Monday, January 21, 2008

కొన్ని అనుభూతులు:

ఈ రచనలు ఎందూ చేస్తున్నాను అనే ప్రశ్న నాకు అప్పుడప్పుడు కలుగుతూనే ఉంటుంది. యూజీ అన్నమాటలు గుర్తుకొస్తూనే ఉంటాయి: "నువ్వు రాస్తూన్నదానివల్ల ఇతరులకు ఏదో ప్రయోజనం కలుగుతుందని భ్రమించకు." ఈ రాతల్లో కొంత అహం ఉండే ఉండాలి -- కొంత ఆత్మ శ్లాఘనంతో కలిసి. మరో భ్రమేమిటంటే, నేను రాసేదేమీ ఇతరులకు మార్గదర్శకం కాకపోయినా, కనీసం వినోదంగాగానీ, ఔత్సుక్యాన్ని తృప్తి పరచుకోవడానికిగాని ఉపయోగపడుతుందని. కాకపోతే దీనివల్ల పనిలేక రెటైరై ఊరికే కూర్చున్నవాడికి నాకు ఏదో వ్యాపకం కలుగుతుంది. ఏది ఎమైతేనేం, రాస్తూనే ఉంటాను.

* * *
ఇక్కడ నాజీవితంలో జ్ఞాపకాలుగా మిగిలిపోయిన కొద్ది అనుభూతుల్ని పేర్కొంటాను. వాటి కారణంగా వొచ్చిన చిక్కుల్నీ, ఆ చిక్కుల్ని ఏవిధంగా విడతీసుకున్నానో కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను.

మొట్టమొదటిసారిగా నా విషయంలో నాకు కలిగిన అనుభవమిది: సుమారు 12, 13 సంవత్సరాల వయసుంటుంది. విజయవాడలో గాంధీనగరం సత్యనారాయణపురం రోడ్డుమీద నడిచి వెళ్తున్నాను. కొంచం మగతగా నిద్ర వస్తూన్నట్టుగా అనిపించింది. అయితే ఆనిద్ర ఏదో నన్ను అవరించుకుంటూ వచ్చే అల లాగా అనిపించింది. అప్పుడు నిజంగా నిద్ర రావడానికి ముందు స్థితి ఇలాంటిదీ అని నాకు అర్ధమయ్యింది. అప్పటినించీ ఈనాటివరకూ కొనసాగే నా అంతర్వీక్షణానికి (introspection)అదే మొదలు. అంతకు పూర్వం కొద్దిగా అప్పుడప్పుడు ఆత్మ సవెదన (self-consciousness) ఉండేది -- ఉదాహరణకు ఎవరైనా నన్ను పొగిడినప్పుడైనా, నేను ఏ విషయంలోనైనా నిరాశ పొందినప్పుడైనా.


ఒకసారి 1956-57 ప్రాంతాల్లో మద్రాసులో మౌంట్ రోడ్డు మీదనో మరోచోటనో నడుస్తున్నాను: హఠాత్తుగా మనసులోనించి తెర తెరుచుకున్నట్టయింది. నా ముందున్న ప్రపంచాన్ని జీవితంలో మొదటిసారిగా యథతథంగా చూస్తున్నాని అనిపించింది. మామూలుగా మనం ప్రపంచాన్ని గత స్మృతుల ప్రభావం ద్వారానూ, అలోచనలూ, ఉద్రేకాల అభ్యంతరాల ద్వారానూ చూస్తాం. వీటినే నేను తెర అనేది. ఆ ఒక్క క్షణంసేపూ ఆ తెర లేకుండా ప్రపంచాన్ని చూడ్డం చాలా విచిత్రంగా అనిపించింది. అయితే అది ఎంతో సేపు మిగల లేదు.

1962-64 సంవత్సరాల మధ్యలో బర్కిలీ కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రాంగణంలో యూకలిప్టస్ తోపు ప్రక్క ఉన్న రోడ్డుమీద పెద్ద వృక్షం కింద నడుస్తూన్నప్పుడు, మరొకసారి ఇలాంటిదే జరిగింది. ఆ వృక్షమూ, రోడ్డూ పరిసరాలూ మరింత స్పష్టంగా కనిపించిడమేకాక ఆ క్షణానికి నా మనసులో బరువంతా ఒక్కసారి తీసేసినట్టయి మనసంతా ఎంతో తేలికయింది.

1965 లో కాబోలు, నా జీవితంలో జరిగిన సంక్షోభం గురించి పైన రాశాను. దాన్నించి విముక్తి అయిన మర్నాడే ఎందుకనో బర్కిలీనించి సాంఫ్రాన్సిస్కోకు బస్సుమీద వెళ్తున్నాను. మనసు ఇంకా తేలిగ్గా ఉల్లాసంగా ఉంది. అప్పుడు నా మనస్సులో ఇలాంటి దృశ్యం అవుపించింది: నేను ఏదో ఓడలో పొతున్నట్టూ (అంతకుముందు నేనెప్పుడూ ఓడమిద ప్రయాణం చెయ్యలేదు -- దానికి మూలం నా గతంలో మరేడో అయుండాలి), దాని గోడపైనున్న గుండ్రపు అద్దంకుండా బయట ప్రపంచాన్ని మొదటిసారిగా చూసినట్టూ. అనంతంగా కనబడే అ విశాలతనూ, అంత తెరిపినీ భయంతో నేను భరించలేకపోయి ఆకిటికీని తటాలున మూసేశాను, "అమ్మబాబోయ్, అంత విశాలత్వంలోకి వెళ్ళేందుకు నా కంత ధైర్యం ఇంకా లేదు," అనుకుంటూ. సర్వాన్ని పరిత్యజించి పూర్తి బయలులోకి వెళ్ళేందుకు నేను ఇంకా సిద్ధంగా లేననిపించింది.

తరవాత అప్పుడప్పుడు బర్కిలీలోనూ, ఇక్కడ మాంటెరేలోనూ ఉంటున్నప్పుడు కూడా చిటుక్కున ఏదో ఆనందమయ స్థితిలో పడిపోతూ, నా శరీరం కూడా దానితో అతి తెలేలిక అయిపోయి ఉత్తేజంతో నిండిపొయేది.

ఇలాంటి అనుభవాలకు మనసు విలువగట్టి, వాటికోసం, వాటిని పునస్సృష్టించుకోవాలని ప్రాకులాడదం సహజమే. కాకపోతే, జే. కృష్ణమూర్తిగారు చెప్పినట్టుగా, వాటికోసం మనం ఎంత ప్రాకులాడుతామో అవి అంతగా దూరమైపోతాయి. మనసులోని తెరలు ఎందుకు తొలుగుతాయో మనకి తెలియదు; ఆ క్షణంలో ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే అది జరుగుతుంది. ఆ అనుభవాల్ని తిప్పి రప్పించుకోవాలనే ప్రయత్నం, దానికి మనమిచ్చే విలువా అన్ని గతానుభవ సంభూతమైనవే. ఆ గతం పనిచేస్తూన్నంత కాలమూ అవి మనకి అందకుండానే ఉంటాయి.

యూజీతో పరిచయమైన తరవాత నేను నేర్చుకున్న మొట్టమొదటి పాఠమిది: ఇలాంటి అనుభవాలూ, అనుభూతులూ అన్నీ మనో స్థితులు. అలోచనలూ, మనోభావాలూ, ఉద్రేకాల్లాగానే ఇవికూడా తాత్కాలికాలు. వాటికోసం పాకులాడుతూండడమే మనం అహాన్ని కొనసాగించుకునే ఒక మార్గం. వాటికి మనం ఇచ్చే విలువలతోనే మన అహం నిర్మాణం జరుగుతుంది. అనుభవాలకు విలువలేదు; అవి వస్తూనూ పోతూనూ ఉంటాయి. మానసిక స్థితులకన్నిటికీ అదే స్వభావం.

అందుకనే నేను తమ ఆధ్యాత్మికానుభవాల్ని గురించి నాతో చెప్పుకునే వారిని ఈ ప్రశ్న అడుగుతాను: ఆ అనుభవం తీరిపోయింతరవాత మీ గతి ఎమవుతుంది? మీరు మళ్ళా మాములు మనుషుల్లోపడి, మామూలు జీవితంలో, మామూలు ప్రపంచంలో ఉన్న కష్టనష్టాల్ని భరించాల్సిందే కదా? వాటిని తీర్చలేని ఈ అనుభవాలన్నీ తుచ్ఛమైనవి. నిజమైన విముక్తి అనేది ఉంటే అది ఈ దైనందిన జీవితంలో రావాలి; ఏదో ప్రత్యేక క్షణాల్లో కాదు.

అందుకే నా ఉద్దేశ్యంలో విముక్తి అనేది ఒక అనుభవం, అనుభూతి కానేరదు. జీవితాన్ని సంపూర్ణమైన పరిణామం వస్తేనే గాని అలాంటిదేదీ జరగదు.

Monday, January 14, 2008

3. జిడ్డు కృష్ణమూర్తి:


1953-56 సంవత్సరాల్లో ఆంధ్రా యూనివర్సిటీలో ఫిలాసఫీ ఆనర్సు చదువుకునే సమయంలో ఒకనాడు లైబ్రరీలో ఫిలాసఫీ సెక్షనులో పుస్తాకాల్ని తిరగేసి చూస్తూంటే J. Krishnamurti -- Talks" అనే రెండు మూడు పుస్తకాలు కనిపించాయి, Star Publishing House, Omen, Holland" లేదా మరో ప్రచురణో నాకు స్పష్టంగా గుర్తులేదు. ఇదేదో తెలుగుపేరులాగానో, ఇండియన్ పేరులాగానో ఉందే అనే అశ్చర్యంతో పుస్తకం తెరిచి చదవడం మొదలెడితే నాకు ఏమీ అర్ధం కాలేదు. కాబట్టి దానివిషయం ఆనర్సు అయిందాకా మళ్ళా పట్టించుకోలేదు.

1956-57 లో మద్రాసులో ఫిలాసఫీ M. Litt చెయ్యడానికి ప్రయత్నం. ఆరోజుల్లోనే చలంగారితో మొదటి పరిచయం. 57-58 ప్రాంతాల్లో ఉద్యోగ ప్రయత్నరీత్యా హైదరాబాదులో లవణంగారితోనూ మరికొందరు బ్రహ్మచారుల్తోనూ సుల్తాను బజారులో ఖాదీ భాండార్ పైన మేడమీద గదిలో ఉన్నాను; తరవాత ఆయన మేనత్తగారి ఇంట్లోకూడా మేమిద్దరం కొన్నాళ్ళు ఉన్నాం. నాకు అప్పుడే ఆంధ్రా ఎక్కౌంటెంట్ జనరల్ ఆఫీసులో అప్పర్ డివిజన్ గుమాస్తా పని దొరికింది. దానికని ఆవూళ్ళోనే ఏడు నెల్లు ట్రైనింగు అయింతరవాత నన్ను దాన్లో మద్రాసు ఆఫీసుకి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడనాకు ఆ ఉద్యోగం దుర్భరం అయింది. ఒక శనివారం నాడు ఆఫీసులో పెండింగులో ఉన్న గవర్నమెంటు ఎకౌంటు బిల్లులన్ని ఆడిట్ చెయ్యడం మొదలెట్టాను. శలవరోజుల్లో పనిచెయ్యడం నాకు నచ్చలేదు. పైగా ఆ బిల్లులన్నిటినీ దేనిమీద ఎందుకు సంతకం పెడుతున్నానో తెలియకుండా సంతకం పెట్టడం మరీ నచ్చడంలేదు. అదే సమయంలో ఆంధ్రా యూనివర్సిటీలో మా గురువుగారు, సచ్చిదానందమూర్తిగారు నన్ను గుంటూరు ఏ.సీ. కాలిజీలో లాజిక్ లెక్చరరు ఉద్యోగానికి నన్నుఒక్కణ్ణే రెకమెండు చేశారని కబురొచ్చింది. దాన్ని నెపంగా చేసుకొని నేను మద్రాసు వదిలి గుంటూరు వెళ్ళాను. నేను ఫిలాసఫి ఆనర్సులో లాజిక్ చదువుకున్నా, ఇంటర్మీడియట్లో లాజిక్ చదువుకోలేదని వాళ్ళు నాకు ఆవుద్యోగం ఇవ్వలేదు. మళ్ళీ మద్రాసుకు తిరిగి వెళ్ళడానికి ఇష్టంలేక, విజయవాడ మా నాన్న ఇంటికి వెళ్ళి
మద్రాసులో నా ఉద్యోగానికి ఒక నెల రోజులు అబద్ధపు లీవుకు అప్లై చేశాను. సమస్యల్నించి పారిపోకూడదని ఆ నెలరోజులూ అవగానే మద్రాసులో ఆఫీసుకు తిరిగివెళ్ళి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను
, రెండు వారాల నోటీసు ఇస్తూ. ఆ రెండువారలు మాత్రమే ఆ ఉద్యోగంలో ఉన్నాను.

ఆ సమయంలో నేను ఆలిండియా రేడియోలో ఎనౌన్సరు, న్యూస్ రీడరు ఉద్యోగాలకి అప్లైచేస్తూ, సిఫార్సుకని సచ్చిదానందమూర్తిగారికి ఉత్తరం రాస్తూ మాట సందర్భంలో నేను ఏజిస్ ఆఫీసులో ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాని రాశాను. స్నేహితులూ, తోటి ఉద్యోగులూ బతిమిలాడారు నన్ను ఉద్యోగం వదిలెయ్యవద్దనీ, అది వేలాదివేలు కలలుగనే అరుదైన ఉద్యోగమనీ. నా పై అధికారికూడా నాకు నచ్చచెప్ప ప్రయత్నించాడు, తన సొంత తమ్ముణ్ణయినా అంతగా బ్రతిమాలనని చెబుతూ. సచ్చిదానందమూర్తిగారు కూడా ఉద్యోగాన్ని వదలొద్దని చెప్పి రాశారు. మద్రాసులో వీధుల్లో అడుక్కుతినైనా బతుకుతానుగానీ ఆ ఉద్యోగం సుతరామూ చెయ్యనని సమధానం రాశాను ఆయనకి. "అడుక్కు తినకు, ఇక్కడికిరా," అని విశాఖపట్నానికి రమ్మంటూ ఆయన అదేశిస్తూ తిరుగు టపాలో ఉత్తరం రాశారు.

ఆరోజుల్లోనే పేపర్లో అడయారులో, వసంతవిహార్ అనేచోట జిడ్డు కృష్ణమూర్తిగారు ఉపన్యాసాలిస్తున్నరని పేపర్లో చదివాను. అక్కడికి ఒక సాయంత్రం వెళ్ళి ఆయన ఉపన్యాసాన్ని విన్నాను. ఆ వసంత విహార్లో ఒక ఉద్యానవనమూ రెండు మూడు బిల్డింగులూ ఉన్నట్టూ, పరిసరాలన్నీ చాలా అందంగా ఉన్నట్టూ, భవనం లేత పసుపుపచ్చ రంగు సున్నం వేసిఉన్నట్టూ గూర్తూ. మీటింగులో చాలామంది నేలమీద కూర్చున్నారు. కూర్చోలేనివారికి చుట్టూతా కుర్చీలేర్పరిచారు; "కుర్చీలకు చందా" అని ఒక పెట్టె పెట్టి ఉన్నట్టు గుర్తు. ఒక పక్కన ఆయన పుస్తకాల్ని అమ్మేందుకు ఒక టేబులు పెట్టారు. కృష్ణమూర్తిగారు వచ్చి వేదికమీద కూర్చున్నప్పుడు ఎవరూ చప్పట్లు కొట్టలేదు. వాతావరణం నిశ్శబ్దంగాను, ఎంతో స్వచ్ఛంగానూ ఉంది. సూర్యాస్తమయం సమయంలో కిరణాలు ఆ పెద్ద చెట్టుద్వారా ఆయన మీద పడుతున్నాయి. రాంగానే ఆయన స్పష్టంగా ఉచ్చరిస్తూ ఎత్తైన కంఠంతో నెమ్మదిగా మట్లాడ సాగారు.

అయన చెప్పింది నాకేమి పూర్తిగా అర్ధంకాలేదు. అద్వైత వేదాంతమూ, బౌద్ధమూ కలగరించి పోసి ఏదో చెపుతున్నారనిపించింది.

ఆయనతో మాట్లాడాలనిపించినా ధైర్యంలేక మాట్లాడలేదు. అప్పుడు ఒకటి రెండు సార్లు ఆయన సంభాషణల మీటింగులకి కూడా వెళ్ళాను. ఒక మీటింగులో ఆయన సంభాషణ మధ్యలో "మీకు ఒక కధ చెప్తాను," అన్నారు. దాంతో సభ్యులంతా ఆయనకి ఇంకా దగ్గరిగా చేరి, చెవులొంచి మరింత సావధానంగా వినడానికి సిద్ధమయ్యరు. అప్పుడు ఆయన, "అయ్యయ్యో, ఈ సావధానతంతా ఇంతకుముందేమైందీ?" అని అడిగారు, అందరికి బుద్ధి చెపుతున్నట్టు. ఆ మీటింగు అయింతరవాత నేను ఇంకా అలా చూస్తో ఒక ద్వారం దగ్గర నిలబడ్డాను. కృష్ణమూర్తి గారు హాలుకు అవతలవైపు మరో ద్వారంవద్ద నన్ను చూస్తూ నిలబడి పోయారు. ఇలా మేమిద్దరం మాటాపలుకూ లేకుండా ఒకరినొకరం దీర్ఘంగా చూసుకుంటూ సుమారు ఐదు నిమిషాల పాటు గడిపి ఎవరి తోవన వాళ్ళం పోయాం. ఆయన నాదగ్గరికి రాలేదూ, నేను ఆయన సమీపానికి వెళ్ళలేదూ. ఎందుకో నాకే తెలియదు. ఆ దృశ్యం నేనిప్పటికీ మరవలేను.

ఒకరోజు ఆఫీసుకు వెళ్ళే బస్సుకోసం ఎదురుచూస్తోనో మరోసమయంలోనో త్యాగరాజనగర్లో పాండీ బజారులో బస్సుస్టాపు దగ్గరేఉన్న ఒక పుస్తకాల షాపులోకి వెళ్ళాను. అక్కడ First and Last Freedom అనే జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకం Victor Gollancz లండనులో ప్రచురించిన పుస్తకం నా కళ్ళబడ్డది. దాన్లో విషయసూచిక చూస్తోంటే Boredom అనే అంశం మీద ఒక అధ్యాయం కనిపించింది. అది అప్పటి నాజీవితంలో అతి ముఖ్యమైన సమస్య గనక ఆశ్చర్యంతో ఆ పేజీల్ని తెరిచి చదవడం మొదలెట్టాను. దాన్లో "జీవితం విసుగుపుట్టడం" అనే మనస్థితిలోనే మీరెందుకు ఉండకూడదు అనే ప్రశ్న నన్ను షాక్ చేసి నామనసుని తలక్రిందులు చేసింది. అంతవరకూ నా విసుగు సమస్యకు అలాంటి సమాధానం సాధ్యమని నా ఊహకు తట్టలేదు. అవ్వాళే పదమూడు రూపాయలు పెట్టి ఆ పుస్తకాన్ని కొని ఇంటికి తీసుకొచ్చి మర్నాడు ఆదివారం నాడు పొద్దుణ్ణించి రాత్రిదాక దాన్ని చాలావరకూ చదివేశాను. దాన్లోని సంగతులేమిటో మొదటిసారిగా కొంచం చూచాయగా మనసులో ఎక్కడో తట్టినట్టుందిగాని, ఏమర్ధమయిందో మాత్రం నాకు తెలియలేదు.

నేను రాజీనామాకని ఇచ్చిన రెండు వారల గడువూ తిరిపోగానే బయల్దేరి విశాఖపట్నానికి వెళ్ళాను. అక్కడ సచ్చిదానందమూర్తిగారు నాకు తెలుగు విజ్ఞానసర్వస్వం, దర్శనములు-మతముల సంపుటి తయరుచేసే ఆఫీసులో అస్సిస్టెంట్ కంపైలరుగా ఉద్యోగం ఇప్పించారు. దాంతో నా జాతకం మరో మలుపు తిరిగింది. నేను దొంగ సెలవుపెట్టి విజయవాడలో ఉన్నప్పుడు మాటవరసకి మానాన్నతో అన్నాను, "గ్రహాలు నాతో ఫుట్ బాలు ఆడుకుంటున్నాయి," అని. ("నీకు నమ్మకంలేదుగానీ, నిజంగా నీజాతకంలో అలాంటిదే ప్రస్తుతం జరుగుతోంది," అని ఆయన సమాధానం చెప్పాడు. అయితే దాని వివరాలేవీ నాకు చెప్పలేదు.) అప్పట్నించీ నిజంగానే నా అదృష్టం మారింది. ఆరోజున నేను సాహసించి ఆ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వకుంటే, ఈ రోజున నేను ఈదేశంలో ఉండేవాణ్ణి కాదు.

ఒక సంవత్సరం కాలం నేను ఆ అఫీసులో పనిచేశాను, జే. కృష్ణమూర్తిగారి బోధల్ని ఆకళింపు చేసుకుంటూ. ఆ సంవత్సరం నా జీవితంలోనే అత్యంత ఆనందకరమైనది. పనిచేసే పరిసరాలు బహు సుందరమైనవి: పంచకోణాకరంలో ఎత్తుమీద ఉన్న ఆ చిన్న బిల్డింగు చుట్టూ మూడువైపులా సముద్ర దర్శనం; ఆఫీసులో స్వచ్ఛమైన గాలీ, వెలుతురూ.

నా పై అధికారి మెడేపల్లి నరసింహస్వామిగారనే ఆయన -- అతి ఉదారమైన, సంస్కృతిపరులైన పండితులు విజయనగరం కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరరుగా పనిచేసి రిటైరై, ఈ ఆఫీసులో సంగ్రాహకులుగా ఉండేవారు. ఆయన నన్ను ఎంతో ఆప్యాతతో చూచేవారు. నేను ఏం రాసినా దాన్లో తప్పులెన్నకుండా దాన్ని మెరుగు చేసేవారు. ఒక్కనాడైనా నువ్వు ఫలానాది చెయ్యాలీ, ఫలానాది చెయ్యకూడదూ అని ఒక్కసారైనా అనలేదు. ఆయనికి అధికారభావం పిసరంతైనా లేదు. ఆఫీసులో మధ్యాన్నం నాలుగు గంటలదాకా ఉండితీరాలన్న నియమం కూడా ఆయన ఎప్పుడూ పాటించలేదు. అప్పుడప్పుడు పని ఇంటికి తీసికెళ్ళి చేసినా, లైబ్రరీలో కూర్చొని చేసినా ఆయనకు సమ్మతమే. ఆ ఆఫీసులో నేను ఎంతో స్వేచ్ఛను అనుభవించాను.

తోటి ఉపసంగ్రాహకులు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు గారు. మేం ముగ్గురమూ రచనలూ, అనువాదాలూ చెయ్యడమే కాకుండా, ఎన్నో వేదాంత, తత్త్వశాస్త్ర విషయల్ని రోజూ చర్చిస్తూ ఉండేవాళ్ళం. రామమూర్తి గారనే తెలుగు టైపిస్ట్ ఉండేవారు. పొద్దున్నే ఆఫీసు తెరవకముందే ఒక గంటసేపు ప్యూనుగా పనిచేసే ఒక కుర్రాడికి స్కూలు ఫైనలు చదవడానికి ట్యూషను చెపేవాణ్ణి. వాల్తేరులో ఒక హోటల్లో భోజనం. కొన్ని సంవత్సరాల తరవాత నేను ఈదేశానికి రావడానికి కారకులైన స్వర్గీయ కుమారస్వామి రాజాగారు మా ఇంట్లోనే నా పక్కగదిలోనే ఉండేవారు. ఆయన నాకు మంచి స్నేహితులూయ్యారు. సుఖజీవితానికి ఇంతకన్నా ఏంకావాలి? కాకపోతే ఆ ప్రియురాలి సమస్యా, నా విసుగు సమస్యా ఇంకా పూర్తిగా పోలేదు.

తరవాత ఒక సంవత్సరం తిరగ్గానే, ఒకరోజు సచ్చిదానందమూర్తిగారు తన ఆఫీసుకు పిలిచి యూనివర్సిటీలో లెక్చరరు ఉద్యోగం చేస్తావా అని అడిగారు. సరే, నాకు అది నచ్చుతుందని అన్నాను. దానికి ఆయన, నీకు నచ్చుతేచాలదు, మాకు నచ్చాలని నవ్వుతూ అన్నారు.

ఆ లెక్చరరుగా ఉన్నమూడేళ్ళల్లోనే మూర్తిగారి ప్రోత్సాహంతో డాక్టరేటు డిగ్రీకి రిజిస్టరు చేయించుకున్నాను -- అయితే ఆయాన సలహాకు భిన్నంగా నేను జే.కృష్ణమూర్తి చింతన మీద థీసిస్ రాయాలని ప్రతిపాదన చేశాను. ఆరోజుల్లో మూర్తిగారి ఉద్దేశ్యంలో జే. కృష్ణమూర్తి అంటే ఎకడెమిక్ రంగంలో ఎవరూ గుర్తించరు. అయినా నేను ఆయనమీదనే రాస్తానని పట్టుబట్టాను.

ఆపాటికి నాకు అనువాదాలు చెయ్యడంలో కొంత అనుభవం వచ్చింది కనుక, జే. కృష్ణమూర్తి గారి On Learning అనే చిన్న పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమాచేసి Krishnamurti Writings, Inc. కి కాబోలు పంపాను అచ్చువేసుకుంటారేమో చూద్దామని. దానికి ఎన్నాళ్ళయినా వాళ్ళదగ్గర్నించి సమాధానం రాలేదు.

మళ్ళా కృష్ణమూర్తిగారితో వారు మదనపల్లిలో ఉన్న సమయంలో వారితో మాట్లాడేందుకు వీలుంటుందా అని అడుగుతూ మదనపల్లిలో కృష్ణమూర్తిగారి సెక్రటరి మాధవాచారిగారికి ఒక ఉత్తరం రాశాను. దానికి ఫలానారోజున ప్రొద్దున 10:30 కి వచ్చి కలవవచ్చునని రాస్తూ ఆయన సమాధానం రాశారు. అదేసమయంలో మా యూనివర్సిటీలో జర్మన్ ఎక్స్చేంజ్ విద్యార్ధి హాన్స్ షుల్ట్జ్ అనే యువకుడు ఉండేవాడు. నేను దక్షిణాది ప్రయాణానికి వెళ్తున్నాని తెలిసి తనూ నాతో వస్తానన్నాడు. మేమిద్దరం నిర్ణీత సమయానికి రిషీవాలీకి మదనపల్లినించి బస్సుమీద ప్రయాణంచేసి చేరుకున్నాం. రోడ్డునించి చెట్లూ, రాళ్ళకుప్పలూ ఉన్న దోవ మీద కొంతసేపు నడిచి స్కూలు ఆఫీసులో అడిగి కృష్ణమూర్తిగారున్న మేడదగ్గరికి వెళ్ళాము. మద్రాసులోని వసంత విహార్ లాగానే ఈ మేడ కూడా లేత పసుపుపచ్చ రంగులో ఉన్నట్టూ దానికి పక్కనున్న ఆఫీసు ఉన్న ఇల్లు తెల్లగా ఉన్నట్టూ నాకు గుర్తు. అ మేడక్రింద వరండాలో మాధవాచారి గారూ, స్పెయిను దేశపు ఫిలాసఫీ ప్రొఫెసరు ఒకాయనా ఉన్నారు. అప్పటికే మేము సమయానికి రామేమోనని మరొకాయన్ని కృష్ణమూర్తిగారితో ఇంటర్వ్యూకని మాధవాచారిగారు పంపించారు. ఆందుకని మాతరుణంకోసం వేచివుంటూ మేము అక్కడే మరో అరగంట ఆ ఫిలసఫీ ప్రొఫెసరుతో మాట్లాడుతూ గడిపాము. నాకు అక్కడి రిషీ వాలీ స్కూలులో పనిచెయాలనే అభిలాష అయనకు వ్యక్తపరిచాను. ఆయన భారతీయ తత్త్వశాస్త్రమంతా "సర్వం ఒకటే, ఒకటే సర్వం," అని "కట్టే కొట్టే, తెచ్చే" అన్నట్టు క్లుప్తంగా చెప్పాడు. దానికి నేనేమని సమాధానం చెప్పాలో తోచలేదు. భారతీయ తత్త్వశాస్త్రాన్ని అంత సరళంగా సూక్ష్మీకరంచడం దాని స్వరూపాన్ని వికృతం చేసినట్టే అవుతుందని నా ఉద్దేశ్యం. ఆయన తరవాత సచ్చిదానందమూర్తిగారిని కలిసినప్పుడు ఈ విషయన్ని ఆయనతో చెప్పాడట. నేను నా మదనపల్లి ప్రయాణంగురించి మూర్తిగారితో చెబుతూండగా ఆయన నన్ను నిలదీసి దెప్పుతో అడిగారు, "మదనపల్లి స్కూల్లో పనిచేస్తావటగా?" అని. నేను అన్నాను, నాకూ నా స్నేహితుడు రాజాకీ దాని విషయంలో కొంత ఔత్సుక్యం ఉంది, అందుకని ఊరికే వాకబు చేశానని తప్పించుకున్నాను.

మాధవాచారిగార్ని అడిగాను నేను పంపిన అనువాదంగురించి ఆయనకేమైన తెలుసా అని. దాన్ని తను చూశాననీ, ఆ అనువాదం తగినంత స్పష్టంగానూ సరళంగానూ లేక దాన్ని ప్రచురించడం ఉచితం కాదనుకొని తాము సమాధానం రాయలేదనీ అన్నారు.

ఆ అరగంటయింతరవాత మావంతువచ్చింది కృష్ణమూర్తిగారితో మాట్లాడటానికి. ఆయనే స్వయంగా మమ్మల్ని తీసుకెళ్ళడానికి మేడమెట్లు దిగి క్రిందకు వచ్చారు. హాన్సుకు ఈ విషయాల్లో పెద్ద ఆసక్తి లేకపోయినా తనూ వస్తానంటే నాతో పైకి తీసుకు వెళ్ళాను. అతను కృష్ణమూర్తిగారితో ఒక్క మాటైనా పలకలేదు. మేడపైన వరండాలోకీ, తరవాత లోపల పెద్ద హల్లోకి వెళ్ళం. ఫర్నిచరూ అదీ ఎమీ లేకుండా చాలా ఆగది శుభ్రంగానూ నిరాడంబరంగానూ ఉంది. తూర్పువైపు గోడపైన ఎంతో అందమైన చిత్రం ఒకటి వేలాడవేసి ఉంది. అది చాలా విలువైన యూరొపియన్ స్టైలులో వేసిన బొమ్మ అని నా అభిప్రాయం. అదో ప్రకృతి దృశ్యాన్ని చిత్రించిన చిత్రం అని నా జ్ఞాపకం. నేలమీద తివాచీ ఒకటి వేసి ఉంది. దాని మీద మేం ముగ్గురం కూర్చున్నాం.

పైకి కృష్ణమూర్తి గారు మమ్మల్ని తీసుకు వెళ్తున్నప్పుడు ఆయన వైఖరినీ, తెల్లని దుస్తుల్నీ, ముఖకవళికల్నీ చూస్తూంటే నేనొక అపర ఏసు క్రీస్తును చూస్తున్నాననే విచిత్రమైన భావం కలిగింది నా మనసులో. పైగా మరో విచిత్రమేమిటంటే, నేను నమస్కారం చేస్తే ఆయన ప్రతినమస్కారం చెయ్యడం, ఒకవేళ ఆయనే నాకు నమస్కారం చేస్తున్నరనే భావంతో, నేను మళ్ళీ నమస్కారం చెయ్యడమూ, దానికి ఆయన మళ్ళీ ప్రతి నమస్కారం చెయ్యడమూ, ఈవిధంగా అయిదు ఆరుసార్లు నమస్కార సంవాదం జరిగింది.

కృష్ణమూర్తిగారితొటి సుమారు అరగంటసేపు సంవాదమూ అరనిమిషంలా గడిచిపోయింది. ఆయనతో ఎన్నో విషయాలు మాట్లాను. సౌరీసుతో నా అనుభవమూ, రమణ మహర్షిని గురించీ, నాకు జీవితంపై పట్టిన విసుగును గురించీ, నమ్మకాల అనవశ్యతగురించీ, ఇలా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. నా విసుగువిషయంగురించి మాటాడుతూ ఆయన మంటని తాకిన చేతులు మళ్ళా దేన్నైనా అంటడానికి సంకోచిస్తాయని అన్నారు. ఆయన బోధని నేను ఎంత కాలం ప్రయత్నించినా నాకు అర్ధం కాకపోవడానికి కారణం నేను ఇంకా తగినంత పనిచెయ్యకపోవడమేనా అని అడిగితే, ఆయన అవునన్నట్లు తలూపారు. ఒక్కొక్క క్షణంలో ఆయన నన్ను భుజంపట్టుకు ఊపుతూ, నా కళ్ళల్లోకి దీర్ఘంగా, తీక్ష్ణంగా చూస్తూ మాట్లాడారు. సంభాషణ ఎంతో సన్నిహితంగా జరిగింది. అయితే ఆయన ఒకసారి ఎందుకనో "మీరు చాలా తెలివైనవారండీ," (You are very clever, Sir!") అని అన్నారు. అది నన్ను అభినందించడానికి కాక ఎక్కసంగా అన్నమాటని అనిపించినా, నేను దానికి ఎదురు సమాధానం చెప్పకుండా నవ్వేసి ఊరుకున్నాను. ఇప్పటికీనాకు అర్ధం కాదు నాకు ఆయన ఆ మాట ఎందుకు అన్నారో.

దాదాపు అరగంట అయింతరవాత నేను లేచి సెలవు తీసుకుంటూ, నేనూ నా స్నేహితుడూ (రాజా) అక్కడి వారి స్కూలులో పనిచేద్దామనుకుంటున్నామన్నాను. దానికి ఆయన బయటికి వెళ్తూన్నప్పుడు ఆఫీసులో సుందరంగారనే ప్రిన్సిపాలుగారితో మాట్లాడమన్నారు. మమ్మల్ని సాగనంపడానికి ఆయన మాతో వసారాలోకి వచ్చారు. మాధవాచారిగారితో ఒక్కమాట చెబుతారా అని అడగబోతూ వాక్యం పూర్తి చెయ్యకుండానే, నేనే చెబుతాను లెండి అన్నారు. కాదు, కాదు, మీరు చెప్పండి ఏం చెప్పమంటారో అని ఒత్తి అడిగాను. ఆయనతో మీతోటి ఇంటర్వ్యూ అయిపోయిందని చెప్పండన్నారు. సరేనని ఆ విషయం మాధవాచారిగారితో చెప్పాను.

అప్పుడే రాజగోపాల్ గారనుకుంటాను మమ్మల్నిద్దరినీ ఆ స్కూలు చూపించడానికీ అక్కడ భోజనాల హాల్లో మాకు భోజనం పెట్టించడానికీ తనతో తీసుకెళ్ళారు. దోవలో స్కూలు డార్మిటరీ ఒకటి చూపించారు. దాన్లో సుమారు 18 మంది పిల్లలుండే సౌకర్యాలున్నాయి. ప్రతీ డార్మ్ కీ ఒక టీచరుగానీ, టీచరు దంపతులుగానీ పర్యవేక్షకులుగా అక్కడే నివాసం ఉంటారు. పడకల హాలు చాలా శుభ్రంగా ఉంది, పక్కలన్నీ నీటుగా వేసి ఉన్నాయి. అక్కడకూడా గోడమీద ఒక చిన్న పెయింటింగో ఫోటోవో చాలా అందమైన ప్రకృతి దృశ్యంగలది వేలాడవేసి ఉంది. ఆ భొజనాలశాలకి వెళ్ళే తోవలో చక్కతో చేసిన ఒక పెద్ద బుద్ధ విగ్రహం ఉంది. అంతవరకూ నాకు తెలియలా, కృష్ణమూర్తి గారికి బుద్ధుడిపై అంత అభిమానం ఉందని. 'అస్తాచల్ అనే చిన్నకొండపైకి తీసికెళ్ళి అక్కడ పిల్లలు సూర్యాస్తమయం సమయంలో వ్యాయామం చేసే స్థలాన్ని చూపారు. భొజనాలశాలలొ భోజనం దక్షిణాది పద్ధతిలో చాలా రుచిగా ఉంది. కాకపోతే ఆ రాజగోపాల్ గారిని వేరే చోట కూర్చోపెట్టి ఆయనకు ప్రత్యేకమైన భోజనం పెట్టడం నాకు నచ్చలేదు. ఆయన ప్రత్యేక భోజనానికి ఆరోగ్యవిషయమైన కారణాలు ఉండొచ్చునని నాకు ఆ సమయంలో తట్టలేదు.

భోజనం చేసి రాజగోపాల్ గారికి ధన్యవాదాలు చెప్పి తిరిగి ఆ వనం ద్వార నడిచి రోడ్డు దగ్గరికి వచ్చేశాం. ఆఫీసుమీదగా వచ్చినప్పటికీ, బస్సుకు టైమైపోతోందనో, మరెందుకో, ఆ అఫీసులోకి వెళ్ళి సుందరం గారిని కలవడం జరగలేదు. (ఆయన్ని ఎన్నో సంవత్సరాల తరవాత, ఆక్స్ఫర్డ్, ఒహాయోలో కృష్ణమూర్తి శతాబ్దోత్సవాల సందర్భంలో కలిశాను. ఆ సమావేశం విషయం కొంచెం వివరంగా వచ్చే అధ్యాయంలో రాస్తాను.)

ఆంధ్రా యూనివర్సిటీలో లెక్చరరుగా పనిచేస్తున్నప్పుడు రాజా భద్రిరాజు కృష్ణమూర్తిగారి సహాయంతో బర్కిలీ, కాలిఫొర్నియలో భాషాశాస్త్రం చదువుకుండేందుకు అమెరికా వెళ్ళారు. ఆయన నాకు రాశారు నేను అప్పటికే ప్రచురించిన వ్యాసాలను అనుబంధంచేస్తూ బర్కిలీ ఫిలసఫీ డిపార్టుమెంటుకు అప్ప్లై చెయ్యమనీ, ఆ కాగితాల్ని తనకు పంపుతే తను ఆ డిపార్టుమెంటులో దాఖలు చేస్తాననీ. నేను అంతకు ముందు ఒకసారి న్యూయర్కులో ఒక ప్రొఫెసరుకి రాశానుగానీ ఆయన యూనివర్సిటీ మరడంతో నా ఉత్తరానికి సమాధానం రాయలేదు. రాజాగారు అడిగినట్లుగానే నేను కాగితాల్ని పంపుతే ఆయన వాటిని ఫిలాసఫీ డిపార్టుమెంటులో ఇచ్చారు. వాళ్ళకి నా వ్యాసాలు నచ్చి ఉండుండాలి, వాళ్ళు 1962 జూన్లో నాకు టీచింగ్ అసిస్టెంటు ఉద్యోగం ఇస్తూ డిపార్టుమెంటులో Ph. D.కి చదువుకోవడానికి ప్రవేశం ఇచ్చారు.

వాళ్ళదగ్గర్నించి వచ్చిన ఆ ఎప్పాయింటుమెంటు వుత్తరం సరిగ్గా మా నాన్న చనిపొయిన నాలుగోరోజుకు వచ్చింది. నేను అలా అ అప్లై చేశానని అయనకు తెలియదు. తెలిసి ఉంటే ఆయన ఆ షాకుకి గుండెప్రమాదం వచ్చి చచ్చిపోయుండేవాడనుకుంటాను; ఎందుకంటే, ఒకసారి ఆయన ఇంకా బ్రతికేఉన్న రొజుల్లో నేను పైచదువులకని అమెరికా వెళ్దామని ఉంది అని ఒకమాటు అనగానే అయన మొహం తెల్లబడి పోయింది. తన కొడుకు అమెరికా వెళ్తే ఇక వాణ్ణి పొగొట్టుకున్నట్టే అని అయన నమ్మకం. మానాయనమ్మ బాగోగులు చూచే భారం హైదరబాదులో ఉంటున్న మా అన్నయ్య మీద వదిలేసి, బెజవాడలో పాత వూళ్ళో ఉన్న స్థలం ఒకటి విమానం ఖర్చులకని అమ్మేసి అమెరికా వచ్చాను. తను బతికున్న ఇంకో రెండేళ్ళూ, మా నాయనమ్మ తనని వదిలేసి వెళ్ళిపోయానని శాపనార్ధాలు పెడుతూనే ఉండేదట.

అమెరికాలో బర్కిలీలో చదువుకుంటూండగా, మొదటి ఏడాదే నాకు హారియట్ అనే అమెరికన్ సహాధ్యాయినితో పరిచయం అయి, ఆమెతో ప్రేమలో పడ్డాను. అయితే అది పూర్తిగా సఫలమవ్వలేదు. అది మూడేళ్ళు కుంటుడు బండిలాగా నడిచి, నా జీవితాన్ని చివరికి ఒక సంక్షోభంలో ముంచింది.

అంతవరకూ నేను కృష్ణమూర్తిగారి బోధలధ్వార నేర్చు కున్న ఆత్మజ్ఞానం అంతా నిష్ప్రయోజనమైంది. ఆరోజు ఆ అమ్మాయికి కనీసం ఒక 20 సార్లు అయినా ఫోను చేసి ఉంటాను, ప్రతిసారీ ఆమె ఫొను పెట్టేస్తూండగా. ఇక నా వ్యధ ఏమని చెప్పేది! ఆరాత్రి పక్కమీద దిండులో తలపెట్టుకొని కుళ్ళికుళ్ళి ఏడ్చాను -- జీవితంలో ఎక్కడైనా ఎవ్వరైనా నన్ను ప్రేమించే వాళ్ళుండరా అని. అప్పుడు జే. కృష్ణమూర్తి గారి బోధలు ఈ వివిధంగా పనిచేశాయి: "నీకు ఆ అమ్మాయి మిదుండేది ప్రేమ కాదు; నువ్వు ఆమె మీద మానసికంగా ఆధారపడి దానినే ప్రేమ అనుకుంటున్నావు. ఆసలు ప్రపంచంలో నీ జీవితంలో నిన్ను ఎవరైనా ఎందుకు ప్రేమించాలి? ఎవరూ నిన్ను ప్రేమించకపోతేనేం?" ఈ ప్రశ్నలు నాకు తోచగానే నా మనసులోని క్షోభంతా తుడిచిపారేసినట్టుగా పోయింది, జేబులోంచి చేతి రుమాలు తీసి పడేసినట్టుగా. ఎంతో తీర్పి వచ్చి మనసు తేలికగా అయిపోయింది. అప్పటినించీ నేను ఎంతోమంది స్త్రీలతో ప్రేమ సల్లాపాలు కొనసాగించినా, నేను వాళ్ళమీద ఎప్పుడు మానసికంగా ఆధారపడలేదు. పైగా ఇప్పుడు నా ఉద్దేశంలో మనకు మానసికంగా ఒచ్చే సమస్యల్లో చాలా భాగం పరీక్షించని ప్రాతిపదికలపైనా, పునాదుల (unexamined premises) పైనా ఆధారపడి ఉంటాయి; ఆప్రాతిపదికల్ని పరీక్షించి ప్రశ్నించిన తత్క్షణమే అవి నివారకమైపోతాయి.

ఈ క్లిష్ట పరిస్థితిలోంచి బయట పడడానికి ఫలితంగా నాకు భారతీయ సంస్కృతినించీ, పాశ్చాత్య సంస్కృతినించీ కూడా వేళ్ళు పీకుడుబడ్డాయి.

కృష్ణమూర్తి గారి బోధల్నించి నేర్చుకున్నది ఫలానా అని నిర్దిష్టంగా చెప్పడం కష్టం. చాలాకాలం, ఆలోచనలని నిర్లిప్తంగా అవేక్షించడం అనేది నిత్యమూ చేసేవాణ్ణి. కాని అది ఒట్టి ప్రయత్నంగానే మిగిలిపోయి ప్రగతి ఏమాత్రమూ జరగకుండా పోయింది. ఆ వీక్షణ వల్ల నాకు నా బంధాలనించి పూర్తిగా విముక్తి వచ్చిందనే నమ్మకం లేదు. అలా వచ్చే ఉంటే ఈ అల్లోచనలన్నీ ఇంకా ఎందుకు వస్తూ ఉండాలనేదే నా ప్రశ్న. ఈ నిర్లిప్తావేక్షణ (passive awareness) కి అంతం ఎప్పుడైనా ఉంటుందా?

కానీ మన బాహ్యాంతర సమస్యలన్నిటకీ మన ఆలోచనే కారణం అనేది నేను స్పష్టంగా ఆయనదగ్గర నేర్చుకున్నాను. పూర్వానుభవ ప్రభావం (conditioning) ఈ అలోచనలకు కారణం. అయితే అవి ప్రయత్న పూర్వకంగా పోయేవి కాదు. ప్రయత్నం మరింత అంతస్సంఘర్షణని మాత్రమే తెచ్చిపెడుతుంది.

1972 లో నా Ph.D. అయిపోయి నాకు డిగ్రీ వచ్చింది. 1973 ప్రాంతాల్లో నేను లిండా అనే యువతితో బర్కిలీలో కాపరం ఉండేవాణ్ణి. అప్పుడే 1973లో మా అమ్మాయి శ్యామల పుట్టింది. నేను 1967-68 సంవత్సరంలో కాలిఫోర్నీ యూనివర్సిటీ, రివర్సైడులో పనిచేస్తున్నప్పుడు బాబ్ గ్రౌస్ అనే అతను నా క్లాసుల్లో విద్యార్ధిగా చదువుకుంటూండేవాడు. తరవాత అతన్ని తిరిగి 1971 ప్రాతాంతాల్లో బర్క్లీలో కలిసినప్పుడు, లిండాని అతను పరిచయం చేశాడు. అతనితో స్నేహంకూడా అయింది. అతను ప్రోత్సహించి, కృష్ణమూర్తి గారు కాలిఫోర్నియా ఓహాయిలో స్కూలుల్లో టీచరుగా పనిచెయ్యాలనుకునే అభ్యర్ధులతో మాట్లాడతారని ఆహ్వానిస్తే, నేనూ, లిండా, మా పసిపాపా నా ఇంకో పాత విద్యార్ధి టోనీ విచర్ అనే అతని వోల్క్స్ వాగను బగ్గులో మాలిబూ అనే లాస్ ఏంజలిస్ దగ్గర ఉన్న ఊరుకి వెళ్ళాము. అక్కడ అల్బియన్ పాటర్సన్ అనే కృష్ణమూర్తి ఫౌండేషన్ ట్రస్టీ గారింట్లో మేమూ మరింకా చాలామంది అభ్యర్ధులూ కృష్ణమూర్తిగార్ని కలవడానికి సమావేశం అయ్యాము. అయితే కృష్ణమూర్తిగారు మాతో వ్యక్తిగతంగా కలిసి మాట్లాడకుండా, సమూహ "సంభాషణలో" మాట్లాడడం మొదలెట్టారు. నాకు అదంతా కొంచెం ఆశ్చర్యం వేసింది. అయినా ఎమైతేనేమని నేనూ సంభాషణలో పాల్గొంటూ ఆయన్ని ఒక ప్రశ్న వేశాను. ఆయన ఆ ప్రశ్నని సరిగా అర్ధం చేసుకోకుండా ఏదో మరో ధోరణిలో పడి అరగంటసేపు మట్లాడారు ఇంకో విషయంగురించి. నేను ఆయన పొరపాటుని వేలెత్తి చూపకుండా మాట్లాడకుండా విన్నాను. మీటింగు అయిపోయింతరవాత ఆ గది బయట ఆయన లిండాతో ఏదో కొద్దిగా మాట్లాడారు, పాప చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. అదయిపోయింతరవాత, నావేపు తిరిగి చూస్తూ నా దగ్గరికి వచ్చారు. నేను అయన కరచాలనం చేసి, "మిమ్మల్ని మళ్ళీ కలవడం ఎంతో సంతోషమండీ," అని అన్నాను, ఆయనకు నేను గుర్తుండి ఉండనని తెలిసికూడా. తరవాత మేము బర్కిలీకి తిరిగి వెళ్ళిపోయాము.

1974లో నాకు మాంటెరే పెనిన్సులా కాలేజీలో పర్మనెంటు ఉద్యోగం వచ్చి, సీసైడులో కుటుంబంతో కాపరం పెట్టాను. ఈ పరిస్థితుల్ల్లో నేను ఇంకా ఆ నిర్లిప్తావేక్షణ తోనే మధనపడుతున్నాను. 1977-78 ప్రాంతాల్లో మా స్నేహితురాలు సోనియా నెల్సన్ అనే ఆవిడ అక్కడ కృష్ణమూర్తి స్కూలులో యోగమూ, సిరామిక్సు బోధిస్తూఉండేది. ఆమె నన్నూ మా అమ్మయినీ ఓహాయికి రమ్మని ఆహ్వానించినప్పుడు (నాకు ఆపాటికి లిండాతో 1975 ప్రాంతాల్లో విడాకులు అయ్యాయి), నేనూ మా అమ్మాయీ ఆ ఊరికి వెళ్ళాము. ఆప్పుడు మళ్ళా కృష్ణమూర్తిగారి ఉపన్యాసాన్ని విన్నాను. అప్పుడు దేవిడ్ బోం అనే శాస్త్రజ్ఞుడు, కృష్ణమూర్తి గారి స్నేహితుడు అక్కడే ఉన్నాడు. నేను ఆయన గురించి సోనియాతో ఇలా అన్నాను: "పూర్వం ఎప్పుడూలేని అతిభౌషికవిషయాలన్ని కృష్ణమూర్తిగారి నోట్లో ఈయన పెడుతున్నాడు,"అని. ఆమె మధ్యాన్నం భోజన సమయంలో ఆయన్నే ఆ ప్రశ్నని అడగమని, ఏదో సందడిలో ఉన్న ఆయనకి నన్ను పరిచయం చేసింది. నేను నా ప్రశ్నని అడిగితే, ఆయన తను అట్లాంటిదేమీ చెయ్యడంలేదని నా ప్రశ్నని క్లుప్తంగా కొట్టేసి గబగబా నడిచి వెళ్ళిపొయ్యాడు.

మళ్ళా 1980 ప్రాంతాల్లో కృష్ణమూర్తి గారి చింతనమీద మా కాలేజీలో ఒక కోర్సు ప్రవేశ పెట్టి,

క్లాసులో కొందరి విద్యార్థుల్ని నా భార్య వెండీతో సహా కృష్ణమూర్తిగారి ఉపన్యాసాల్ని వినడానికి తీసుకు వెళ్ళాను. అప్పుడు ఆయన ఉపన్యాసాల్ని ఆఖరిసారిగా విన్నాను.

అదే సమయంలో మన సాంఘిక వ్యవస్థ్హల విషయంలో తిరుగుబాటుచేసే ఆయన రోజలిన్ రాజగోపాల్ గారితో వివాదపడి ఆ విషయంలో కోర్టుకు వెళ్ళాడని విని ఆయనమీద కొంచం మొహం మొత్తిపోయి ఆయనకీ అయన బోధలకీ తిలోదకాలిచ్చాను.

Fragmentation, Meditation and Transformation: The Teachings of J. Krishnamurti అనే పేరుతో Journal of Indian Council of Philosophical Research లో 1988 లో ఒక విమర్శనాత్మకమైన వ్యాసం పబ్లిష్ చేశాను. దాన్లో కృష్నమూర్తి బోధనలను అన్వయం చేసుకోవడంలో ఉండే ఇబ్బందుల్ని కొన్నింటిని ఉదాహరణలతో చర్చించాను.

Tuesday, January 1, 2008

2. ప్రేమ, నిరాశ, జీవితం మీద నిరాసక్తి:


'చలం'


నేను విజయవాడలో ఇంటర్మీడియట్ పరీక్షలు తప్పి ఎమ్మెస్సెం బండెక్కి పాసవడానికి ప్రయత్నించే రోజుల్లో, మా సంగీతం మాస్టారి భార్యతో ప్రేమ వ్యవహారంలో పడ్డాను. అప్పుడే నాకు నా జీవితంలో మొదటి సారిగా ప్రేమంటో ఏమిటో, ప్రేమలోపడడమంటో ఎమితో చవి చూశాను. జీవితం ధన్యమైందనుకున్నాను. జీవితంలో నాకు మొదటిసారిగా ప్రేమను రుచిచూపిన నా ప్రియురాలికి నేను
ఎంతో కృతజ్ఞుణ్ణి.

అయితే ఆమెను లేవదీసుకుపొయ్యే ప్రయత్నానికి మా అన్నయ్య నాకు చేసిన 'దోహదం' వల్ల విఘ్నం కలిగి ఆమె తన ఇంటికి తిరిగి పోవాల్సి వచ్చింది. తరవాతకూడ మేం అప్పుడప్పుదు చాటుగా కలుసుకున్నా, మా ప్రేమ మాత్రం సఫలమవలేదు. ఆ లోటు నా జీవితాన్ని బాగా దెబ్బ తీసింది; దేనిమీద కూడా ఆసక్తి లేకుండా, జీవితమంటేనే విరక్తికలిగి నాలుగయిదేళ్ళు గడిపాను. Boredom అనేది నా జీవిత సమస్యగా తయారయ్యింది.

1956-57 ప్రాంతాల్లో మద్రాసులో యూనివర్సిటీలో ఒక సంవత్సరం M.Litt రిసెర్చికని చేరాను. ఆకాలంలోనే నా సమస్యనిగురించి చలంగారితో సంప్రదిద్దామని అయనకి తిరువన్నామలైకి ఒక పోస్టు కార్దు రాశాను. చలంగారి రచనలతో నాకు చాలా కాలంగా పరిచయమే. వాటి ప్రభావం నామీద బాగా ఉంది. అందుకనే ఆయనకి రాశాను. మెషీనులో పడేస్తే వచ్చినట్టుగా ఆయన దగ్గర్నించి వెంటనే సమాధానం వచ్చింది. అప్పుడు అయన్ని కలవడానికని నేను రైలుమీద ప్రయాణం చేసి తిరువణ్ణామలైకి వెళ్ళాను.

వారిల్లు తిరువన్నామలై ఊరిచివర రమణాశ్రమానికి ఎదురుగా ఉండేది. దానిపేరు "రమణస్థాన్". ఆయనా ఆయన కుటుంబం నన్ను ఎంతో ఆదరంగా చూశారు. ఆయన కూతురు సౌరీసుగారి మార్గదర్శకత్వంలొ ఆ కుటుంబం నడుస్తోందని తెలుసుకున్నాను. తన తపోఫలం వల్ల ఈశ్వరుడు ఆమెకి ప్రత్యక్షమవడమే కాక, ఆమెద్వారా మాట్లాడుతూ, ఆ కుటుంబంలోని వారి జీవితాల్నీ, వారి బంధుమిత్రుల జీవితాల్నీ తీర్చి దిద్దుతున్నాడని వారందరికీ నమ్మకం ఉండేది.

నేను సౌరీసుగారితో దాదాపు ఒక గంటదాకా ఏకాంతంగా మాట్లాడాను. నేను దేవుడి విషయాలేవీ నమ్మలేనన్నాను. ఆవిడ నమ్మకం ఉండితీరాల్సిందేనని పట్టుబట్టింది. చివరికి open mind ఉంచుకోమని సలహా ఇచ్చింది. నేను సరేనన్నాను.

ప్రతిరోజూ సాయంకాలం భోజనాలయింతరవాత భజన సమావేశం జరిగేది. నేను దాన్లో పాల్గోలేపోయినా అక్కడే కుర్చీలో కూర్చుని వింటూండేవాణ్ణి. నాకు సంగీతమన్నా, భజనలన్నా చాలా ఇష్టం. ఆమె మీరా భజనలూ, 'చంద్రశేఖర పాహిమాం' అనే భజనా,తక్కిన సమయాల్లో వెంకిపాటలూ పాడుతూండేది. సౌరీసుగారి పాటలుకూడా నాకు బాగా నచ్చాయి. (అమెరికానించి ఒకమాటు వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు, నేను అడిగితే నాకోసం ఆమె వెంకిపాటలు పాడారు. నేను వాటిని రికార్డు చేసుకున్నాను కూడాను. అవి నాదగ్గర ఇప్పటికీ ఉన్నాయి.) చూడడానికి ఆమె ముఖంలో ఏవో తెలియని gracefulగా ఉండే కవళికలు కనబడుతూండేవి, ఆమె ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడుకూడా.

చలంగారుకుడా పాడుతూండేవారు. ఆయనకూడా సంగీతం నేర్చుకున్నారని తెలిసింది. ఆయన గాత్రం ఎంతో ఆవేదనతో అతి దీనంగా ఉండేది.

ఒకరోజు మధ్యాన్నం నేను ఆకలిగా ఉందంటే తనే స్వయంగా వంటింట్లోకి వెళ్ళి, కామాక్షి ఆకుతో పకోడీలు చేసి నాకు పెట్టారు. ఎంత ఆప్యాయతో!

అక్కడికి వెళ్ళినప్పుడు రమణాశ్రమ దర్శనంకూడాచేసుకునేవాణ్ణి. రమణమహర్షిని నా చిన్నతనంలో మా నాయనమ్మ చూసింది. అప్పుడు ఆమె ఇంటికి తీసుకొచ్చిన "నేనెవరు" అన్న చిన్న పుస్తకాన్ని చదివాను. ఆది నాకు స్వతహాగా తోచిన ప్రశ్నేగనక, ఆయనంటే నాకు ఎంతో గౌరవం.

నా ప్రేమ వ్యవహారం గురించీ, జీవితంపై నా నిరాసక్తిగురించీ నేను చలంగారితో చెప్పుకున్నాను. ఆయన నాపై సానుభూతి చూపారు. అయితే అన్నిబాధ్యలూ ఆయన ఈశ్వరుడికి వదిలేశారు గనక నాకు ప్రత్యేకంగా ఏమీ సలహా ఇచ్చినట్టు గుర్తులేదు. ఈవిషయంలో నేను మద్రాసునించి ఒకసారి ఉత్తరం రాసినప్పుడు ఆయన 8 పేజీల సుదీర్ఘమైన సమాధానం రాశారు. (ఏదో నిస్పృహలో ఉన్న సమయంలో దాన్ని చించిపారేశాను.) నాబాధలన్నిటికి నా కోర్కెలే కారణమనే ధోరణిలో ఏదో అధ్యాత్మికంగా ఆయన రాశారు.

1960 ప్రాంతాల్లో సౌరీస్ ఆ ఏడాది ఫలానా రోజున ఒక ప్రళయం రాబోతున్నదనీ, దానికి కావాల్సిన రక్షణ ప్రయత్నాలన్నీ చేసుకోమనీ ఈశ్వరుడిపేరట అందరికీ ఉత్తరాలు రాయించింది. గోరాగారికి కూడా ఈ విషయం తెలిసి ఆయన అపహాసం చేశారని, ఆ కబురంతా అబద్ధమని సవాలు చేశారనీ గుర్తు. చలం ఆ విషయాన్ని పూర్తిగా నమ్మాడు తక్కినవిషయల్లాగానే. తీరా ఆప్రళయం ఏమీ రాకపోయేటప్పటికి ఆయనకు సౌరీసు మీదా, ఆ ఈశ్వరునిమీదాకుడా కొంచం నమ్మకం సన్నగిలింది. కాకపోతే సౌరీస్ మీద ఇంకా పూర్తిగా నమ్మకంపోలేదు; ఆమె చెప్పిన వివరణలు విని కొంచం తనకుతాను సరిచెప్పుకున్నాడు.

మరో విషయం: గోరాగారు ఒకప్పుడు చలంగార్ని చూడ్డానికి తిరువణ్ణామలై వెళ్ళారని విన్నాను, చలాన్ని ఆ ఈశ్వర భక్తీ అన్నీవదిలేసి తనతో వచ్చి సంఘ సంస్కరణోద్యమంలో పాల్గొనమని ఆహ్వానిద్దామని. చలం దానికి సుతరామూ ఒప్పుకోలేదని వేరే చెప్పక్కర్లేదు. ఆ విషయంలో గొరాగార్నిగురించీ, ఆయన నాస్తికత్వం గురించీ చలం ఇలా అన్నాడు:"గోరాగారు దేవుడులేడంటూ విసిరే చేతి వూపులోకాక దేవుడు వేరే ఎక్కడున్నాడు?" ఈ సమాధానాన్ని బట్టి చలం కున్న ఉదారబుద్ధి ఎంతటిదో తెలుసుకోవచ్చు.

నేను అమెరికాకు వచ్చింతరవాత కూడా ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తూండేవాణ్ణి. ఆయన ప్రతివుత్తరాన్నీ "నారాయణ గార్కి" అని సంభోధిస్తూ "ఈశ్వరాశీర్వచనాల్తో" అని ముగించేవారు. నేను అమెరికాలో ఉంటూండగా ఆయన కధల్ని రెంటిని ఇంగ్లీషులోకి తర్జుమా చేసి ఇంగ్లండులో ఆర్గోసీ అనే పత్రికలోనూ, షికాగో యునివెర్సిటీ Southeast Asian Journal లోనూ ప్రచురణ చేయించాను. 1990 ప్రాంతాల్లో ఆయన రాసిన "సుధ" అనే పద్యకావ్యాన్ని నేను ఇంగ్లీషులోకి (సౌరీస్, జూలీ వెల్లింగ్స్, ఎలియట్ రాబెర్ట్స్ ల సహాయంతో)అనువాదం చేశాను. దాన్ని UNESCO వారి పోషణతో మోతీలాల్ బనార్సీదాసీ (Delhi)అనే ప్రచురణకర్తలు ప్రచురించారు.


చలంగారి మృతి తరవాతకూడా కొద్దిసార్లు సౌరీసును చూడడానికి వెళ్ళానుగానీ, పైకి ఆమె సుముఖంగానే వున్నట్టు కనిపించినా, రచనలో తానుకూడా పాల్గొన్న "సుధ" బాగోలోలేదనీ, దానికి మూలంలోని స్పిరిటు రాలేదని అన్నది. వెళ్ళేప్పుడు కూడా ఆమెని శెలవు అడగడానికి అమెని తోటలో వెతుక్కోవాల్సి వచ్చింది, అమెకు నెను వెళ్తున్నాని తెలిసుండికూడా. చాలారోజుల తరవాత తెలిసింది, మా స్నేహితుడు చంద్రశేఖర్ చెబితే, ఆమెకి చిన్నప్పణ్ణించీ గుడ్ బైలు చెప్పడం అంటే ఇష్టంలేదని.


చలంగారింట్లోనే నర్తకి అనే అవిడ ఉండేది. (ఇప్పుడు ఆమె మరణానికి దాపుగా ఉన్నది.) ఆమెతో నాకు బాగా పరిచయం ఉంది. నేను నా కుమార్తెను ఒంటరిగా పెంచుకోవాల్సిన సమయంలో ఈదేశానికి వచ్చి నన్ను పెళ్ళిచేసుకొని నాభార్యగా ఉండి మా అమ్మయిని పెంచమని మా స్నేహితుల ద్వరా కబురు పంపించాను. అప్పుడు చలం చాల వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆమె ఆయనకి సేవలు చేస్తూండేది. అందుకని అమెని ఆయన వెళ్ళనివ్వరని అంది.

ఆమెద్వారానే నేను మా స్నీహితులూ గురువుగారైన యూ. జీ. కృష్ణమూర్తి గారిని కలిసే అదృష్టంపట్టింది. ఆయనతోటి సంపర్కం పాతికేళ్ళ పైగా జరిగి, పోయిన మార్చిలో ఆయన మరణంతో అంతమైంది. ఆవిషయం గురించి తరవాత రాస్తాను.