నా ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు
"నేను ఎవరిని ?"
డెబ్భైమూడేళ్ళ తరవాత నేను ఇదే ప్రశ్న అడిగితే దానికొచ్చే సమాధానం అంత సులభమైంది కాదు. కానీ ఆవిషయం చివర ప్రస్తావిస్తాను.
***
నీను 1934 లో నరసరావుపేటలొ పుట్టాను. నా పూర్తిపేరు జగర్లపూడి శ్రీ రామ లక్ష్మీ నారాయణమూర్తి. అమెరికాలో కాలిఫోర్నియాలో మాంటెరే దగ్గరున్న సీసైడు అనే ఊళ్ళో గత 34 ఏళ్ళుగా నివాసం. మాంటెరే పెనిన్సులా కాలేజీలో తత్త్వశాస్త్రోపాధ్యాయుడుగా 26 ఏళ్ళు పనిచేసి 2000 సంవత్సరంలో రెటైరయ్యాను. నా భార్య వెండీ ఒక అమెరికను ఆవిడ.. కొడుకు కిరణ్ ఇప్పుడే కోలరాడో కాలేజీలొ బి.ఏ. పాసయ్యడు. కూతురు శ్యామల భర్త దాక్టర్ కాష్యప్ త్రివేదీతో కాలిఫోర్నియాలో లాంగ్ బీఛ్ అనే ఊళ్ళో ఉంటుంది, నాట్యమూ, యోగమూ విద్యార్థులకు నేర్పుతో.
నేను పెరిగింది విజయవాడలో (S.R.R. & C.V.R. College), B.A. Hons. వాల్తేరు ఆంధ్ర యూనివర్సిటీలోనూ జరిగింది.
జ్ఞానోదయం:
మామేనత్తా, మా నాయనమ్మా మా ఇంట్లోనే ఉండేవారు. వాళ్ళిద్దరి ఆధ్యాత్మికత్వం నాకు కొంచెం అంటి ఉండాలి. అయితే వాళ్ళిద్దరూ మ నాన్నఒతో కలిసి మా అమ్మని పెట్టిన బాధల్నీ, సాధింపుల్నీ ఇప్పటికి మర్చిపోలేను. ఆ వాతవరణంలో పుట్టి పెరిగానుగనక, "నే నెవరి"ననే ప్రశ్న నాలో ఉదయించి ఉంటుందనుకుంటాను; లేకపొతే అది స్వతహాగా, జన్మతో వచ్చి ఉండాలి. ఏది కారణమో స్పష్టంగా నిర్ధారించి చెప్పలేను.
చిన్నప్పుడు నేను అందరితొ కలిసి గుళ్ళకి వెళ్ళి దేవుళ్ళకి దణ్ణాలు పెట్టేవాణ్ణి. రోజూ దేవుళ్ళ పటాలముందూ, విగ్రహాలముందూ, ప్రార్ధనలూ, అందరూ చెసే పూజలూ పునస్కారాలూ చేసేవాడిని. అప్పుడప్పుడనిపించేది ఇన్ని దేవుళ్ళకూ వెనక ఒకేఒక భగవంతుడుండి ఉంటాడని.
కొంచెం ఎదిగింతరవాత, గుళ్ళొ ఒంటగా కూర్చుని ధ్యానంలొ పడేవాణ్ణి. అలాగే డాబా మీద వెల్లకితల పడుకుని వర్షం పడాలి, పడాలి అని కోరుకుండే వాణ్ణి, అలా గట్టిగా కోరుకుంటే కోర్కె ఫలిస్తొందేమోనన్న ఆశతో. ఆయితే అలాంటివేవీ జరక్క పోవడంవల్ల ఆ ప్రార్ధనల విషయం లోనూ, పుజా ధ్యానాల్లోనూ పెద్దగా నమ్మకం కుదర లేదు. కాకపోతే, ఆధ్యాత్మికతమీద నాకున్న ఆసక్తి ఏమాత్రమూ తగ్గలేదు.
గోరా, నాస్తికత్వం
అలా రోజులు గడుస్తూండగా, హైస్కూలులో sixth form లో ఉండగా, ఒకరోజు బడికి వచ్చినప్పుడు ఇంకో కుర్రాడి చేతులో గోరాగారు రాసిన "నాస్తికత్వము, లేదా దేవుడు లేదు" అనే పుస్తకం చూశాను. పుస్తకం తెరిచి లోపల ఏముందో చూచానో లేదో కానీ నా మెదడుకి మాత్రం ఒక్క షాకు తగిలింది: "అయ్య బాబోయ్, దేవుడు ఉండకపోవచ్చుననే ఊహే ఇంతవరకూ నాకు తట్టలేదే!" అప్పుడే నాకు దాని విషయం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగింది. నాకు తెలియకుండానే నా మనసు, "దేవుడు లేకపొయ్యేందుకు వీలుంటే, దేవుడు ఉండడానికి వీల్లేదన్నమాట," అనే నిర్ణయానికి వచ్చినట్టుంది.
తరవాత ఆ గోరాగార్ని ఎలాగైనా కలవాలనే కోర్కె కలిగి, నాగరాజారావు అనే సహాధ్యాయుడితో మాట్లాడాను. ఆ పుస్తకాన్నించే గోరాగారి అడ్రెసు విజవాడ పొలిమేరల్లో ఉన్న పటమట, నాస్తిక కేంద్రము అని తెలుసుకొని, బస్సుమీద అయన్ని కలుసుకోడానికి మేమిద్దరం వెళ్ళి కలుసుకున్నాము. అదే రాబోయే పది సంవత్సరాల నా నాస్తిక జీవితానికి నాంది..
నా నాస్తిక భావాలవల్ల నాకు నా కుటుంబంలో కొన్ని చిక్కులు వచ్చాయి. సాంప్రదాయికుడైన మా నాన్నకు గోరాగారితోనూ, నాస్తికత్వంతోనూ నాకున్న సాంగత్యం గురించి తెలిసి, నాతో తెగతెంపులు చేసుకోడానికి సిద్ధమైతే, ఆయన్ని శాంతపరచడానికి నేను కొన్ని బూటకాలూ, అబద్ధాలూ ఆడాల్సివచ్చింది.
గోరాగారితోనే కాకుండా ఆయన కుటుంబంతో కూడా పరిచయమయ్యింది: ముఖ్యంగా లవణంగారితో. అక్కడే నార్ల చిరంజీవిగారనే రచయితనికూడా కలిశాను. ఆయన నన్నొక వ్యాసాన్ని రాయమని ప్రోత్సహిస్తే రాశాను, మొదటిసారిగా. 'సంఘం' వారపత్రిక నాస్తిక కేంద్రంనించి వచ్చేది. ఆ కేంద్రం ప్రెస్సులోనే ఆ పత్రికను అచ్చువేసేవారు. ఆ ప్రెస్సులో నేను అప్పుడప్పుడు అచ్చులు కూర్చడం, ట్రెడిల్ తొక్కడం, పేపరు కొయ్యడం లాంటి పనుల్లో లవణంగారికి సాయం చేస్తూండేవాణ్ణి. నా కాలేజీ చదువులు కొంచెం అప్పటికే కుంటుపడడం మొదలెట్టాయి. ఫిజిక్స్ నేర్చుకోవడానికి నాకు కొంచెం సహాయం చెయ్యమని గోరాగార్ని అర్ధించాను. ఎప్పుడూ కార్యకలాపాల్లో మునిగివుండే ఆయన ఆవిషయంలో నాకు ఎంతవరకు సాయం చేశారో గుర్తులేదుగాని, ఆయన చెయ్యనని మాత్రం అనలేదు.
గోరాగారు పార్లమెంటు ఎలెక్షన్లలో నిలబడ్డప్పుడు, దాని ప్రచారం సందర్భంలో ఆయనతో వూరంతా తిరిగేవాణ్ణి.
చివరిసారిగా నేను గోరాగార్ని చూసింది 1969 జనవరిలో. అమెరికాలో ఐదేళ్ళు డాక్టరేటు చదువులుకని ఉండి, ఇండియాకి తిరిగివచ్చి, ఒక ఏడాది తరవాత అప్పుడే అమెరికాకి డాక్టరేటు పూర్తి చెయ్యడానికి తిరిగి వెళ్ళబోయేముందు, నేనూ, లారీ మారిస్ అనే అమెరికన్ స్నేహితుడూ నాస్తిక కేంద్రంలో మూడు నాలుగు రోజులు ఉన్నాం. ఆ సమయంలో నన్ను గోరాగారు తన సంపాదకత్వంలో ప్రచురింపబడే 'Atheist' ఇంగ్లీషు మాస పత్రికకి వ్యాసం రాయమన్నారు. నేను "Inaction, Inefficiency and Corruption" అనే సుదీర్ఘమైన వ్యాసాన్ని రాశాను. దాన్ని మూడు సంచికల్లో భాగాలుగా వేసుకున్నారు.
ఆసమయంలోనే నేను గోరాగారు నాస్తికత్వం పుస్తకంలో చేసిన బోధల విషయంలో కొన్ని సవాలు ప్రశ్నలు ఆయన్ని అడిగాను: "మనం మన వంతైన సంఘ ఋణాన్ని పన్నుల ద్వారా తీర్చుకుంటున్నాం కదా, సంఘ సేవ చేయాలనే వేరే ఋణం మనకి ఎందుకుండాలీ?" అని. ఇంకో ప్రశ్నకూడ వేశాను: "మానవుడికి సంపూర్ణ స్వేచ్ఛ ఉందంటున్నారు. ఆ స్వేచ్ఛనీ సంఘంలో ఉన్న ఇన్ని నియమలకీ లోబడి ఉండాల్సిన అవసరాన్నీ ఎల్లా సమన్వయ పరుస్తారూ?" ఈప్రశ్నలు స్పష్టంగా ఏమాటల్లో అన్నానో గుర్తు లేదుగాని, గోరాగారు నేనడిగిన ప్రశ్నలకు సమాధనం చెప్పుకోలేక నేను అక్కడ ఉన్నన్ని రొజులూ సతమతమయ్యారు. అప్పటితో నాకూ నాస్తికత్వానికీ పూర్తిగా సంబంధం తెగిపోయింది. అయినప్పటికి నేను గోరాగారి దగ్గర్నుంచి నేర్చుకొన్నది నా నమ్మకాల్ని నేను ప్రశ్నించడమే.
నేను ఆంధ్రా యూనివర్సిటీలో తత్త్వశాస్త్రం చదువుకుంటున్న సంవత్సరాల్లోనూ (1953-56), తరవాతి రోజుల్లోనూ, నాస్తికత్వం కూడా ఒక నమ్మకమేనని గుర్తించాను. అప్పటినించీ ఇప్పటివరకూ ఏనమ్మకాలూ లేకుండానే నా జీవితాన్ని సాగించాలనే నా యత్నం.
మరొక విశేషం ఏమిటంటే, గోరాగారి ప్రభవం వల్లనేనేమో, నాకు అప్పటినించీ ఇప్పటివరకూ కులాల మీద నమ్మకమూ పట్టింపూ పూర్తిగా పోయాయి. ఏవైనా ఫారాలు పూర్తి చేసేప్పుడుకూడ, కులం అనేగడిలో nil అని రాసేవాణ్ణి. నా ఉద్దేశ్యంలో ఎవర్నన్నా మీకులమేమిటని అడగడం మర్యాద కాదు.
మాంసాహారం, శాకాహారం
ఇంకో విషయం మాంసం తినడం గురించి: ఆంధ్రా ఊనివర్సితీలో ఫైనల్ ఆనర్సు చదువుకుంటూనప్పుడు, ప్రయోగరీత్యా non-vegetarian mess లో చేరాను. మాంసం, గుడ్లూ, చేపలూ, అన్నీ రుచిచూశాను గానీ, నాకు అవి ఏవీ రుచించలేదు, బలవంతం చేసుకుని తినడమే. 1962లో నేను పైచదువులకని అమెరికా వెళ్తూన్నప్పుడు, అక్కడికి వెళ్ళి తిరిగొచ్చిన ఒకాయన, "అమెరికాలో చలి బాగా వుంటుంది, అందుకని మరింత ప్రోటీను ఆహరం కావాలి. దానికోసం నువ్వు గుడ్లు తినాలి," అని అంటే, మొదటి సంవత్సరం గుడ్లు తిన్నాను; ఓ అమ్మాయితో బయట తినడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మాంసం తింటూండేవాణ్ణి. 1967లో ఫ్రాన్సులో ఒక నెల నా ఫ్రెంచి స్నేహితుడింట్లో ఉన్నప్పుడుకూడా మాసం తిన్నాను. ఈలోపల ప్రోటీను రావడానికి మాంసాహారం తినడం అవసరం లేదని గుర్తించి నన్ను నేను బలవంతం చేసుకుని మాంసం అవీ తినడం మానేశాను. ఇప్పుడు మా కుటుంబం అంతా గుడ్లుతిన్నా నేను మాత్రం తినను. దేన్లోనైనా గుడ్డు వేశారని తెలుస్తే, ఆ పదార్ధాన్ని నేను తినను, అది కేకైనా సరే. ఎప్పుడైనా పొరబాటుగానో, తప్పుగానో గుడ్డు ఉన్నది ఏమైనా తింటే దానికి తప్పు చేశానని బాధపడను.
మాంసాహారులని నేను తప్పుపట్టను. "నువ్వు మాంసం ఎందుకు తినవూ, నీకు మాంసం తినేందుకు మతసంబంధమైన అభ్యంతరాలేవైనా వున్నయ్యా? కాయగూరలకుకూడ జీవం వుంటుందికదా, శాకాహారివైతే వాటినిమాత్రం చంపడంలేదా?" అని అడిగితే, నా సమాధానమేమంటే, "నాకు అనవసరంగా జీవాన్ని చంపడానికి ఇష్టంలేదు. మాంసాహరులకు వాళ్ళు ఏంచేస్తున్నరో బహుశా వాళ్ళకే గ్రహింపు ఉండదు. వాళ్ళు స్వయంగా జంతువుల్ని చంపక పోయినా, ప్రాక్సీగా కసాయివాళ్ళద్వారా చంపుతారు. కొన్నాళ్ళపాటు వాళ్ళు స్వయంగా ఒక జంతువుని తమ చేతుల్తో చంపి, దాని మాంసాన్ని కోసితీసి, వండి, పళ్ళెంలో పెట్టుకొని తిని ఆనందించగలుగుతే, వాళ్ళకి అప్పుడు గ్రహింపు ఉంటుంది తామేంచేస్తున్నరో. అలా చేసికూడ, ఇంకా మాంసం తినడం వాళ్ళకి రుచయితే వారు చేసే పని సమర్ధనీయమని నా వుద్దేశ్యం," అని. ఒక న్యూయార్కు నించి వచ్చిన జ్యూయిష్ అమ్మయి తన నార్వే స్నీహితుడు ఒక ఆయిస్టర్ని చేతిలో నలపగా వచ్చిన రక్తాన్ని చూచి మూర్చపోయిన విషయం నేను ఎప్పటికీ మర్చిపోలేను.
ఈసందర్భంలో నా అనుభవంలోని ఒక విషయం చెప్తాను.: 1968లో నేను వాల్తేరు శాంతి ఆశ్రమంలో ఉంటున్నరోజుల్లో జరిగిన సంఘటన ఇది: ఒక రాత్రి ఒంటేలు పోసుకోటానికని బాత్రూంలోకి వెళ్ళాను. అక్కడ తూములోనించి మందగొండిగా పాకుతూ ఒక పాము వచ్చింది. ఆ తలుపు పక్కనే నేను పడుకునే మంచం. దాన్ని కొంచెం కదిలించి బయటకు పంపుదామనుకుంటే అది మొరాయించి పడకగది తలుపుపై కెక్కింది. అక్కడినించి దాన్ని ఇనప కడ్డీతో కిందికి తోసి దెబ్బలు వేసి చంపేశాను. తరవాత దాని చుట్టు చీమలు గూడాయి. అప్పుడు ఆశ్రమం తోటమాలిని పిలిచి ఆ పాముని బయట పారేయించాను. నా మన్సుని కలవరపరిచిన ఆ దృశ్యం ఈనాటికీ నా మనసులొ బల్లెంలాగా గుచ్చుకుంటూనే ఉంటుంది. కర్మ, పుజర్జన్మల్లొ నాకు పెద్దగా ఏం నమ్మకం లేకపోయినా, నాకు వచ్చి నన్ను ఇంతదాక పీడిస్తున్న కాన్సరు అనర్ధం నేను ఆనాడుచేసిన అఘాయిత్యం ఫలితమేమోనని నాకు ఒక్కొక్కప్పుడు అనుమానం వేస్తుంది.
ఇక్కడ నేను ఇచ్చిన ఆర్గ్యుమెంటు పుష్టైన ఆహర విషయానికి సంబంధించిందీ కాదు, మతానికి సంబంధించీ కాదు; కేవలం మనుషుల స్పందనకి సంబంధించి. అది మీకు నచ్చకపోతే వదిలెయ్యండి.
***
1975 లో గోరాగారు చనిపోయారని నేను అప్పుడు హైదరాబాదులో ఉన్నప్పుడు రేడియోలో విన్నాను. నా నమ్మకాల్లో పూర్తిగా మార్పువచ్చినా, నాకు గోరాగారి కుటుంబంతో ఉన్న అనుబంధం మాత్రం ఈనాటికీ తెగలేదు. ఇండియాకి వెళ్ళినప్పుడు గోరాగారి కుటుంబాన్నీ -- సరస్వతిగార్ని (గోరాగారి భార్య -- ఆమెకు నేనంటే ఎంతో అభిమానంగా ఉండేది; ఆమె పోయిన సంవత్సరం చనిపోయారట), లవణంగార్నీ, విజయంగార్నీ, తక్కిన కుటుంబసభ్యుల్నీ, అందర్నీ -- చూస్తూంటాను.
2004 జనవరిలో లవణంగార్ని పటమటలో కలిసినప్పుడు ఆయన నన్ను గోరాగారి 'నాస్తికత్వం' పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చెయ్యమన్నారు, నాకూ గోరాగారికీ మధ్య ఉన్న సంబంధానికి జ్ఞాపకార్ధంగా. నేను చేసిన అనువాదాన్ని జనవరి 2007లో ఆయన Atheist Center ప్రచురణగా అచ్చువేశారు.
ప్రేమ, నిరాశ, జీవితం మీద నిరాసక్తి:
14 Comments:
నమస్కారం. మీ వంటి పెద్దలు బ్లాగు మొదలు పెట్టటం చాలా సంతోషం కలిగించింది. మంచి విషయాలతో క్రమం తప్పకుండా రాస్తుంటారని ఆశిస్తాను. బ్లాగ్లోకానికి స్వాగతం.
అయ్యా నిజమే మీ వంటి పెద్దలు బ్లాగు రాయడం చాలా సంతోషం. ఇంతకీ మీ 'నేనెవర'నే ప్రశ్నకి సమాధానం లభించిందో లేదో చెప్పలేదు. ఇప్పటికీ మిమ్మల్నా ప్రశ్న వెన్నాడుతుంటే ఒకసారి జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు పరిశీలించగలరు. అలాగే నా బ్లాగు http://abhinayani.blogspot.com భావాతీతధ్యానం గురించిన వ్యాసం వీలుంటే చదివి మీ అభిప్రాయం తెలుపగలరు. మీ క్యాన్సరు వ్యాధికి మీరు పాముని చంపడం ఏమాత్రం కారణం కాదనుకుంటా. ఎందుకంటే మూడునెలల పసికందు కాన్సర్ బారిన పడతాడు. వాడే పాపం చేశారంటారు. కృతజ్ఞతలతో. .
అయ్యా,మీకు మూడు దశాబ్దాల తర్వాత అదే యూనివర్శిటీలో అదే ఫిలాసఫి నేను 86-88 బ్యాచ్,చదివిన నేను మీకు తత్వశాస్త్రం గురించి ఏమి చెప్పగలను గానీ సంఘ రుణం విషయం లో మీ అనుమానాలు తీరాయా?
విజయకుమార్ గారికి:
నేనెవరిననే ప్రశ్నకి ఈరచన చివరి దాకా చెప్పకూడదనుకున్నాను, చదివేవాళ్ళ ఇంటరెస్టు పోకుండా ఉండడానికి. దానికి నేనిచ్చే సమాధానం ఇప్పుడే కావాలంటే మీరు నా ఇంగ్లీషు బ్లాగులో "Thought, the Natural State and the Body -- Deconstruction of Spirituality in UG Krishnamurti" అనే వ్యాసాన్ని చదవండి. (September Archives లొ ఉంది.) దాని విషయం పూర్తిగా విశదంచేశి చెప్తేనేగాని అది అర్ధం కాదని కూడా దాని సమయం వచ్చేవరకూ ఆగుతున్నాను.
విజయకుమార్ గారికి:
మీ 'అభినయని' బ్లాగ్ చుశాను. హెడింగులు సరిగానే కనబడుతున్నయ్యి గాని, తెక్స్టు మాత్రం సరిగ్గ కనబడడంలేదు. కంట్రోలు పానెల్ లో కంఫిగరేషన్ సరిగానే ఉంది. రేపు మరో కంప్యూటరులో చదవడానికి ప్రయత్నిస్తాను. ఆయినా దానిలో భావాతీత ధ్యానం గురించిన వ్యాసం కనబడలేదే?
జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు చాలా చదివాను. (ఒకసారి అయన్ని కలిసి ఒక అరగంట సేపు ఆయనతో మాత్లాడాను కూడా.)
రాజేంద్రకుమార్ గారూ:
సంఘం విషయంలో నాకు అనుమానల్లేవు. అది గోరాగార్ని సవాలు చెయ్యడానికి అప్పుడు వేసిన ప్రశ్న మాత్రమే.
నా ఉద్దేశ్యంలో సంఘసేవ గురించి అంతగా మాట్లాడేవారు మానవుడి స్వార్ధపరత్వం ఎంత విస్తృతమైందో గమనించరు. నీతులు అవతల పెడితే, మనం నిర్మొహమాటంగా పలుకుతే, సంఘానికే కాదు, ఇంకో పరాయివాడెవడికెవడికైనా మన స్వార్ధనికి వ్యతిరేకంగా సహాయం చెయ్యలనే బుద్ధి ఎవడికుంటుంది?
అయ్యా నమస్సులు. జిడ్డు కృష్ణమూర్తి గారి తో మాట్లాడిన పెద్దలు మీ జీవితం ధన్యం. మాకా అవకాశం లేకపోయింది. మీరు చెప్పిన ప్రయోజనం దృష్ట్యా మీ యిష్ట ప్రకారం బ్లాగుని కొనసాగించ గలరు. నా బ్లాగు చూశాననీ, మళ్ళీ చూస్తాననీ అన్నారు. కృతజ్ఞతలు.భావాతీతధ్యానం కూడా సెప్టెంబర్ నెలలోనే రాయబడింది. అలాగే మీ యింగ్లీషు బ్లాగు అడ్రస్ యివ్వగలరు. ఉంటాను.
నా ఇంగ్లీషు బ్లాగు అడ్రెసు (నా వెబ్ పేజీ అడ్రెసు కూడా) పైన కుడి కాలంలొ పేర్కొన్నాను. అయినా మీకోసమని మళ్ళా ఇక్కడ ఇస్తున్నాను:
www.moortysblogpage.blogspot.com
విజయకుమార్ గారూ:
మీ "అభినయనీ" బ్లాగ్ ని ఇవ్వాళ చూశాను. సెప్టెంబరు బ్లాగ్ అంశాలన్నీ చదవగలిగాను గానీ, మొదటిపేజి "నా దృక్పథం నుండి స్త్రీ మూర్తి --2" మాత్రం ఇంకా సరిగా కనబడడం లేదు. దానికి కారణం మీరు మరో ప్రోగ్రాం ఉపయోగించి తెలుగు రాయడం అయ్యుండొచ్చు. ఏదైతేనేం, నేను మీరు రాసిన "భావాతీత ధ్యానం" లోని చర్చనీ, "మహాపరాధి", "అమృత మూర్తి" అనే కధల్నీ చదివాను.
మీ కధలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ధ్యానంలో ఉన్న లోతుపాతుల్నీ, చిక్కుల్నీ, సమస్యల్నీ గమనించడం ముదావహం. ధ్యానం కూడా ఒక చర్యే అనీ, తక్కిన చర్యల్లో ఉన్న ఇబ్బందులే ధ్యానం లో కూడా ఉంటాయని మీరు గుర్తించారు. అంతే చాలు. అందుకనే నేను ప్రత్యేకంగా, ఒక సాధనలాగా ధ్యానం అంటూ ఎప్పుడూ చెయ్యను. అసలు సాధనలోనే ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి.
పాశ్చాత్య దర్శనాలుకూడా మీరు చదువుకున్నట్టుకనిపిస్తోంది. నా ఉద్దేశ్యంలో "లేదు అనేది లేదు" అని మీరు రాసిన వ్యాసం లోని యుక్తులు ప్రతిపక్షానికి నిలబడలేవు.
గోరా గారితో మీకున్న పరిచయం వలే నాకూ సన్నిహిత పరిచయంవున్నది. వారి కుటుంబం తోనూ ఇప్పటికీ దగ్గర సంబంధాలు వున్నాయి. మీ ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానం చెప్పలేకపోవటం విశేషం కాదు.ఇక్కడ ముఖ్య విషయము మీ ప్రశ్నకు సంబంధించినది. అందుకు సమాధానం ఉత్తరోత్తరా Philosophy of Science లో కొందరు చక్కగా చెప్పారు. అలా చెప్పిన వారిలో Carl Sagan, Betrand Russel,M.N.Roy, Paul Kurtz, Richard Dawkins వున్నారు. కాని వ్యక్తుల జవాబు కంటే శాస్త్రీయ పద్ధతిలో సాగుతున్న అన్వేషణ ఇందుకు సమాధానలు ఇస్తున్నాయి.సమాధానాలు దొరకనప్పుడు నమ్మకాలలోకి కూరుకు పోవటం వ్యక్తుల బలహీనత. ఇంకా జిజ్ఞాసతో తెలుసుకుందామని కృషి చేయటం మీ వంటి అనుభవగ్నులు చెయ్యవలసిన పని.
నమ్మకాలు ముందుకు సాగనివ్వవు.వైజ్ఞానిక దృక్పధం ఆలోచనను వికసింపచేస్తుంది.ఈ రంగం లో మీరు మార్గదర్శకులు కావాలని అభిలషిస్తున్నాను.
అయ్యా నారాయణ మూర్తి వారూ,
కృతజ్ఞతలు. వ్యక్తిగతమైన పనుల వల్ల తీరిగ్గా లేను. మళ్ళీ వివరంగా వ్యాఖ్య రాస్తాను. నమస్సులతో. . .
ఇన్నయ్యగారూ:
మీరు ప్రస్తావించేది నేను గోరాగార్ని అడిగిన ప్రశ్నల విషయంలోనే అనుకుంటాను. ఆ ప్రశ్నలు నాకు ఇప్పుడున్నవి కాదు; అప్పుడు గోరాగారి సిద్ధాంతాల్లో ఉన్న చిక్కుల్ని చూపడానికి వేసినవి.
I read today in newspasper that Lavanam expired.
Thanks for the news. I looked up in the Hindu today. It was not Lavanam, but his wife Hemalata who died yesterday. I sent Lavanam my condolences just a while ago.
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home