాసక్తిగురించీ నేను చలంగారితో చెప్పుకున్నాను. ఆయన నాపై సానుభూతి చూపారు. అయితే అన్నిబాధ్యలూ ఆయన ఈశ్వరుడికి వదిలేశారు గనక నాకు ప్రత్యేకంగా ఏమీ సలహా ఇచ్చినట్టు గుర్తులేదు. ఈవిషయంలో నేను మద్రాసునించి ఒకసారి ఉత్తరం రాసినప్పుడు ఆయన 8 పేజీల సుదీర్ఘమైన సమాధానం రాశారు. (ఏదో నిస్పృహలో ఉన్న సమయంలో దాన్ని చించిపారేశాను.) నాబాధలన్నిటికి నా కోర్కెలే కారణమనే ధోరణిలో ఏదో అధ్యాత్మికంగా ఆయన రాశారు.

1960 ప్రాంతాల్లో సౌరీస్ ఆ ఏడాది ఫలానా రోజున ఒక ప్రళయం రాబోతున్నదనీ, దానికి కావాల్సిన రక్షణ ప్రయత్నాలన్నీ చేసుకోమనీ ఈశ్వరుడిపేరట అందరికీ ఉత్తరాలు రాయించింది. గోరాగారికి కూడా ఈ విషయం తెలిసి ఆయన అపహాసం చేశారని, ఆ కబురంతా అబద్ధమని సవాలు చేశారనీ గుర్తు. చలం ఆ విషయాన్ని పూర్తిగా నమ్మాడు తక్కినవిషయల్లాగానే. తీరా ఆప్రళయం ఏమీ రాకపోయేటప్పటికి ఆయనకు సౌరీసు మీదా, ఆ ఈశ్వరునిమీదాకుడా కొంచం నమ్మకం సన్నగిలింది. కాకపోతే సౌరీస్ మీద ఇంకా పూర్తిగా నమ్మకంపోలేదు; ఆమె చెప్పిన వివరణలు విని కొంచం తనకుతాను సరిచెప్పుకున్నాడు.

మరో విషయం: గోరాగారు ఒకప్పుడు చలంగార్ని చూడ్డానికి తిరువణ్ణామలై వెళ్ళారని విన్నాను, చలాన్ని ఆ ఈశ్వర భక్తీ అన్నీవదిలేసి తనతో వచ్చి సంఘ సంస్కరణోద్యమంలో పాల్గొనమని ఆహ్వానిద్దామని. చలం దానికి సుతరామూ ఒప్పుకోలేదని వేరే చెప్పక్కర్లేదు. ఆ విషయంలో గొరాగార్నిగురించీ, ఆయన నాస్తికత్వం గురించీ చలం ఇలా అన్నాడు:"గోరాగారు దేవుడులేడంటూ విసిరే చేతి వూపులోకాక దేవుడు వేరే ఎక్కడున్నాడు?" ఈ సమాధానాన్ని బట్టి చలం కున్న ఉదారబుద్ధి ఎంతటిదో తెలుసుకోవచ్చు.

నేను అమెరికాకు వచ్చింతరవాత కూడా ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తూండేవాణ్ణి. ఆయన ప్రతివుత్తరాన్నీ "నారాయణ గార్కి" అని సంభోధిస్తూ "ఈశ్వరాశీర్వచనాల్తో" అని ముగించేవారు. నేను అమెరికాలో ఉంటూండగా ఆయన కధల్ని రెంటిని ఇంగ్లీషులోకి తర్జుమా చేసి ఇంగ్లండులో ఆర్గోసీ అనే పత్రికలోనూ, షికాగో యునివెర్సిటీ Southeast Asian Journal లోనూ ప్రచురణ చేయించాను. 1990 ప్రాంతాల్లో ఆయన రాసిన "సుధ" అనే పద్యకావ్యాన్ని నేను ఇంగ్లీషులోకి (సౌరీస్, జూలీ వెల్లింగ్స్, ఎలియట్ రాబెర్ట్స్ ల సహాయంతో)అనువాదం చేశాను. దాన్ని UNESCO వారి పోషణతో మోతీలాల్ బనార్సీదాసీ (Delhi)అనే ప్రచురణకర్తలు ప్రచురించారు.


చలంగారి మృతి తరవాతకూడా కొద్దిసార్లు సౌరీసును చూడడానికి వెళ్ళానుగానీ, పైకి ఆమె సుముఖంగానే వున్నట్టు కనిపించినా, రచనలో తానుకూడా పాల్గొన్న "సుధ" బాగోలోలేదనీ, దానికి మూలంలోని స్పిరిటు రాలేదని అన్నది. వెళ్ళేప్పుడు కూడా ఆమెని శెలవు అడగడానికి అమెని తోటలో వెతుక్కోవాల్సి వచ్చింది, అమెకు నెను వెళ్తున్నాని తెలిసుండికూడా. చాలారోజుల తరవాత తెలిసింది, మా స్నేహితుడు చంద్రశేఖర్ చెబితే, ఆమెకి చిన్నప్పణ్ణించీ గుడ్ బైలు చెప్పడం అంటే ఇష్టంలేదని.


చలంగారింట్లోనే నర్తకి అనే అవిడ ఉండేది. (ఇప్పుడు ఆమె మరణానికి దాపుగా ఉన్నది.) ఆమెతో నాకు బాగా పరిచయం ఉంది. నేను నా కుమార్తెను ఒంటరిగా పెంచుకోవాల్సిన సమయంలో ఈదేశానికి వచ్చి నన్ను పెళ్ళిచేసుకొని నాభార్యగా ఉండి మా అమ్మయిని పెంచమని మా స్నేహితుల ద్వరా కబురు పంపించాను. అప్పుడు చలం చాల వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆమె ఆయనకి సేవలు చేస్తూండేది. అందుకని అమెని ఆయన వెళ్ళనివ్వరని అంది.

ఆమెద్వారానే నేను మా స్నీహితులూ గురువుగారైన యూ. జీ. కృష్ణమూర్తి గారిని కలిసే అదృష్టంపట్టింది. ఆయనతోటి సంపర్కం పాతికేళ్ళ పైగా జరిగి, పోయిన మార్చిలో ఆయన మరణంతో అంతమైంది. ఆవిషయం గురించి తరవాత రాస్తాను.

4 Comments:

Blogger వింజమూరి విజయకుమార్ said...

గర్వం, అతిశయం లాంటి మనో వికారాలకి తావివ్వకుండా కేవలం విషయం ప్రాధాన్యం గలిగిన మీ టపాలు బావున్నాయి. అందులో గొప్ప వ్యక్తులతో మీ పరిచయాలూ,వాటిని మీరు వ్యక్తపరుస్తున్న తీరు (ముఖ్యంగా) అసక్తికరంగా వుంది. దయతో కొనసాగించగలరు. కృతజ్ఞతలతో. . .

January 1, 2008 at 11:37 PM  
Blogger CORRUPTORS said...

This comment has been removed by a blog administrator.

January 2, 2008 at 2:32 AM  
Anonymous Anonymous said...

I read in todays news paper that Nartaki expired. I think fate will have the ultimate say ..

February 18, 2008 at 5:02 PM  
Blogger Bolloju Baba said...

నాకు చలం గారంటే చాలా అభిమానం.
మంచి విషయాలు తెలిసినవి. థాంక్స్.

రెండవ కామెంటు చేసిన వాడిని క్షమించండి.

May 14, 2008 at 7:55 AM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home